సప్త సముద్రాలు ఒంటి కాలితో ఈదిన వ్యక్తి.. చివరికి ఇంటి వెనుక ఉన్న మురికి కాలువలో పడి చనిపోయాడనేది సామెత. ఏపీలో కొందరు ఐపీఎస్‌ల పరిస్థితి అలాగే ఉంది. ఎంతో ఘనంగా బతికిన ఆ ఐపీఎస్ అధికారులకు.. ప్రస్తుతం చాలా గడ్డు కాలం నడుస్తోంది. పాలకుల అండదండలు వున్నాయనే అహంకారంతో.. ఇష్టారాజ్యంగా రెచ్చిపోయిన పోలీస్ అధికారుల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. ఇద్దరు ఐపీఎస్ అధికారుల ప్రస్తుత పరిస్థితి.. ఇంతకు ముందు ఎప్పుడూ ఏ ఒక్కరికీ ఇలాంటి పరిస్థిత ి ఎదురైనట్లుగా లేదనేది వాస్తవం.
Also Read : అక్టోబర్‌లోనే స్థానిక పోరు.. పెన్షన్లపై లోకేష్ గుడ్ న్యూస్..!
జగన్ మోహన్ రెడ్డి హయాంలో అధికారం అనే చక్రం తిప్పటమే కాదు.. అక్రమాలు చేయడంతో పాటు అహంకారం తలకెక్కి అడ్డగోలుగా వ్యవహరించిన సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, ఎన్.సంజయ్‌ల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే.. ఇంత బతుకు బతికి ఇంటెనకాల “చచ్చిన” చందంగా కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో నిఘా విభాగం చీఫ్‌గా చక్రం తిప్పిన పీఎస్ఆర్ ఆంజనేయులు చివరికి సస్పెన్షన్‌లోనే పదవీ విరమణ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ముంబై నటి కాదంబరి జెత్వానీ వేధింపుల కేసులో అరెస్ట్ అయి బెయిల్‌పై బయటకు వచ్చినా.. ఏపీపీఎస్సీ గ్రూప్-1 పేపర్ల మూల్యాంకనంలోనూ అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ అధికారులే ఇటీవల కోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసారు.
పీఎస్ఆర్ ఆంజనేయులు రెండేళ్లుగా సస్పెన్షన్‌లోనే ఉన్నప్పటికీ దాన్ని ఎత్తి వేయలేదు. అంతా బాగుంటే డీజీపీగా ఘనంగా పదవీ విరమణ చేయాల్సిన పీఎస్ఆర్ ఆంజనేయులుకు ఎలాంటి పోస్టింగ్ లేకుండానే గత నెల 31న సస్పెన్షన్‌లోనే సర్వీస్ సమాప్తం అయ్యింది. 2023లో మార్గదర్శి కేసు పేరుతో అనారోగ్యంతో ఉన్న ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు బెడ్ పై ఉన్న సమయంలో ఫొటోలు తీసి వైరల్ చేయడం.. చంద్రబాబు అరెస్టులో కీలక పాత్ర పోషించడం ద్వారా మాజీ సీఐడీ చీఫ్ ఎన్.సంజయ్ తీవ్ర వివాదాస్పద అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రామోజీరావును సుమారు ఐదు గంటల పాటు విచారించారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ వైద్య బృందం పర్యవేక్షణలో.. సీఐడీ అధికారులు అడిగిన 46 ప్రశ్నలకు రామోజీరావు సమాధానాలు చెప్పారు.
Also Read : ధోనీ మళ్లీ హుక్కా తాగుతున్నాడా..? రిషభ్ పంత్‌తో పార్టీ వైరల్..!
రూ.1.20 కోట్ల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, తీవ్ర క్రమశిక్షణా రాహిత్యం ఆరోపణలపై ఎన్.సంజయ్ 2024 డిసెంబర్ నుంచి సస్పెన్షన్‌లో ఉన్నారు. ప్రభుత్వం వివరణ అడిగినా 20 నెలలుగా సమాధానం ఇవ్వకపోవడంతో ఆయనపై విచారణ అధికారిగా హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్‌ను ప్రభుత్వం నియమించింది. మరి కొద్ది నెలల్లో పదవీ విరమణ చేయనున్న సంజయ్ కూడా సస్పెన్షన్‌లోనే ఇంటికి వెళ్లే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కాలమే సరైన సమాధానం చెబుతుందని నిరూపించేలా ఈ అధికారుల ప్రస్తుత పరిస్థితి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. చేసిన పాపాలను, కర్మ వదులుతుందా..! అప్పుడు అధికారంతో చెలరేగారు.. ఇప్పుడు అందుకు మూల్యం చెల్లించుకుంటున్నారు.. పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురు కాకూడదని ఐపీఎస్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. పాలకుల ఆదేశాలను, గుడ్డిగా అమలు చేసినందుకే ఇలాంటి పరిస్థితి ఆ ఇద్దరు ఐపీఎస్ అధికారులకు ఎదురైంది. పాలకుల ఆదేశాలను నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అమలుచేస్తే.. వారికి కూడా ఆ ఇద్దరు ఐపీఎస్ అధికారులకు ఎదురైన పరిస్థితి ఎదురవ్వటం ఖాయం. అధికారులారా “తస్మాత్ జాగ్రత్త”.

