తమిళనాడు శాసనసభ చరిత్రలోనే ఒక అపూర్వమైన, అత్యంత అరుదైన ఘటన చోటుచేసుకుంది. 2026 మే నెలలో కొత్త ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన టీవీకే అధినేత విజయ్ అసెంబ్లీలో తనకు కేటాయించిన సీటును కాసేపు పక్కన పెట్టారు. సభా సాంప్రదాయాల ప్రకారం స్పీకర్ జేసీడీ ప్రభాకర్ సీటుకు కుడివైపున ఉండే ప్రత్యేకమైన, విశాలమైన కుర్చీలో కూర్చోవాల్సిన సీఎం విజయ్.. మధ్యాహ్న సెషన్‌లో అనూహ్యంగా సాధారణ మంత్రుల వరుసలోకి వెళ్లిపోయారు.
Also Read : కేంద్రంపై విజయ్ మాల్యా సంచలన ఆరోపణలు..!
అక్కడ ముందు వరుసలో ఉన్న సభా నాయకుడు కేఏ సెంగోట్టయన్, మంత్రి ఆధవ్ అర్జునల మధ్య ఖాళీగా ఉన్న సాధారణ సీట్లో ఆయన కూర్చోవడం సంచలనంగా మారింది. ఒక ముఖ్యమంత్రి తన అధికారిక హోదా కలిగిన ప్రత్యేక సీటును వదిలి, తోటి మంత్రుల పక్కన ఒక సాధారణ సభ్యుడిలా కూర్చోవడం తమిళనాడు సభలో ఎప్పుడూ జరగలేదని తమిళ మీడియా అంటుంది. ఈ అరుదైన దృశ్యానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి.
Also Read : అదిరిపోయే రేంజ్‌తో సుజుకి తొలి ఎలక్ట్రిక్ ‘కే’ కారు..!
అక్కడ కూర్చుని ఆయన మంత్రులతో చాలా క్యాజువల్‌గా, నవ్వుతూ సంభాషించడం గమనార్హం. సీఎం విజయ్ ఈ సరికొత్త సీటింగ్ శైలి ద్వారా “తాను ప్రజాస్వామ్యబద్ధంగా మంత్రులతో సమానంగా ఉంటూ కలిసి పనిచేస్తాను” అనే బలమైన సంకేతాన్ని పంపే ప్రయత్నం చేశారని టీవీకే వర్గాలు అంటున్నాయి. అయితే, సీఎం విజయ్ అవలంబించిన ఈ కొత్త వ్యవహారశైలిపై ప్రతిపక్ష డీఎంకే తదితర పార్టీల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది సభా సాంప్రదాయాలను, ప్రొటోకాల్ నియమాలను ఉల్లంఘించడమేనని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కేవలం పబ్లిసిటీ కోసమే సీఎం ఇలాంటి వింతైన సీటింగ్ ప్రయోగాలకు పాల్పడుతున్నారంటూ రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

