విశాఖపట్నం రుషికొండలో సముద్ర తీరాన్ని ఆనుకుని నిర్మించిన భారీ పర్యాటక భవన సముదాయం. వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్మించారు. దీనిని ముఖ్యమంత్రి అధికారిక నివాసం, కార్యాలయం కోసమే నిర్మించారు. నిజానికి అప్పటి వరకు ఉన్న పర్యాటక భవనాలను తొలగించి.. పూర్తిగా ప్రభుత్వ నిధులతో కోట్ల రూపాయలతో రాజమహల్‌ను తలదన్నేలా నిర్మించారు. ఈ రాజమహల్ కోసం రుషికొండను బొడిగుండు చేశారు. అటు వైపు ఎవరూ వెళ్లకుండా కట్టడి చేశారు. చివరికి నాటి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబును కూడా పోలీసులు అడ్డుకున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అది పర్యాటక భవనం కాదు.. రాజమహల్ అనే విషయం బయటకు వచ్చింది.
Also Read : ఏపీలో వాళ్లకు గుడ్ న్యూస్.. సర్కార్ కీలక నిర్ణయం..!
నిజానికి ఈ ప్యాలెస్ ఉత్తరాంధ్రకు మణిహారం మాదిరిగా ఉంది. నిజానికి ఇది ప్రభుత్వ నిర్మించిన భవనం అయినప్పటికీ.. వైసీపీ అధినేత మాత్రం.. తన సొంతానికి అన్నట్లుగా నిర్మించుకున్నారు. వసతులు ఏర్పాటు చేసుకున్నారు. ఏపీలీ కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత ఇందులోని సౌకర్యాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. స్నానం చేయడానికి లక్షల రూపాయల విలువైన బాత్ టబ్.. బాత్‌రూమ్ కోసం సీ వ్యూ డిజైన్.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, సౌకర్యాలు.. ఇలా ఎన్నో వింతలు, విశేషాలు ఈ భవనంలో ఉన్నాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లు దాటింది. ఇప్పటికీ ఈ భవనాల నిర్వహణ కోసం నెలకు రూ.25 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

ఇలా ప్రతి నెలా లక్షల రూపాయలను కేవలం నిర్వహణ కోసమే ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అయినా సరే.. ఇప్పటి వరకు ఈ భవనాలను సరిగ్గా వినియోగించుకోవటం లేదు. ఎందుకు ఇలా నాన్చుడి ధోరణి అనేది మాత్రం అర్థం కావడం లేదు. ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్ద నేతలు ఈ అందమైన, అద్భుతమైన భవనం పై మనసు పడినట్టు తెలుస్తుంది. దీంతో రుషికొండ ప్యాలెస్ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సుమారు రూ.451.67 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు 2024 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటికీ, ఇప్పటికీ సాధారణ పర్యాటక కార్యకలాపాలతో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు.
Also Read : జనసేనలోకి కొండా సుస్మిత? కీలక నేతలతో భేటీకి రంగం సిద్ధం!
ప్రభుత్వ అధికారిక ప్రాజెక్టు సమాచార ప్రకారం ప్రస్తుతం ఈ భవనాలు నాన్-ఆపరేషన్‌లా ఉన్నాయి. నిర్వహణ కోసం నెలకు సుమారు రూ.25 లక్షల వ్యయం అవుతోంది. రుషికొండ ప్రాజెక్టులో మొత్తం సుమారు 13,542 చదరపు మీటర్ల నిర్మిత విస్తీర్ణం ఉంది. విలాసవంతమైన సూట్లు, రెస్టారెంట్లు, స్పా, జిమ్, కాన్ఫరెన్స్ హాళ్లు, బ్యాంకెట్ హాళ్లు, లాంజ్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. భవనాలను ఖాళీగా ఉంచకుండా వాటిని అంతర్జాతీయ స్థాయి లగ్జరీ రిసార్ట్, లేదా హాస్పిటాలిటీ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ దిశగా చర్యలు కూడా చేపట్టింది. కానీ అమలు కాలేదు.
ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ 2026 జూలైలో ప్రైవేట్ హోటల్ ఛైన్లు, రిసార్ట్ డెవలపర్లు, హాస్పిటాలిటీ సంస్థలు, పెట్టుబడిదారుల నుంచి ఎక్స్‌ప్రెషన్ అఫ్ ఇంటరెస్ట్ ఆహ్వానించింది. ఆసక్తి ఉన్న సంస్థల నుంచి అభిప్రాయాలు, మార్కెట్ ఆసక్తి తెలుసుకున్న తర్వాత సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేసి, అవసరమైతే రిక్వెస్ట్ ఫర్ ప్రపోసల్ ద్వారా ప్రైవేట్ భాగస్వామిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రతిపాదనలో పూర్తిగా ప్రైవేట్ వినియోగానికి మాత్రమే పరిమితం కాకుండా వ్యూయింగ్ ఏరియాలు, ప్రొమెనేడ్లు, ఓపెన్ స్పేస్లు, సాంస్కృతిక ప్రదేశాలు, ఇతర సందర్శకుల సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే అంశం కూడా ఉంది. ఒక బ్లాకు సాంస్కృతిక, హెరిటేజ్ కేంద్రంగా ప్రజల వినియోగానికి కేటాయించే ప్రతిపాదన కూడా వచ్చింది.
Also Read : మళ్లీ తెరపైకి ఆపరేషన్ ఆకర్ష్..!
రుషికొండ కొండ దిగువన ఉన్న సుమారు 9 ఎకరాల భూమిని కూడా పర్యాటక అభివృద్ధిలో భాగం చేయాలని ప్రతిపాదించారు. అయితే అక్కడ అదనపు నిర్మాణాలకు అవసరమైన చట్టపరమైన, పర్యావరణ, సి ఆర్జెడ్ అనుమతులు తప్పనిసరి. రుషికొండ భవనాల భవిష్యత్ వినియోగంపై న్యాయపరమైన అంశాలు కూడా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ప్రస్తుతం ప్రైవేట్ సంస్థకు తుది లీజు ఇచ్చినట్లు కాకుండా, తొలిదశలో కేవలం ఆసక్తి వ్యక్తీకరణలను మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు కోర్టులో వివరించినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. రుషికొండ భవనాలకు సంబంధించి ప్రస్తుతం మూడు దశలు కీలకం. ఈఓఈ లకు స్పందన పరిశీలన సాధ్యాసాధ్యాల అధ్యయనం, ప్రైవేట్ హాస్పిటాలిటీ సంస్థ ఎంపిక చేసి ఆపరేషన్లు ప్రారంభించడం అంటే “రేపటి నుంచే హోటల్ ప్రారంభం” అనే పరిస్థితి ఇంకా లేదు.
కానీ గతంతో పోలిస్తే ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం స్పష్టమైన ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. విశాఖ పర్యాటక రంగానికి రుషికొండ అత్యంత కీలక ప్రదేశం కావడంతో, ఈ భవనాలను అంతర్జాతీయ స్థాయి హాస్పిటాలిటీ ప్రాజెక్టుగా విజయవంతంగా నడిపించగలిగితే విశాఖలో లగ్జరీ టూరిజం, కాన్ఫరెన్స్ టూరిజం, వెల్నెస్ టూరిజం, ప్రైవేట్ పెట్టుబడులకు ఇది మరో ముఖ్య కేంద్రంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటికీ దేనికి గడువు నిర్ణయం చేయలేదు. దీని మర్మం ఏమిటో ప్రజలకు అర్ధం కాలేదు. కాలయాపన వెనుక ఏదో మర్మం ఉన్నట్లు ఊహగానాలు వస్తున్నాయి. ప్రజల సొమ్ముతో వందల కోట్లు ఖర్చు పెట్టినా ఇప్పటికి వినియోగంలోకి తీసుకురాకుండా ఉండటం ప్రభుత్వ చిత్తశుద్ధినే ప్రశ్నర్థకంగా మారుస్తుంది.

