కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్దం అవుతోంది. మూడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని మోదీ ఎన్డీఏ పక్షాలతో కీలక భేటీ నిర్వహించారు. కీలక దిశా నిర్దేశం చేశారు. ఈ నెలలోనే తన కేబినెట్ ప్రక్షాళన దిశగా కసరత్తు చేస్తున్నారు. మిత్రపక్షాలకు ఈ సారి ప్రాధాన్యత దక్కనుంది. ఏపీ నుంచి ప్రస్తుతం ముగ్గురు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు. కాగా, ఏపీకి మరో మంత్రి పదవి దక్కనుంది. జనసేనకు అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలోకి జనసేన చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్డీఏలో చేరిన తరువాత తొలిసారి జరుగుతున్న మంత్రివర్గ ప్రక్షాళనలో వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలని పవన్ భావిస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం.
Also Read : ముంబైలో బన్నీ ఇంటి అద్దెకే నెలకు 16 లక్షలా?
జనసేన పార్టీ తొలిసారి రాజ్యసభలో అవకాశం దక్కించుకుంది. లింగమేనని రమేశ్ పార్టీ నుంచి తొలి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఇదే సమయంలో కేంద్ర కేబినెట్‌లో కూడా ప్రాతినిధ్యం తీసుకోవాలనే అంశం పైన కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం ఏపీ నుంచి ఇద్దరు టీడీపీ.. బీజేపీ నుంచి ఒకరు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఈసారి ప్రక్షాళనలో వీరి శాఖలు మారే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో ఏపీకి మరో మంత్రి పదవి ఇచ్చేందుకు ప్రధాని మోదీ సుముఖంగా ఉన్నారని సమాచారం. టీడీపీ, జనసేన పార్టీల్లో ఒకరికి అవకాశం కల్పించేలా చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో, ఈ సారి జనసేనకు మంత్రి పదవి దక్కనుందనే చర్చ సాగుతోంది.
జనసేన నుంచి ఇద్దరు లోక్‌సభ సభ్యులున్నారు. అలాగే రాజ్యసభలో ఒకరున్నారు. అయితే.. సామాజిక సమీకరణాల లెక్క న కూటమి నేతలు కేంద్రంలో కూడా మంత్రులుగా తమ ఎంపీలకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుత సమీకరణాల్లో లింగమనేనికి అవకాశం లేనట్లే అని రాజకీయ వర్గాల సమాచారం. కాగా.. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తొలిసారి ఎంపీ. గోదావరి జిల్లాల నుంచి ఇప్పటికే శ్రీనివాస వర్మ మంత్రిగా కొనసాగుతున్నారు. పురందేశ్వరికి కీలక పదవి దక్కే అవకాశం ఉంది. దీంతో.. జనసేన నుంచి మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పేరు తెర మీదకు వస్తోంది. ఇప్పటి వరకు ఆయన మూడు సార్లు ఎంపీ అయ్యారు. అదే విధంగా పలు పార్లమెంటరీ కమిటీల్లో కూడా పని చేసారు. సామాజిక లెక్కలు కూడా కలిసి రానున్నాయి.
Also Read : కామెడీ పేరుతో లేకి పనులు.. వెకిలి చేష్టలు..!
అయితే.. కేంద్రంలో మరో మంత్రిగా అవకాశం దక్కితే.. ఎవరికి కేటాయించాలనేది చంద్రబాబు, పవన్ సమిష్టిగా నిర్ణయం తీసుకోనున్నారు. జనసేన మంత్రి పదవి తీసుకోవాలని భావిస్తే.. బాలశౌరి పేరు రేసులో ఉన్నప్పటికీ.. తుది నిర్ణయం మాత్రం పవన్ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పటికే ఏపీ తరఫున కమ్మ సామాజిక వర్గం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, క్షత్రియ సామాజిక వర్గం నుంచి శ్రీనివాస వర్మ, బీసీ తరఫున కింజరాపు రామ్మోహన్ నాయుడు మంత్రి పదవులు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేత బాలశౌరి పేరు బలంగా వినిపిస్తోంది.. 2004లో తొలిసారి తెనాలి నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2019లో మచిలీపట్నం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. గత ఎన్నికలకు ముందు జనసేనలో చేరిన బాలశౌరి ఎంపీగా పోటీ చేసిన మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అటు సామాజిక లెక్కలు, ఇటు సీనియారిటీ, మరోవైపు అధినేతకు విధేయత వంటి అంశాలు బాలశౌరికి కలిసి రానున్నాయి.

