ఏపీలో సంచలనం సృష్టించిన యువకుడు సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ అత్యంత తీవ్రంగా స్పందించింది. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ ఘటనపై తెలంగాణకు చెందిన ప్రముఖ హక్కుల న్యాయవాది ఇమ్మానేని రామారావు ఫిర్యాదు చేయడంతో కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారి, అధికార దుర్వినియోగానికి పాల్పడటంపై ఎన్‌హెచ్‌ఆర్‌సి నిప్పులు చెరిగింది. ఇది రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కుపై జరిగిన ఘోర దాడి అని, అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనలను ఏపీ పోలీసులు పూర్తిగా ఉల్లంఘించారని కమిషన్ తీవ్రంగా ఖండించింది.
Also Read : చివరి రోజుల్లో శ్రీలక్ష్మికి పోస్టింగ్.. అసలు కారణమేంటి?
ఈ లాకప్ డెత్ ఉదంతంలో పోలీసులు ప్రవర్తించిన తీరు మానవత్వాన్ని నిలువునా సిగ్గుపడేలా చేసిందని, కస్టడీలో యువకుడు మరణించడంతో, ఆ దారుణాన్ని బయటి ప్రపంచానికి తెలియకుండా దాచేందుకు పోలీసులు అత్యంత భయానక ప్లాన్ వేశారని మండిపడింది. పోలీసుల నుంచి బాధితుడి తల్లికి ప్రాణహాని ఉందనే ఆందోళనల నేపథ్యంలో, సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మికి తక్షణమే పూర్తి స్థాయి రక్షణ, కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏపీ ప్రభుత్వాన్ని సంచలన ఆదేశాలు జారీ చేసింది.
Also Read : ‘ఇడుపు కాయితం’.. మరక మంచిదే..!
ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఏపీ డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్ లకు అత్యవసరంగా వారం రోజుల గడువిస్తూ నోటీసులు జారీ చేసింది. పోలీసులు డిలీట్ చేసిన కృష్ణలంక స్టేషన్ సీసీటీవీ ఫుటేజీని అధునాతన సాంకేతికతతో తక్షణమే రికవర్ చేయాలని, అలాగే నదిలో కలిపేసిన బాధితుడి అస్థికలను వెలికితీసి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపాలని ఆదేశించింది. ఈ కేసులో నమోదైన ఎఫ్‌ఐఆర్ స్టేటస్, నిందితులైన పోలీసుల పూర్తి వివరాలు మరియు బాధిత కుటుంబానికి చెల్లించాల్సిన నష్టపరిహారంపై వారం రోజుల్లోగా సమగ్రమైన యాక్షన్ టేకెన్ రిపోర్ట్ తమకు సమర్పించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సి అల్టిమేటం జారీ చేసింది.

