ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం వైసీపీ అభిమాన అధికారులకు అడ్డాగా మారుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఎంఓ ఇన్‌ఛార్జ్ అధికారి విజయానంద్ స్థానాన్ని మరో ఐఏఎస్ అధికారితో భర్తీ చేయనున్నారనే పుకార్లు ఇప్పుడు సీఎంఓలో బాగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సీఎంఓ ఇన్‌ఛార్జ్ అధికారిగా మాజీ సీఎస్ విజయానంద్ కొనసాగుతున్నారు. ఆయన అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. సీఎంఓ ఇన్‌ఛార్జ్ అధికారి, ఎనర్జీ శాఖాధిపతి, ట్రాన్స్ కో, జెన్ కో సంస్థల సీఎండీ, రిటైర్డు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైసీపీ అభిమాన అధికారిగా, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అధినేత విశ్వేశ్వర రెడ్డికి కూడా అత్యంత సన్నిహితుడిగా సీఎంఓ ఇన్ ఛార్జ్ అధికారి విజయానంద్‌కు పేరు.
Also Read : తమిళ రాజకీయాల్లో సంచలనం.. ప్రభుత్వం కూల్చే కుట్ర భగ్నం..!
విజయానంద్‌కు వైద్యుల సలహా మేరకు ఆయనను తప్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజయానంద్ స్థానంలో సీనియర్ ఐఏఎస్ “మీనా” నియామకం కోసం సీఎంఓ “కాలకేయ” మిశ్రా ప్రయత్నం చేస్తున్నారనే చర్చ ప్రస్తుతం ఏపీ సచివాలయంలో బాగా వినిపిస్తోంది. విజయానంద్ స్థానంలో సీనియర్ ఐఏఎస్ మీనాను రప్పించేందుకు సీఎంఓ ఐఏఎస్ అధికారి కాలకేయ మిశ్రా తెర వెనుక ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. విజయానంద్ ఆరోగ్యం పూర్ గా కుదుట పడాలంటే మరో ఆరు నెలలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కూడా ఆయన సెలవు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరినట్లు తెలిసింది.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో విజయానంద్ సీఎంఓలో పనిచేయకపోవచ్చు. ప్రస్తుతం సీఎంఓలో చంద్రబాబు అభిమానానికి దూరమై, ఏకాకిగా కాలం గడుపుతున్న.. “కాలకేయ” మిశ్రాకు సీఎంఓ మొత్తాన్ని తన అధీనంలో తెచ్చుకోవాలన్న కోరిక చాలా కాలంగా ఉంది. తనకు అత్యంత సన్నిహితుడైన ఉత్తరాదికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి మీనాను సీఎంఓలోకి తీసుకువస్తే.. పూర్తి ప్రాబల్యం పెరుగుతుందన్న నమ్మకం “కాలకేయ” మిశ్రాకి ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే తన పనితీరు చంద్రబాబుకు నచ్చటం లేదని.. తనపై సీఎం అసంతృప్తిగా వున్నారని “కాలకేయ” మిశ్రాకు అనుభవంతో తెలిసివచ్చిందని అంటున్నారు. అందుకే మీనా గురించి చంద్రబాబుతో మాట్లాడటానికి జంకుతున్నారట.
Also Read : నేను అక్కడ నుంచి పోటీ చేయను.. లారెన్స్ క్లారిటీ..!
ఎవరి ద్వారా సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువస్తే పని జరుగుతుందని తన సహచరులతో, సన్నిహిత ఐఏఎస్ అధికారులతో రహస్య మంతనాలు జరుపుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక సమయంలో “కాలకేయ” మిశ్రానే సీఎంఓ నుంచి చంద్రబాబు తప్పిస్తారనే ప్రచారం జరిగింది. మంత్రి లోకేష్‌కు అత్యంత సన్నిహితుడిగా ప్రచారం ఉన్న “కాలకేయ” మిశ్రాకు పేరు. ఏది ఏమైనా సీఎంఓ ఇన్‌ఛార్జ్ అధికారిగా మీనాను నియమించేందుకు “కాలకేయ” మిశ్రా చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు పలితమిస్తాయో చూడాలి. ఇప్పటికే విజయానంద్‌ను సీఎంఓ ఇన్‌ఛార్జ్‌గా నియమించుకున్నందుకు భారీ ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు మనసులో ఏముందో బయటకు రావడం లేదు.

