వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ మూడో సీజన్ ప్రారంభమైన తరుణంలో, భారత్-పాకిస్తాన్ మాజీ క్రికెటర్ల మధ్య ఉండే ఉత్కంఠభరితమైన పోరును చూడాలనుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పాల్గొనడానికి పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టు ఎంతగానో ఆసక్తి చూపించినప్పటికీ, వారు అధికారికంగా ఈ టోర్నీ నుండి వైదొలగాల్సి వచ్చింది. దీనికి కారణం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించడమే. అయితే, ఈ ఎన్ఓసీ నిరాకరణ వెనుక గత సీజన్ నాటి ఒక పెద్ద వివాదం దాగి ఉంది.
Also Read : భారత క్రికెట్ లో సంచలన పరిణామం..!
తాజా కథనాల ప్రకారం, గత సీజన్ లో జరిగిన కొన్ని పరిణామాలే ఈ వివాదానికి కారణం. కిందటి సీజన్ లో పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో, పాకిస్తాన్ ఛాంపియన్స్‌తో ఆడటానికి ఇండియా ఛాంపియన్స్ జట్టు నిరాకరించింది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌తో పాటు సెమీఫైనల్‌ను కూడా భారత జట్టు బహిష్కరించడంతో పాకిస్తాన్‌కు వాకోవర్ లభించింది. భారత జట్టు తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా పరిగణించిన పీసీబీ, ఈసారి తమ ఆటగాళ్లను పంపడానికి ఒక కఠిన షరతు పెట్టింది. గత సీజన్ లో మ్యాచ్‌లు ఆడనందుకు ఇండియా టీమ్ లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని పీసీబీ డిమాండ్ చేసింది.
Also Read : ఏపీలో తాగునీటి విప్లవం.. రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు మహర్దశ!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెట్టిన ఈ క్షమాపణ కండిషన్‌ను టోర్నమెంట్ నిర్వాహకులు పూర్తిగా తిరస్కరించారు. భారత ఆటగాళ్లు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేయడంతో వివాదం మరింత ముదిరింది. నిజానికి పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టు యజమాని, ఆటగాళ్లు ఈ టోర్నీ ఆడటానికి ఎంతో ఆసక్తి చూపించారు. ఇందుకోసం కొందరు ఆటగాళ్లు ఇప్పటికే దుబాయ్ కూడా చేరుకున్నారు. వారు పీసీబీని రిక్వెస్ట్ చేసినప్పటికీ, బోర్డు మాత్రం తన పంతాన్ని వీడలేదు. ఫలితంగా, బోర్డు అధికార పరిధిని గౌరవిస్తూనే.. ఈ అంతర్జాతీయ లెజెండ్స్ వేదికపై తమ దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కోల్పోయినందుకు తీవ్ర నిరాశ చెందుతున్నామని పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టు ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేసింది.


