తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొండా కుటుంబం ఎపిసోడ్ తీవ్ర కలకలం రేపుతోంది. కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలను కాంగ్రెస్ అధిష్ఠానం సైతం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. అయితే, ఈ వివాదంపై మంత్రి కొండా సురేఖ స్పందిస్తూ.. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఇప్పటికే పార్టీకి వివరణ ఇచ్చుకున్నారు.
Also Read : మాట జాగ్రత్త.. పార్టీ నేతలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్..!
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో అత్యవసరంగా చర్చలు జరిపారు. కొండా సుస్మిత వ్యాఖ్యల పర్యవసానాలపై నేడు 20 నుంచి 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం ముగిసిన అనంతరం ఎమ్మెల్యేలంతా కలిసి సీఎల్పీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. పార్టీ లైన్ దాటి వ్యవహరించినందుకు గానూ కొండా సురేఖను వెంటనే మంత్రి వర్గం నుంచి తొలగించాలని, అలాగే ఆమెను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు గట్టిగా డిమాండ్ చేయనున్నట్లు సమాచారం.
Also Read : హర్మూజ్.. పట్టు కోల్పోయిన ఇరాన్..!
మరోవైపు, ఈ కీలక సమావేశంలో కేవలం కొండా కుటుంబం వ్యవహారమే కాకుండా.. పార్టీలో హాట్ టాపిక్‌గా మారిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఖరిపై కూడా ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా చర్చించనున్నారు. కొద్దిరోజులుగా పార్టీ అంతర్గత విషయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో, ఈ ఎమ్మెల్యేల భేటీ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అధిష్ఠానం మరియు ముఖ్యమంత్రి ఈ వ్యవహారంలో ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

