Thursday, August 27, 2026 12:01 PM
Thursday, August 27, 2026 12:01 PM

ఆ ప్రశ్నలకు సాయిరెడ్డి దగ్గర జవాబు ఉందా..?

రాజకీయాల్లో మిత్రులు శత్రువులుగా మారడం కొత్తేమీ కాదు. నిన్నటి వరకు ఒకే వేదికపై నిలిచిన వారు.. నేడు పరస్పరం విమర్శలు చేసుకోవడం కూడా అసాధారణం కాదు. కానీ దశాబ్దాలుగా ఒక కుటుంబంతో అనుబంధం కొనసాగించిన వ్యక్తి, ఆ కుటుంబం తనపై ఉంచిన నమ్మకానికి ప్రతిఫలంగా రాజకీయంగా ఎదిగిన తర్వాత. అదే కుటుంబంపై అత్యంత తీవ్రమైన ఆరోపణలు చేయడం మాత్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. వైసీపీ మాజీ కీలక నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజా వ్యాఖ్యలపై ఇప్పుడు ఇదే ప్రశ్న వినిపిస్తోంది. దశాబ్దాల అనుబంధం ఉన్న వ్యక్తి.. రాజకీయంగా దూరమైన తర్వాత ఇంత తీవ్రమైన ఆరోపణలు చేయడం వెనుక అసలు ఎజెండా ఏమిటి..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్.

Also Read : వైసీపీలో తారాస్థాయికి ఆధిపత్య పోరు..!

వైఎస్ రాజారెడ్డి కాలం నుంచి వైఎస్ కుటుంబ వ్యాపారాలకు సంబంధించిన ఆడిటర్‌గా ఉన్న విజయసాయిరెడ్డి.. క్రమంగా ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా మారారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆయనకు టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం లభించింది. ఆ తర్వాత వైఎస్ కుటుంబంతో ఆయన అనుబంధం మరింత బలపడింది. రాజకీయంగా కూడా వైఎస్ కుటుంబం విజయసాయిరెడ్డికి ప్రాధాన్యం కల్పించింది. ఇలాంటి నేపథ్యంలో.. ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన వైఎస్ జగన్‌పైన విజయసాయిరెడ్డి చేస్తున్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.

Also Read : వైసీపీ ప్రేమలో సిఐ గారు.. పోలీస్ బాస్ ల రియాక్షన్ ఇదే..!

జగన్ పాలనలో మత మార్పిడులను ప్రోత్సహించారని, వందల సంఖ్యలో చర్చిల నిర్మాణానికి సహకరించారని విజయసాయిరెడ్డి ఆరోపించడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. అంతేకాదు, హిందూ మతాన్ని ప్రోత్సహించడంలో జగన్ విఫలమయ్యారంటూ చేసిన వ్యాఖ్యలు కూడా కొత్త చర్చకు తెర తీశాయి. అయితే ఇక్కడ తలెత్తుతున్న ప్రధాన ప్రశ్న ఒక్కటే. జగన్ నిజంగానే మత మార్పిడులను ప్రోత్సహించే వ్యక్తి అయితే, దశాబ్దాలుగా ఆయన కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉన్న విజయసాయిరెడ్డి ఈ అంశాలను ఇంతకాలం ఎందుకు ప్రశ్నించలేదు..? రాజకీయంగా కలిసి ఉన్నంత కాలం కనిపించని ఈ ఆరోపణలు.. విభేదాలు వచ్చిన తర్వాతే ఎందుకు తెరపైకి వచ్చాయి..?

Also Read : ఆగిపోయిన వీసా అపాయింట్‌మెంట్లు.. ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..!

రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. విధానాలపై విభేదాలు రావచ్చు. పార్టీని వీడే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. కానీ గతంలో తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తిపైనే మతపరమైన ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమనేది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. విజయసాయిరెడ్డి స్వయంగా రాజకీయాల్లో శాశ్వత శత్రువులుండరని, ప్రత్యర్థులు మాత్రమే ఉంటారని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ సిద్ధాంతం జగన్ విషయంలో ఎందుకు కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థి చేసే ఆరోపణలకు, దశాబ్దాలుగా ఒకే కుటుంబంతో నడిచిన వ్యక్తి చేసే ఆరోపణలకు తేడా ఉంటుంది. ఎందుకంటే, దగ్గరగా ఉన్న వ్యక్తి చేసిన ఆరోపణలకు సహజంగానే ఎక్కువ ప్రాధాన్యం ఏర్పడుతుంది.

vijayasai reddy

విజయసాయిరెడ్డి తాజా వ్యాఖ్యల వెనుక అసలు రాజకీయ లక్ష్యం ఏమిటన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. జగన్‌తో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని పక్కనపెట్టి, ఇప్పుడు ఆయనపై అత్యంత తీవ్రమైన మతపరమైన ఆరోపణలు చేయడం విజయసాయిరెడ్డి రాజకీయ భవిష్యత్ పై కొత్త చర్చకు దారితీసింది. దశాబ్దాలుగా తనతో నడిచిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు..? గతంలో తెలిసి కూడా మౌనంగా ఉన్నారా..? లేక ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం కొత్త ఆరోపణలను తెరపైకి తెస్తున్నారా..? అనే ప్రశ్నలకు విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

వైసీపీని వీడి, తిరిగి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని విజయసాయిరెడ్డి భావిస్తున్నారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. భవిష్యత్ రాజకీయ ప్రస్థానంలో హిందుత్వాన్ని ప్రధాన అంశంగా ఎంచుకుంటున్నారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. హిందువుల సంక్షేమం గురించి మాట్లాడటంలో తప్పు లేదు. ఏ మతానికైనా రక్షణ, గౌరవం కల్పించాలని కోరడంలోనూ అభ్యంతరం ఉండదు. నిజానికి గతంలో కూడా విజయసాయిరెడ్డి ఇలాగే చంద్రబాబు పై కూడా ఆరోపణలు చేశారు. అయితే ఆ రోజు తిరుమలలో శ్రీవారి పింక్ డైమండ్ చోరీ చేశారని ఆరోపించారు. ఆ తర్వాత ఆ కేసును ఆయన విత్ డ్రా చేసుకున్నారు.

రాజకీయాల్లో ఆరోపణలు చేయడం సులభం. కానీ వాటిని ప్రజలు ఎంతవరకు నమ్ముతారన్నదే అసలు పరీక్ష. ముఖ్యంగా మతం వంటి అత్యంత సున్నితమైన అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించాలనే ప్రయత్నం జరిగితే ప్రజలు మరింత అప్రమత్తంగా పరిశీలిస్తారు. నమ్మకాలు, స్నేహాలు, రాజకీయ అనుబంధాలు మారవచ్చు. విభేదాలు రావచ్చు. కానీ వాటి మధ్య సమాజంలో మతపరమైన చిచ్చు రగలకుండా చూసే బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడిపై ఉంటుంది.

దశాబ్దాలుగా ‘నీడలా’ నడిచిన వ్యక్తి.. నేడు ‘నిందలా’ మారితే, ఆ మార్పు వెనుక నిజమైన కారణమేంటో ప్రజలు తప్పకుండా ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది కూడా చివరికి రాజకీయ నాయకులే. ఎందుకంటే.. రాజకీయాల్లో మారే సంబంధాలను ప్రజలు అర్థం చేసుకోవచ్చు.. కానీ మతం పేరుతో సమాజాన్ని విభజించే ప్రయత్నాలను మాత్రం అంత తేలిగ్గా క్షమించరు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆ విషయంలో వైసీపీ...

కాలం కలిసి రాకపోతే తాడు కూడా...

తెలుగుదేశం పార్టీకి కేంద్రం...

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ సర్కార్‌లో...

దిల్ రాజుకు ఇతర...

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు...

వైసీపీలో తారాస్థాయికి ఆధిపత్య...

ఓ వైపు అధికారం కోల్పోయిన నిర్వేదం.....

వైసీపీ ప్రేమలో సిఐ...

పులివెందులలో వైకాపా కబ్జాదారులకు కొందరు పోలీస్...

ఏపీలో వాళ్లకు గుడ్...

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద...

పోల్స్