భయపడాల్సిన వారేమో భయపెడుతున్నారు.. భయపెట్టాల్సిన వారేమో భయపడుతున్నారు. అధికారంలో ఉన్నా కూడా.. మేము ఏమి చేయలేం అని చంద్రబాబు చేతులు ఎత్తేసారా.. అనే అనుమానాలు ఇప్పుటు సొంత పార్టీ నేతల్లోనే బాగా వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు.. టీడీపీ నేతలను వాళ్ల ఇళ్లలోకి వెళ్లి మరీ భయపెట్టిన వైసీపీ నేతలు.. అధికారంలో లేనప్పుడు కూడా అదే మాదిరిగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధానంగా జగన్ అండ్ కో లను భయపెట్టాల్సిన చంద్రబాబు.. తిరిగి వారికే భయపడుతున్నట్లుగా పరిస్థితి కనిపిస్తోందని తెలుగు తమ్ముళ్లు ఆఫ్ ది రికార్డు వ్యాఖ్యానిస్తున్నారు.
అప్పుడేమో అధికారంతో.. ఇప్పుడేమో అధికారం లేకున్నా భయపెడుతున్న ఘనత జగన్ మోహన్ రెడ్డితో పాటు, వైసీపీ మాజీ మంత్రులు, ఆ పార్టీ నాయకులకే దక్కిందనే విషయం.. వారి బెదిరింపుల తీరును బట్టి అర్ధం అవుతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే విషయాన్ని కొందరు టీడీపీ అనుకూల సీనియర్ పాత్రికేయులు కూడా ఇటీవల పలు ఇంటర్వ్యూలలో కూడా కామెంట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా గ్రూప్‌లలో బాగా ట్రోల్ అవుతున్నాయి. అధికారం లేనప్పుడు తెరిచిన “రెడ్ బుక్”.. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా కూడా.. ఇంకా పూర్తిగా తెరుచుకున్నట్లు లేదంటున్నారు.
Also Read : కాషాయ నేతలతో బీ కేర్ ఫుల్..!
ప్రతిపక్ష హోదా కూడా రాని వైసీపీ.. ఎన్నికలకు మూడేళ్ల ముందు నుంచే అధికారం మాదే అని చెబుతున్నారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ నేతలు నిత్యం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌పైన పదే పదే విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. అయినా సరే.. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, అధికార ప్రతినిధులు అయితే తమకేం పట్టనట్లు మౌనం పాటిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వారానికి ఓ సారి ఆంధ్రకు చుట్టపు చూపుగా వస్తున్న జగన్.. మీడియా సమావేశం పెట్టి మరీ ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారు. ఇక వైసీపీ మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజా వంటి నేతలు అయితే.. నిత్యం ఏదో ఒక చోట నోటితో రెచ్చిపోతున్నారు. వాడెంత, వీడెంత అంటూ నోటికొచ్చిన మాట అనేస్తున్నారు.
అసలు విషయం ఏమిటంటే.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులను, కార్యకర్తలను అధికారంతో భయపెట్టి, ఇళ్ల నుండి బయటకు రాకుండా హౌస్ అరెస్టులు చేశారు. బయటకు వచ్చిన వారి పై అక్రమ కేసులు పెట్టి, వేధింపులకు గురి చేశారు. అనేక విధాలుగా నాలుగున్నర ఏళ్లు పైగా సాధింపులకు కూడా పాల్పడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఏదేదో జరుగుతుందని, లోకేష్ మంత్రి అయ్యాక “రెడ్ బుక్ ” ఓపెన్ అవుతుందని, వైసీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ వదిలి పారిపోతారని తెలుగు తమ్ముళ్లు భావించారు. కానీ ప్రస్తుతం ప్రస్తుతం వైసీపీ నేతలు ఆధారాలు లేని ఆరోపణలు, విమర్శలు చేస్తూ.. మరోసారి కులం కుంపట్లు రాజేస్తూ.. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
నిజానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైన కొత్తగా ఎలాంటి కేసులు నమోదు చేయాల్సిన అవసరం లేదు. ఆయనపై ఇప్పటికే ఈడీ, సీబీఐ సంస్థలు అక్రమాస్తుల కేసులు నమోదు చేశాయి. ఆ కేసుల్లో 16 నెలలు జైలు జీవితం కూడా గడిపి బెయిల్ పైన బయటకు వచ్చారు. ఆ కేసుల విచారణ ప్రారంభిస్తే చాలు. మళ్లీ జగన్ జైలుకు పోతారు. కానీ.. కేంద్ర బీజేపీ పెద్దల పరోక్ష మద్దతుతో దాదాపు 12 ఏళ్లుగా జగన్ బయటే ఉన్నారు. ఇప్పుడు ఆ పెద్దల అండ చూసుకునే.. కూటమి ప్రభుత్వంపైన.. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ పైన పదే పదే విమర్శలు, అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read : దేవర 2.. షాక్‌లో తారక్ ఫ్యాన్స్..!
ఢిల్లీ పెద్దలు జగన్‌కు పరోక్షంగా మద్దతు ఇస్తున్నారని.. వాళ్లే చంద్రబాబు, లోకేష్ చేతులను కట్టేశారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది. నిజానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు మూడేళ్లకు.. అది కూడా ఒంగోలు మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాతే టీడీపీ నేతలు, కార్యకర్తలు కాస్త ధైర్యంగా బయటకు వచ్చారు. అప్పటి వరకు చాలా మంది నేతలు ఏపీలో కాలు పెట్టేందుకు కూడా భయపడ్డారనేది బహిరంగ రహస్యం. కానీ.. కూటమి అధికారంలోకి వచ్చిన తొలి నెల నుంచే.. వైసీపీ నేతలు రెచ్చిపోయారు. కార్యకర్తలు అయితే కనీసం లెక్క చేయటం లేదు. రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలు కట్టారు. ప్రభుత్వ పథకాల మీద సెటైర్లు వేశారు. కూటమి ప్రభుత్వాన్ని.. ముఖ్యంగా చంద్రబాబు, పవన్, లోకేష్‌లను లెక్క చేయటం లేదు.
తాజాగా మరో అడుగు ముందుకు వేసిన వైసీపీ అధినేత.. పాత గేమ్ ప్లాన్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. అదే కాపులను రెచ్చగొట్టడం. జనసేన పార్టీలో అసంతృప్తులుగా ఉన్న కాపులను వివిధ మార్గాల ద్వారా చేరదీసి.. వారితో పవన్ పైన విమర్శలు, చంద్రబాబు పైన ఆరోపణలు చేయిస్తున్నారు. వైసీపీ మాజీ కాపు మంత్రులు, నేతలు కూడా చంద్రబాబు, పవన్‌పైన రెచ్చిపోతూ.. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అంబటి, పేర్ని నాని చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ. వారిపై చర్యలు తీసుకుంటే.. అది కాపు కులంపై దాడి అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సరే.. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కనీసం అడ్డుకోవటం లేదు. ఇంకా చెప్పాలంటే.. నాకెందుకు అన్నట్లుగా ప్రతి ఒక్కరూ వ్యవహరిస్తున్నారు. దీంతో అసలు అధికారంలో ఉన్నది ఎవరనే అనుమానం వస్తుంది.

