తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి. అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో.. ఓ అనలిస్టు చేసిన వ్యాఖ్యలు.. మరోసారి ప్రాంతీయ విద్వేషాలకు తెర లేపింది. అసలు సంబంధం లేని విషయంపై మాట్లాడటమే కాకుండా.. ఆ వ్యవహారాన్ని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ముడి పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదో అన్నారని.. ఆయనను బెదిరించారు కొందరు. ఇక రాజకీయ పార్టీల నేతలు కూడా ప్రాంతాల కుంపట్ల మధ్య చలి కాచుకునేందుకు నానా పాట్లు పడ్డారు. చివరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన పార్టీ సమావేశానికి అనుమతి కూడా నిరాకరించారు. దీంతో రాజకీయ వేడి మరింత రాజుకుంది.
Also read : క్షణాల్లోనే పీఎఫ్ డబ్బులు వచ్చేస్తాయంట..!
ఇక అసలు విషయం ఏమిటంటే.. తెలంగాణ సాధన తన వల్లే జరిగిందని.. అసలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తన పోరాటం వల్లే అని గొప్పగా చెప్పుకున్నారు నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ నేతలు. నీరు, నిధుల కేటాయింపులో తమకు అన్యాయం జరుగుతోంది అంటూ తొలిసారి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభించారు కేసీఆర్. నిజానికి తనకు మంత్రి పదవి కాకుండా డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కేసీఆర్.. ఆ కోపంతోనే పార్టీ పెట్టారనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్న తలసాని శ్రీనివాసయాదవ్, ఎర్రబెల్లి దయాకరరావు వంటి నేతలు అప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరించారు. మరి వారికి జరగని అన్యాయం.. కేసీఆర్‌కు మాత్రమే జరగటంతో తెలంగాణ మొత్తానికి అన్యాయం చేసినట్లు అయ్యింది.
కేసీఆర్‌ను తెలంగాణ బాపు అని బీఆర్ఎస్ నేతలు అభివర్ణిస్తారు. పులి నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించారని గొప్పగా చెప్తారు. అలాంటి కేసీఆర్ తీరు ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వరుసగా రెండుసార్లు సీఎంగా పని చేసిన కేసీఆర్.. హ్యట్రిక్ మిస్ అయిన తర్వాత సైలెంట్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే.. తన ఫామ్ హౌజ్ దాటి బయటకు రావటం లేదు. రెండున్నరేళ్ల కాలంలో కేవలం రెండే సార్లు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అది కూడా పట్టుమని పది నిమిషాలు కూడా సభలో లేరు. సభకు రాకపోతే సభ్యత్వం రద్దు అవుతుందేమో అనే భయంతో వచ్చారనే విమర్శలు కూడా వినిపించాయి.
Also read : శ్రీశైలం భక్తుల కష్టాలు తీరేదెప్పుడు..?
జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అన్ని పార్టీల నేతలు తెలంగాణ జెండా ఎగురవేశారు. అయితే మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. పార్టీ కార్యాలయంలో కాదు కదా.. కనీసం తన ఫామ్ హౌజ్‌లో కూడా జెండా వందనం చేసినట్లు కానీ.. తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులకు నివాళి అర్పించినట్లు కానీ.. ఎక్కడా కనిపించలేదు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను అధికారంలో ఉన్న సమయంలో కూడా సెప్టెంబర్ 17న నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కూడా కేసీఆర్ ఎప్పుడూ పాల్గొనలేదు. ఇదేనా తెలంగాణపైన కేసీఆర్‌కు ఉండే ప్రేమ అని విమర్శలు చేస్తున్నారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే తెలంగాణ అంటారా.. మిగిలిన సమయంలో అనలేరా.. అని సూటిగా ప్రశ్నిస్తున్నారు.

