ఇటీవలి కాలంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పలు వివాదాల నేపధ్యంలో.. జనసేన పార్టీ కీలక సమావేశానికి సిద్దం కావడంపై సర్వత్రా ఆసక్తి రేగుతోంది. అమరావతిలో నేడు సాయంత్రం 5 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జరగబోయే ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు రాష్ట్రస్థాయి ముఖ్య నేతలందరూ హాజరుకానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీ పరంగా జరుగుతున్న అత్యంత కీలకమైన అంతర్గత సమావేశం ఇదే కావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Also Read : మీ కొలెస్ట్రాల్ టెస్ట్ సరైనదేనా..?
రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలు, శాంతిభద్రతలు, ప్రజల్లో విస్తృతంగా చర్చకు వస్తున్న కొన్ని కీలక సామాజిక, రాజకీయ అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే, ప్రజల పక్షాన నిలబడటంలో పార్టీ ప్రజాప్రతినిధులు పోషించాల్సిన పాత్రపై పవన్ కల్యాణ్ సమీక్షించనున్నారు. వివిధ రంగాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, వాటిపై క్షేత్రస్థాయిలో వస్తున్న స్పందనను నేతల నుంచి ఆయన అడిగి తెలుసుకోనున్నారు.
Also Read : దమ్ముంటే రండి.. అఖిల ప్రియ సంచలనం..!
ఎన్నికల్లో అద్భుత విజయ సాధించినప్పటికీ.. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేయడంపై జనసేనాని ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే పార్టీ నిర్మాణం, సంస్థాగత బలోపేతంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల నియామకం, క్రియాశీలక సభ్యత్వాల నమోదు, పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వడం వంటి అంశాలపై ప్రజాప్రతినిధులకు బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణపై పవన్ కల్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూనే, పార్టీ ఉనికిని చాటుకునేలా ఎలా ముందుకు సాగాలనే దానిపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.

