టీ20 ప్రపంచకప్ 2026లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ రాబోయే జింబాబ్వే పర్యటనకు ఎంపిక కాకపోవడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నెలాఖరులో జరగనున్న టీ20 సిరీస్ కోసం బోర్డు విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాలో సంజూ పేరు లేకపోవడంతో అభిమానులతో పాటు విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ నిర్ణయం వెనుక బోర్డు ఒక దీర్ఘకాలిక వ్యూహాన్ని అమలు చేస్తోందని, కొత్త ఆటగాళ్లను పరీక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Also Read : ఇంగ్లండ్ చేతిలో భారత్ చిత్తు
ఐపీఎల్ 2026లో టాప్ స్కోరర్ గా నిలిచిన 15 ఏళ్ల యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి జట్టులో చోటు కల్పించేందుకే సంజూ శాంసన్‌ను పక్కన పెట్టారనే సరికొత్త థియరీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. లండన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన ఒక టీ20 మ్యాచ్ లో వైభవ్ తుది జట్టులోకి వచ్చేందుకు సంజూ శాంసన్ స్వచ్ఛందంగానే పక్కకు తప్పుకున్నాడనే ప్రచారం కూడా సాగుతోంది. ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆడుతున్న టాప్ ఆర్డర్ బ్యాటర్లలో కేవలం సంజూను మాత్రమే జింబాబ్వే టూర్ కు దూరం పెట్టడం గమనార్హం.
Also Read : ఎల్‌నినో ఎఫెక్ట్.. రెడ్ లిస్ట్‌లో రాయలసీమ..!
ప్రస్తుతానికి జింబాబ్వే సిరీస్ కు దూరం పెట్టినప్పటికీ, సంజూ శాంసన్ భవిష్యత్తు ప్రణాళికల్లో కీలక ఆటగాడిగా కొనసాగుతాడని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది కేవలం యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చేందుకు చేసిన తాత్కాలిక ఏర్పాటని, సెలెక్టర్ల దీర్ఘకాలిక వ్యూహాల్లో సంజూ భాగమేనని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతేకాకుండా, రాబోయే ఆసియా గేమ్స్ భారత జట్టులో సంజూ శాంసన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

