Friday, September 18, 2026 01:04 PM
Friday, September 18, 2026 01:04 PM

వైసీపీలో విచిత్ర పరిస్థితి.. ఆదేశం ఉంది.. అభ్యర్థి ఎక్కడా..?

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి పెరుగుతున్న వేళ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరో రకమైన చర్చ మొదలైంది. పంచాయతీ నుంచి మున్సిపాలిటీ వరకు ప్రతి స్థానంలో పార్టీ అభ్యర్థులను బరిలోకి దించాలని అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలు ఇస్తోంది. సెప్టెంబర్ ఆరంభంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రతి స్థానంలో పోటీకి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి పార్టీని పునర్నిర్మించుకోవాలని, అభ్యర్థులను ముందుగానే గుర్తించాలని సూచించారు. అయితే.. అధిష్ఠానం ఆదేశాలు ఒకవైపు ఉంటే.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోలా ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకత్వంలో పోటీపై ఆసక్తి తగ్గుతోందనే మాట బాగా వినిపిస్తోంది. తాజాగా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. గ్రామాలు, వార్డుల్లో అభ్యర్థుల కోసం పార్టీ ఇన్‌ఛార్జీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read: దేశంలోనే నెంబర్ వన్.. వైద్య రంగంలో ఏపీ సరికొత్త రికార్డు..!

స్థానిక ఎన్నికల్లో పార్టీ ఉనికిని చాటుకోవాలంటే ప్రతి గ్రామం, ప్రతి వార్డులో అభ్యర్థి ఉండాలి. కానీ పోటీ చేయగల ఆర్థిక, రాజకీయ సామర్థ్యం ఉన్న స్థానిక నేతలు ముందుకు రావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారాన్ని కోల్పోయిన వైసీపీకి.. ఇప్పుడు జరుగుతున్న స్థానిక ఎన్నికలు క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని పరీక్షించే మరో కీలక సందర్భంగా మారాయి. దీంతో ఒక్కో నియోజకవర్గంలో గ్రామం, మండలం, వార్డు స్థాయిలో అభ్యర్థుల ఎంపిక పార్టీ ఇన్‌ఛార్జులకు ప్రధాన స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడం అంటే కేవలం పార్టీ టికెట్ తీసుకోవడం మాత్రమే కాదు. నామినేషన్ నుంచి ప్రచారం వరకు ఆర్థిక వ్యయం, వ్యక్తిగత ప్రతిష్ఠ. స్థానిక రాజకీయ సమీకరణాలు.. అన్నీ అభ్యర్థి భుజాలపైనే పడతాయి. అందుకే.. ఓడిపోయినా పార్టీ అండగా ఉంటుందా..? ఎన్నికల ఖర్చులో పార్టీ నుంచి ఏమైనా సహాయం ఉంటుందా..? ఎన్నికల తర్వాత కూడా రాజకీయంగా తమకు రక్షణ ఉంటుందా..? అనే ప్రశ్నలు స్థానిక నాయకుల్లో ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

2019-24 మధ్య జరిగిన స్థానిక ఎన్నికల సమయంలో ఏకగ్రీవాలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అధికార బలంతో ప్రత్యర్థులను పోటీ నుంచి తప్పించారన్న ఆరోపణలు వచ్చాయి. ఇక నాటి వైసీపీ నేతల దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి కూడా. అయినా సరే ఆ ఆరోపణలను వైసీపీ అప్పట్లో ఖండించింది. ఇప్పుడు అధికార మార్పు తర్వాత అదే స్థానిక రాజకీయ వాతావరణంలో తాము పోటీచేస్తే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయన్న ఆందోళన కొంతమంది స్థానిక నేతల్లో ఉందనే వాదన వినిపిస్తోంది. అయితే ఇది ప్రధానంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న అభిప్రాయం.

Also Read: కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూములపై రంగంలోకి రెవెన్యూ శాఖ..!

జగన్ మాత్రం స్థానిక పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రతి స్థానంలో అభ్యర్థులను నిలబెట్టి, ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకూడదని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని, ప్రజలతో నిరంతరం మమేకం కావాలని సూచించారు. కానీ అసలు పరీక్ష ఇక్కడే మొదలవుతోంది. అధిష్ఠానం ఆదేశాలు ఇవ్వడం ఒక ఎత్తు.. ఆ ఆదేశాలను అమలు చేసేంత బలమైన స్థానిక నాయకత్వాన్ని సిద్ధం చేయడం మరో ఎత్తు. హెచ్చరికలతో అభ్యర్థిని నిలబెట్టవచ్చు. కానీ ఎన్నికల రోజున అతడి వెంట నిలిచే కార్యకర్తలు, ఓటర్లను కలిసే నెట్‌వర్క్‌, ప్రచారానికి కావాల్సిన వనరులు. ఓటమి వచ్చినా పార్టీ అండగా ఉంటుందనే నమ్మకం.. ఇవన్నీ క్షేత్రస్థాయిలో కీలకం. అందుకే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం అధికార, ప్రతిపక్షాల మధ్య పోరుగా మాత్రమే కాకుండా.. వైసీపీ తన గ్రామస్థాయి రాజకీయ యంత్రాంగాన్ని ఎంతవరకు పునరుద్ధరించుకోగలిగిందో పరీక్షించే వేదికగా కూడా మారనున్నాయి. ఆదేశాలతో అభ్యర్థులు వస్తారా?.. లేక భరోసాతోనే బరిలోకి దిగుతారా?.. స్థానిక పోరు దీనికి సమాధానం చెప్పనుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

నిర్ణయం చంద్రబాబు.. పవన్...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై...

దేశంలోనే నెంబర్ వన్.....

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ జాతీయ...

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

పోల్స్