పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు చివరి దశకు చేరుకున్నాయి. తీవ్ర ఆందోళనల కారణంగా దాదావు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే రెండు వారాల సమయం గడిచిపోయింది. ఈ సెషన్లో ఇక మిగిలింది కేవలం మూడు రోజులు మాత్రమే. ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య ప్రతిష్టంభన తారస్థాయికి చేరడంతో సభా కార్యకలాపాలు సజావుగా సాగడం కష్టమేనని అంటున్నారు. పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల లాఠీచార్జి, పెల్లెట్ గన్స్ ప్రయోగంపై హోం మంత్రి అమిత్ షా లోక్సభలో స్పష్టమైన ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. అలాగే అయోధ్య రామమందిర విరాళాల చోరీ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే సభకు ఏ మంత్రి వచ్చి జవాబు చెప్పాలో ప్రతిపక్షాలు నిర్ణయించలేవని అధికార పక్షం తేల్చి చెప్పడంతో సభలో నిరసనల పర్వం కొనసాగుతోంది.
Also Read : స్థానిక పోరు.. రణమా.. రణరంగమా..?
నిరసనలు, నినాదాల నడుమ లోక్సభలో 8 బిల్లులకు ఆమోదముద్ర పడింది. లోక్సభకు కేటాయించిన మొత్తం 90 పని గంటల్లో సరిగ్గా నడిచింది కేవలం 15 గంటల 36 నిమిషాలు మాత్రమే. ఈ సమయంలో కూడా సింహభాగం, దాదాపుగా 11 గంటలు ఒక్క పరీక్షల అక్రమ మార్గాల నివారణ సవరణ బిల్లు’ పై చర్చకే కేటాయించారు. ఈ బిల్లుపై 48 మంది ఎంపీలు మాట్లాడారు. మిగిలిన 7 ఇతర ముఖ్యమైన బిల్లులను విపక్షాల నినాదాలు, ఆందోళనల మధ్య సమగ్ర చర్చ లేకుండా కేవలం 36 నిమిషాల వ్యవధిలోనే సభ ఆమోదం తెలిపింది. రాజ్యసభ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. 15 రోజుల్లో ఎగువ సభ కేవలం 24.21 గంటలు మాత్రమే సమావేశమైంది.
ఈ చివరి మూడు రోజుల్లో మరో 7 కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవాలని కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. విదేశీ విరాళాల క్రమబద్దీకరణ.. ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు, ట్రిబ్యునళ్ల సంస్కరణల బిల్లు, ‘గనులు-ఖనిజాల అభివృద్ధి సవరణ బిల్లు, ‘నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బిల్లు, ‘కేరళ పేరు మార్పు బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉంది. రాజ్యసభలో ‘బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు’, ‘పన్నుల సవరణ బిల్లు’ లను ఆమోదింపజేసుకోవాలని భావిస్తోంది. కీలక బిల్లులేవీ ఇప్పుడు సభలో ప్రవేశపెట్టే అవకాశం లేదు. ముఖ్యంగా ఎఫ్సీఆర్ఏ బిల్లును అనుమతించేదే లేదంటూ కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. చివరి మూడు రోజులు సభకు తప్పనిసరిగా హాజరు కావాలంటూ కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీలకు విప్ కూడా జారీ చేసింది.
Also Read : విమర్శలకు చెక్ పెట్టడంలో విఫలమయ్యారా..?
సభలో చోటు చేసుకుంటున్న జాప్యాన్ని, రచ్చను నివారించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఇప్పటికే రెండుసార్లు భేటీ అయ్యారు. ఫోన్లో కూడా మాట్లాడారు. డీలిమిటేషన్, ఎఫ్సీఆర్ఏ బిల్లులపై సహకరించాలని కోరారు. అయినప్పటికీ, తమ డిమాండ్లపై కాంగ్రెస్ ఇతర విపక్షాలు పట్టుబట్టడంతో సయోధ్య సాధ్యం కాలేదు. విద్యార్థులపై దాడి, విరాళాల చోరీ అంశాలపై వెనక్కి తగ్గేది లేదని విపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను, వ్యూహాలను విపక్షాలు ఏ రకంగా అడ్డుకుంటాయో, పార్లమెంట్ చివరి ముూడు రోజులు ఎలా సాగుతాయనేది చర్చనీయాంశమైంది.

