ఇంట్లో ఎన్ని గొడవలు ఉన్నా సరే.. మనుషులకు మానవత్వం ముఖ్యం. ఆస్తి గొడవలతో విడిపోయిన అన్నదమ్ములు కూడా శుభ, అశుభ కార్యాలకు కలుస్తారు. తమ మధ్య ఉన్న విభేదాలకు చెక్ పెడతారు. తాజాగా ఇదే కథాంశంతో వచ్చిన బలగం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఇదే ప్రధాన కారణం. కుటుంబసభ్యుల మధ్య ఎన్ని గొడవలున్నా సరే.. సమస్య వస్తే.. అంతా ఒకటై పోతారు. ప్రధానంగా భారతీయ కుటుంబ వ్యవస్థలో ఈ బంధాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ల సంబంధం కంటే కూడా అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడి మధ్య బంధం ఇంకా బలంగా ఉంటుంది. ఒకరికోసం ఒకరన్నట్లుగా వ్యవహరిస్తారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే.. వెంటనే తోడబుట్టిన వారు ఆఘమేఘాల మీద రంగంలోకి దిగుతారు. నేనున్నా అంటూ భరోసా ఇస్తారు.
Also Read : జగన్ ట్రాప్ లో టీడీపీ నేతలు.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
రాజకీయాల్లో ఉన్న వాళ్లు తమ తమ రాజకీయ భవిష్యత్తు కోసమో, ఆర్థిక అవసరాల కోసమో.. వేరు వేరు పార్టీల్లో కొనసాగడం సర్వసాధారణం. భార్యాభర్తలు, అత్తా కోడళ్లు, మామ అల్లుళ్లు, అన్నాదమ్ములు, తోడికోడళ్లు ఒకరిపై మరొకరు పోటీ చేయడం చాలా చోట్ల జరిగింది. అదంతా రాజకీయాలకే పరిమితం. కుటుంబంలో ఏదైనా అవసరం వచ్చినా, ఎవరికైనా అనారోగ్య సమస్యలు వచ్చినా సరే.. వెంటనే మేమున్నాం అంటూ అంతా కలిసిపోతారు. కానీ.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గర మాత్రం బంధాలు, అనుబంధాలకు ఎలాంటి ప్లేస్ లేదని.. అక్కడ ఉండేది కేవలం డబ్బు మాత్రమే అని మరోసారి రుజువైంది.
Also Read : ఉమా అసహనానికి కారణం అదేనా..!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్, కుమార్తె వైఎస్ షర్మిల. ఈ ఇద్దరి మధ్య చిన్ననాటి నుంచి మంచి అనుబంధమే ఉంది. ఒకే ఇంట్లో కలిసి పెరిగారు, తిరిగారు.చివరికి పెళ్లిళ్ల తర్వాత కూడా ఇద్దరి మధ్య అనుబంధం బలంగానే ఉంది. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇద్దరికీ సమానంగానే ఆస్తులిచ్చారు. తండ్రి వైఎస్ఆర్ మరణానంతరం కూడా అన్న జగన్ కోసం చెల్లి షర్మిల ఎంతో శ్రమించారు. జగన్ జైలులో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపించారు. అన్న జగన్ కోసం 2014 ఎన్నికలకు ముందు 3 వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. ఇక 2019 ఎన్నికలప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర చేపట్టారు. వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాతే జగన్ తీరులో మార్పు వచ్చింది.
Also Read : బెజవాడ పాలిటిక్స్ మళ్ళీ ఇంట్రస్టింగ్ చర్చ..!
అన్నా చెల్లెలు మధ్య ఆస్తి వివాదాలు తలెత్తాయి. తనకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా అన్న జగన్, వదిన భారతీ రెడ్డీ మోసం చేశారని చెల్లెలు షర్మిల ఆరోపించారు. అన్నపైన బహిరంగంగానే విమర్శలు చేశారు. ఆ తర్వాత వైసీపీ నుంచి బయటకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు. పార్టీలో వేరైనా సరే.. అన్నా చెల్లెలు మధ్య మంచి సంబంధాలున్నాయని వైసీపీ నేతలు, వైఎస్ కుటుంబ సభ్యులు కవరింగ్ ఇచ్చారు. కానీ వాస్తవం ఏమిటో ఇప్పుడు బయట పడింది. వైఎస్ షర్మిల ఇటీవల అవసరమైన ఉదర శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆసుపత్రి బెడ్ పై నుంచే తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయం వెల్లడించిన షర్మిల.. “నేను బాగా కోలుకుంటున్నాను. శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు” అని పోస్ట్ చేశారు.
షర్మిల శస్త్రచికిత్స విషయం తెలుసుకున్న ఏపీ, తెలంగాణలో ముఖ్యనేతలంతా స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా షర్మిల వేగంగా కోలుకోవాలంటూ కోరుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టాలంటూ మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. అయితే సొంత అన్న వైఎస్ జగన్ మాత్రం కనీసం స్పందించలేదు. పైగా చెల్లెలు షర్మిలను పరామర్శించేందుకు హైదరాబాద్ వెళ్లలేదు కూడా. పార్టీలో ఎవరికో ఏదో జరిగితే.. భారీ ర్యాలీతో వెళ్లి పరామర్శించి హడావుడి చేసే జగన్.. సొంత చెల్లిని కనీసం పలకరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ విభేదాలు, కుటుంబ సమస్యలు ఉండవచ్చు. అవి వ్యక్తిగతం. కానీ ఆరోగ్యం విషయంలో కూడా కనీసం ఒక్క మాట చెప్పకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

