సాధారణంగా మనం ప్యాంటు వెనుక జేబులో వాలెట్ పెట్టుకుని ప్రయాణాలు, ఉద్యోగాలు చేస్తూ ఉంటాం. దీని కారణంగా అనేక నష్టాలు ఉన్నాయని చెప్పినా పెద్దగా ఎవరూ వినే ప్రయత్నం చేయరు. అయితే ప్యాంటు వెనుక జేబులో లావుపాటి వాలెట్ పెట్టుకుని గంటల తరబడి కూర్చోవడం వల్ల వాలెట్ సైయాటికా లేదా ‘ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్’ అనే తీవ్రమైన నరాల సమస్య వచ్చే ప్రమాదం ఉందని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ జైదీప్ బన్సాల్ హెచ్చరిస్తున్నారు. వెనుక జేబులో పర్స్ పెట్టుకుని కూర్చున్నప్పుడు, అది కూర్చునే ఉపరితలాన్ని అసమానంగా మార్చేస్తుందట.
Also Read : పరారీలో తమ్మినేని.. పరుగో పరుగు..!
దీనివల్ల వెన్నెముక యొక్క అమరిక దెబ్బతిని, శరీరంలోని అతిపెద్ద నరమైన సైయాటిక్ నరంపై తీవ్ర ఒత్తిడి పడుతుందని ఆయన వివరించారు. ఈ ఒత్తిడి కారణంగా నరానికి రక్తప్రసరణ తగ్గి వాపు వస్తుంది. ఫలితంగా ఒక వైపు పిరుదు లేదా దిగువ నడుము భాగంలో మొండిగా నొప్పి రావడం, తొడ వెనుక భాగం లేదా కాలు గుండా మంట పుట్టడం, కాళ్లలో తిమ్మిర్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఎక్కువ సమయం కూర్చుని పనిచేసే ఐటీ ప్రొఫెషనల్స్, డ్రైవర్లు మరియు తరచూ ప్రయాణాలు చేసేవారిలో ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
Also Read : లొంగే ప్రసక్తే లేదు.. ఇరాన్ ప్రెసిడెంట్ సంచలన ప్రకటన..!
ఈ సమస్య నుండి బయటపడటానికి పెద్దగా మందులు వాడాల్సిన అవసరం లేదు. పర్సును వెనుక జేబులో కాకుండా ముందు జేబులో లేదా బ్యాగ్లో పెట్టుకోవడం, అనవసరమైన కార్డులు తొలగించి పర్సును పల్చగా ఉంచుకోవడం చేయాలి. అలాగే ప్రతి 45 నిమిషాలకు ఒకసారి సీటులో నుంచి లేచి కొద్దిసేపు నడవడం మరియు డాక్టర్ల సలహాతో కొన్ని సాధారణ స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల కొన్ని వారాల్లోనే ఈ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

