హైస్పీడ్ ట్రైన్ కలలను నిజం చేస్తూ.. దేశవ్యాప్త రైల్వే నెట్ వర్క్ ఆధునీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దేశంలోని ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ కొత్తగా ఏడు బుల్లెట్ రైలు కారిడార్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మెగా ప్రాజెక్టుల వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రతిపాదిత హైస్పీడ్ రైలు మార్గాలు అందుబాటులోకి వస్తే.. దేశంలోని ప్రముఖ ఆర్థిక, పారిశ్రామిక, టెక్నాలజీ, టూరిజం హబ్‌ల మధ్య ప్రయాణ సమయం ఊహించని విధంగా గణనీయంగా తగ్గిపోనుంది. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది.
Also Read : రూపాయి పతనం.. వీసా కష్టాలు.. విదేశీ విద్య ఇంత దారుణమా..?
ఐటీ హబ్‌లుగా గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు – హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయాన్ని కేవలం 2 గంటల 10 నిమిషాలకు, పుణె – హైదరాబాద్ మధ్య సమయాన్ని 2 గంటల 8 నిమిషాలకు తగ్గించేలా కారిడార్లను ఖరారు చేశారు. వీటితో పాటు ముంబై – అహ్మదాబాద్ 1 గంట 57 నిమిషాలు, ముంబై – పుణె 48 నిమిషాలు, బెంగళూరు – చెన్నై 73 నిమిషాలు, ఢిల్లీ – లక్నో మధ్య 2 గంటలు, ఢిల్లీ – వారణాసి 3 గంటల 15 నిమిషాలు, ఢిల్లీ – సిలిగురి 6 గంటలు.. ఈ మార్గాలను కేంద్రం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టులు ప్రతిపాదన దశలో ఉన్నాయని, సమగ్ర అధ్యయనం, భూసేకరణ, అనుమతులు, నిధుల కేటాయింపులు పూర్తయిన తర్వాత నిర్మాణ పనులు ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు.
Also Read : సాయి కృష్ణ కేసులో నేడు సంచలనాలు..!
మరోవైపు.. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జపాన్ సాంకేతిక, ఆర్థిక సహాయంతో షింకన్సెన్ వ్యవస్థ ఆధారంగా నిర్మిస్తున్న తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ముంబై – అహ్మదాబాద్ కారిడార్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫస్ట్ సెక్షన్ సేవలను వచ్చే ఏడాది నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే శాఖ శ్రమిస్తోందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీనితో పాటు ఢిల్లీ – వారణాసి – పాట్నా బుల్లెట్ రైలు కారిడార్‌కు కూడా ఆమోదం లభించిందని ఇది పూర్తయితే పాట్నా నుండి ఢిల్లీకి కేవలం 4 గంటల 41 నిమిషాల్లోనే చేరుకోవచ్చన్నారు. భవిష్యత్తులో ఈ లైన్‌ను సిలిగురి వరకు పొడిగిస్తామని వివరించారు.

