ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్నప్పటికీ, తెర వెనుక పొంచి ఉన్న బీజేపీ భయం ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను వెంటాడుతోంది. జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రంలోనైనా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని, కాలక్రమేణా వాటిని బలహీనపరిచి తానే ఏకైక శక్తిగా ఎదగడం బీజేపీ సాంప్రదాయ వ్యూహం. ప్రస్తుతం ఏపీలో కూడా 2029 నాటికి సొంత కాళ్లపై నిలబడాలని అమిత్ షా ఆదేశాలు ఇవ్వడం, టీడీపీ, జనసేన అధినేతలలో గుబులు పుట్టిస్తోందనే మాట బాగా వినిపిస్తోంది. భవిష్యత్తులో బీజేపీ కనుక ఏపీలో తన సొంత బలాన్ని పెంచుకుంటే, అది స్థిరమైన ఓటు బ్యాంక్ ఉన్న వైసీపీ కంటే, దాదాపు ఒకే రకమైన పట్టణ, మధ్యతరగతి ఓటర్లను నమ్ముకున్న టీడీపీ, జనసేన పార్టీల ఉనికికే పెద్ద ముప్పుగా మారే ప్రమాదం ఉంది.
Also Read : గోదావరి – బనకచర్లకు సంపూర్ణ మద్దతు..!
ఈ అంతర్గత భయం, భవిష్యత్ రాజకీయ మనుగడ కోసమే చంద్రబాబు నాయుడు తన దశాబ్దాల నాటి రాజకీయ శైలిని పూర్తిగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. గతంలో కేంద్ర ప్రభుత్వాలతో ఘర్షణ పడిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతం కాస్త లొంగి ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎంతలా అంటే, తన సొంత బ్రాండ్ అయిన జై తెలుగుదేశం.. జై జన్మభూమి నినాదాన్ని పక్కన పెట్టి, బహిరంగ సభల్లో ప్రధాని మోదీ తరహాలో భారత్ మాతాకీ జై అంటూ జాతీయవాద నినాదాలను స్వయంగా జనం చేత పలికిస్తున్నారు. ఇది కేవలం కేంద్రం నుండి నిధులు రాబట్టడానికే కాదు, ఏపీలో బీజేపీ దూకుడు పెంచే అవకాశం లేకుండా.. తానే వారి ఐడియాలజీని ఓటర్లలోకి తీసుకెళ్తున్నట్లు చూపే ఒక ముందస్తు రక్షణాత్మక వ్యూహం.
Also Read : క్రికెట్ అభిమానుల సరికొత్త క్రష్… ఇరా ఏరీ
మరోవైపు, పవన్ కళ్యాణ్ కూడా ఇదే బీజేపీ భయం, జాతీయ వ్యూహాన్ని గమనించి తనదైన శైలిలో అడుగులు వేస్తున్నారు. ఏపీలో బీజేపీ బలపడితే తన జనసేన ఓటు బ్యాంక్‌పై ప్రభావం ఉంటుందనే అంచనాతో, ఆయన తన రక్షణ కోసం నేరుగా జాతీయ రాజకీయాల వైపే చూపులు సారిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ – బీజేపీ తరహాలోనే తన పార్టీని క్రమశిక్షణ గల జాతీయ దృక్పథం ఉన్న ప్రాంతీయ పార్టీగా మార్చే ప్రయత్నాలు ఇందులో భాగమే. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగస్వామి కావడం ద్వారా ఢిల్లీ స్థాయిలో తన పట్టు నిలుపుకోవాలని, తద్వారా రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగా తమను మింగేయకుండా చూసుకోవాలని పవన్ భావిస్తున్నారు. మొత్తంగా, పైకి ముగ్గురు మిత్రులుగా కనిపిస్తున్నా, 2029 నాటి ఆపరేషన్ ఏపీ కింద బీజేపీ ఎక్కడ తమను కకావికలం చేస్తుందో అనే భావనంతో బాబు, పవన్ ఇద్దరూ జాతీయవాద ముసుగును గట్టిగా ఆశ్రయిస్తున్నారు.

