తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ వైరం రోజురోజుకు ముదురుతోంది. రేవంత్ విమర్శలు చేయడం.. బీఆర్ఎస్ నాయకులు ప్రతి విమర్శలు చేయడం.. పోటాపోటీగా సవాళ్లు విసురుకోవడం.. రెండు పార్టీల మధ్య రాజకీయ వివాదం సాగుతోంది. రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీసుల వ్యవహారం రాజకీయ, అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ముఖ్యమంత్రులు సచివాలయం నుంచి పనిచేస్తారు. వెసులుబాటు కోసం క్యాంప్ ఆఫీస్‌లు ఏర్పాటు చేసుకుంటారు. ఇంటినే క్యాంప్ ఆఫీస్ మార్చుకున్న ముఖ్యమంత్రులు అనేక మంది ఉన్నారు. కానీ.. రేవంత్ రెడ్డి ఏకంగా ఐదు క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడంపై ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. భారత ప్రధాన మంత్రి మోదీకి సైతం ఇన్ని క్యాంపు కార్యాలయాలు లేవని సీనియర్ అధికారులు వ్యాక్యానిస్తున్నారు.
Also Read : నా దగ్గర ఏనుగు దంతాలున్నాయి: మోహన్ లాల్ సంచలనం..!
మోదీకి న్యూ ఢిల్లీలో అధికారిక నివాసంతోపాటు క్యాంప్ కార్యాలయం ఒకటి ఉంది. కానీ.. తెలంగాణలో రేవంత్ రెడ్డికి సచివాలయంలో ప్రత్యేక కార్యాలయంతో పాటు.. జూబ్లీహిల్స్ నివాసంలో క్యాంప్ కార్యాలయం ఉంది. ఈ రెండూ కాకుండా జూబ్లీహిల్స్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఒక కార్యాలయం నిర్మించారు. ఇక బంజారాహిల్స్ పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూడా ఒక కార్యాలయం. తాజాగా రంగారెడ్డి జిల్లాలో నిర్మించ తలపెట్టిన భారత్ ఫ్యూచర్ సిటీలో కూడా ఒక కార్యాలయం ఏర్పాటు చేశారు. అంటే.. మొత్తంగా ఆయనకు ఐదు అధికారిక కార్యాలయాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో భారత రాష్ట్ర సమితి మీద విమర్శల జోరు పెంచారు. ప్రతి సభలో కూడా గణాంకాలతో సహా విమర్శలు చేస్తున్నారు. వీటికి గులాబీ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి కేటీఆర్ గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఇటీవల కేటీఆర్ ఒక కీలక ఆరోపణ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని కేటీఆర్ తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 200 కోట్లు ఖర్చుతో కొత్త క్యాంపు కార్యాలయం నిర్మిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రగతి భవన్ ఉందని.. అది ఉండగానే రేవంత్ రెడ్డి కొత్త కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కేవలం కొత్త భవనం చుట్టూ రక్షణ గోడ నిర్మించడానికి 19 కోట్లు ఖర్చు పెడుతున్నారన్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి తన సతీమణితో కలిసి కొత్త భవనంలోకి అర్ధరాత్రి పూట గృహప్రవేశం చేశారని కూడా కేటీఆర్ ఆరోపించారు. అర్ధరాత్రి పూట దొంగచాటుగా వెళ్లాల్సిన అవసరం ఏముందని కేటీఆర్ విమర్శించారు.
Also Read : యూట్యూబర్ రావణ్.. ఇప్పట్లో బయటకు రావడం కష్టమేనా..?
గులాబీ పార్టీకి అనుకూలంగా పనిచేసే సోషల్ మీడియా విభాగాలు రేవంత్ రెడ్డి నిర్మిస్తున్న భవనానికి సంబంధించిన ఫోటోలను బయటపెట్టాయి. అసలు ఎందుకు ఈ స్థాయిలో భవనం నిర్మించారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి కూడా. మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా ఇన్ని క్యాంప్ కార్యాలయాలు అప్పట్లో లేవంటున్నారు సీనియర్ అధికారులు. వెసులుబాటు రీత్యా ఎక్కడికక్కడ క్యాంపు కార్యాలయాలు పెట్టుకున్నా.. అక్కడ సమీక్షలకు వెళ్లటానికి సీనియర్ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రేవంత్ రెడ్డి ఏ పూట ఎక్కడ ఉంటారు? ఏ సమావేశం ఎక్కడ పెడతారు? అనే భయం ఉన్నతాధికారులతో పాటు ఆయనను కలవాలనుకునే నాయకుల్లో కూడా ఉందనే మాట బాగా వినిపిస్తోంది. ఎక్కడ సమీక్ష ఉంటే అక్కడికి అధికారులు పరుగులు పెట్టాల్సి వస్తుందంటున్నారు. ఇన్ని బదులు.. సచివాలయం లేదా అధికారిక క్యాంప్ కార్యాలయంలో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తే ప్రభుత్వ నిధుల ఆదాతో పాటు మంత్రులు, ఉన్నతాధికారుల సమయం ఆదా అవుతుందనే మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది.

