Monday, September 14, 2026 11:52 PM
Monday, September 14, 2026 11:52 PM

డీఎస్సీ.. జగన్ పొలిటికల్ గేమ్..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వేస్తున్న రాజకీయ పావులు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీపైన, మంత్రి నారా లోకేష్‌ పైన పదే పదే తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న జగన్.. తాజాగా తన విమర్శల పరిధిని మరింత విస్తరించారు. డీఎస్సీ వ్యవహారంలో టీడీపీ ప్రభుత్వాన్ని మాత్రమే కాకుండా.. కూటమిలోని బీజేపీ, జనసేనలను కూడా రాజకీయంగా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ‘డీఎస్సీలో అక్రమాలు జరిగితే.. బీజేపీ, జనసేనలు కూటమి నుంచి బయటకు రావాలి’ అంటూ జగన్ చేస్తున్న డిమాండ్ ఇప్పుడు రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారింది. ప్రభుత్వం ఎన్ని వివరణలు ఇచ్చినా, గణాంకాలు వెల్లడించినా తన ఆరోపణలపై జగన్ వెనక్కి తగ్గటం లేదు. అదే అంశాన్ని కూటమి భాగస్వాముల మధ్య రాజకీయ ప్రశ్నగా మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Also Read : బాబు పోలవరం Vs కేసీఆర్ కాళేశ్వరం.. ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు

2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడం వైసీపీపై తీవ్ర ప్రభావం చూపింది. మూడు పార్టీల ఓట్ల సమీకరణతో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, తదుపరి రాజకీయ సమరాల నేపథ్యంలో ఆ కూటమి బంధంలో ఎక్కడైనా చిన్న చీలిక ఏర్పడినా.. అది తమకు రాజకీయంగా ప్రయోజనం కలిగిస్తుందనే అంచనాతో వైసీపీ వ్యూహాలు రచిస్తోందనే చర్చ ఉంది. అందుకే డీఎస్సీ అంశాన్ని కేవలం ప్రభుత్వ వైఫల్యంగా కాకుండా.. మొత్తం కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నైతిక సమస్యగా మార్చే ప్రయత్నం జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జగన్ రాజకీయ ప్రయాణంలో కేంద్రంలోని బీజేపీ నాయకత్వంతో సాన్నిహిత్యం ఉన్న విషయం రాజకీయ వర్గాల్లో చాలాకాలంగా చర్చలో ఉంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వంపైన, ప్రధాని నరేంద్ర మోదీపైన జగన్ నేరుగా తీవ్రస్థాయి దాడులు చేయడం అరుదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు టీడీపీతో బీజేపీ కొనసాగుతున్న రాజకీయ బంధాన్ని ప్రశ్నిస్తూ.. మరోవైపు జనసేన కూడా కూటమి నుంచి బయటకు రావాలంటూ జగన్ డిమాండ్ చేయడం వెనుక భవిష్యత్ రాజకీయ వ్యూహం ఉందా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇన్నాళ్లూ కేంద్రంతో సాన్నిహిత్యాన్ని కొనసాగించినా ప్రతిపక్షంగా తమకు పెద్దగా రాజకీయ ప్రయోజనం దక్కలేదనే భావన వైసీపీలో ఏర్పడి ఉంటే.. ఇకపై రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వంపైనా దూకుడు పెంచే వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Also Read : లోకల్‌లో జనసేన దూకుడు.. టీడీపీ బ్రేకులు..!

అయితే జగన్ వ్యూహం ఆచరణలో ఎంతవరకు ఫలిస్తుందనేది మరో ప్రశ్న. ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య రాజకీయ అనుబంధం బలంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీతో కొనసాగిస్తున్న సమన్వయం, కేంద్రంలోని బీజేపీ నాయకత్వంతో కూటమి సంబంధాలు చూస్తే.. జగన్ డిమాండ్‌కు అనుగుణంగా బీజేపీ, జనసేనలు కూటమి నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఇప్పటికైతే కనిపించడం లేదు. అందుకే అధికార పక్షం ఈ వ్యాఖ్యలను జగన్ ‘మైండ్ గేమ్’ గా కొట్టి పారేస్తోంది. పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపడం, ప్రతిపక్షంగా వైసీపీని మళ్లీ యాక్టివ్ చేయడం. కూటమి ఐక్యతపై అనుమానాలు రేకెత్తించడం కోసమే జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కూటమి నేతలు ఎదురుదాడి చేస్తున్నారు.

ఇటీవల జగన్ చేసిన ‘కాక్రోచ్’ వ్యాఖ్యలు, రాజకీయ పోరాటంపై ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఈ నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాజకీయంగా ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా నిలబడే పోరాట పద్ధతిని సూచించేలా జగన్ మాట్లాడుతున్న తీరు.. పార్టీ క్యాడర్‌లో మళ్లీ ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నంగా కనిపిస్తోంది. అదే సమయంలో.. కూటమి ప్రభుత్వాన్ని ఒకే అంశంపై కాకుండా, దాని భాగస్వామ్య పార్టీలతో సహా మొత్తం రాజకీయ వ్యవస్థను ప్రశ్నించే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారా? అనే చర్చ కూడా సాగుతోంది.

Also Read : కూటమిలో సీట్ల పంచాయతీ.. తెగుతుందా.. లేదా..?

అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది పాత సామెత. నేడు బలంగా కనిపించే కూటములు రేపు మారవచ్చు. ప్రస్తుతం జగన్ చేస్తున్న డిమాండ్ వెంటనే ఫలితం ఇవ్వకపోయినా.. కూటమి భాగస్వాముల మధ్య రాజకీయ విభేదాలకు ఏదైనా అవకాశం ఏర్పడితే దానిని తనకు అనుకూలంగా మలచుకోవాలన్న వ్యూహం మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అంటే.. డీఎస్సీ వివాదం జగన్‌కు కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించే అంశమేనా? లేక కూటమి పునాదులను పరీక్షించే రాజకీయ ఆయుధమా? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. డీఎస్సీ వివాదం చల్లారుతుందా.. లేక దాని చుట్టూ కొత్త రాజకీయ సమీకరణాలకు బీజం పడుతుందా? జగన్ వేసిన ఈ రాజకీయ పావు ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాలి..

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

చంద్రబాబు అంటే ఇంత...

తెలుగు రాష్ట్రం ముక్కలైంది. రెండు రాష్ట్రాలుగా...

ప్రతిపక్ష నేతగా తలసాని.....

తెలంగాణ భవన్‌లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ...

లోకల్‌లో జనసేన దూకుడు.....

స్థానిక సంస్థల ఎన్నికలను జనసేన పార్టీ...

కూటమిలో సీట్ల పంచాయతీ.....

ఆలు లేదు.. సూలు లేదు.. కొడుకు...

ఏపీ అభ్యర్థులకు అలర్ట్.....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా...

రమా నందనాను వెంటాడుతున్న...

లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి...

పోల్స్