గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో భావప్రకటన స్వేచ్ఛ విషయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో అందరికీ తెలిసిందే. నాటి ప్రభుత్వం తమను విమర్శించిన జర్నలిస్టులు, సామాన్య పౌరులపై ఏకంగా అత్యంత కఠినమైన రాజద్రోహం సెక్షన్లను ప్రయోగించింది. ప్రముఖ టీవీ ఛానళ్ల జర్నలిస్టులను, అప్పటి అధికార పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాసిన మీడియా ప్రతినిధులను రాత్రికి రాత్రే అరెస్ట్ చేసి జైలుకు పంపిన దాఖలాలు ఉన్నాయి.
Also Read : యూట్యూబర్ రావణ్.. ఇప్పట్లో బయటకు రావడం కష్టమేనా..?
నాడు ప్రభుత్వ పెద్దలు అడ్డగోలుగా అక్రమ కేసులు బనాయిస్తున్నప్పుడు నేడు నీతులు చెబుతున్న మేధావులు, విశ్లేషకులు ఎవరూ నోరు విప్పకపోవడం గమనార్హం. నాడు సొంత పార్టీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణం రాజు కేవలం ప్రభుత్వంపై విమర్శలు చేశారనే ఒకే ఒక్క కారణంతో, ఆయనపై రాజద్రోహం కేసు పెట్టి ఏ రకంగా అపహరించారో అందరికీ గుర్తుంది. కస్టడీలో ఆయనను భౌతికంగా హింసించారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఒక సిట్టింగ్ ఎంపీకే రక్షణ లేని పరిస్థితి నాడు ఉంటే..
ఇప్పుడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను లక్ష్యంగా చేసుకుని, తీవ్ర సమాజ శాంతికి భంగం కలిగించేలా, అస్థిరత కుట్ర కోణంలో వ్యాఖ్యలు చేసిన ప్రశ్న రావణ్ ను అరెస్ట్ చేస్తే మాత్రం కొందరు పౌర హక్కుల నేతలు, విశ్లేషకులు ఒక్కసారిగా బయటకు వస్తున్నారు. సామాన్య ప్రజలను నాడు సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితేనే సీఐడీ పోలీసులు అర్ధరాత్రిళ్లు ఇళ్ల తలుపులు బద్దలుకొట్టి లాకెళ్లినప్పుడు ఈ విశ్లేషకులు ఎక్కడ దాక్కున్నారనే ప్రశ్నలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి.
Also Read : మాకు భారత్ ఉంది.. అమెరికాకు ఇజ్రాయిల్ కౌంటర్..!
నాడు ప్రభుత్వ వేధింపులను రాజ్యాంగబద్ధం అన్నట్లు మౌనం వహించిన వారే.. నేడు చట్టవిరుద్ధమైన, అభ్యంతరకరమైన పోస్టులు, వ్యాఖ్యలు చేసిన ఒక వివాదాస్పద యూట్యూబర్ ను పోలీసులు చట్టప్రకారం విచారిస్తుంటే దానికి ప్రజాస్వామ్య ఖూనీ అంటూ రంగులు పూయడం వారి ద్వంద్వ నీతికి పరాకాష్ట అనే విమర్శలు వస్తున్నాయి. భావప్రకటన స్వేచ్ఛకు రాజ్యాంగ పరిరక్షణ ఉన్నప్పటికీ.. అది సమాజంలో అరాచకాలు సృష్టించడానికి, దేశ వ్యతిరేక భావజాలం ఉన్న శక్తులతో చేతులు కలపడానికి వర్తించదని న్యాయ నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. నాడు జర్నలిస్టులపై కక్షసాధింపులు జరిగినప్పుడు మౌనంగా ఉండి, నేడు తప్పు చేసిన వారిని వెనకేసుకురావడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని విమర్శలు వస్తున్నాయి.

