Monday, May 25, 2026 08:01 PM
Monday, May 25, 2026 08:01 PM

మోదీ 3.0.. ముహుర్తం ఫిక్స్..!

మోదీ 3.0 ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో రెండేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకోనుంది. ఈ కీలక మైలురాయిని పురస్కరించుకుని కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులకు చకచకా సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శాఖల వారీగా మంత్రుల పనితీరుపై ప్రధాని మోదీ క్షుణ్ణంగా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాల అమలు, లక్ష్యాల సాధన, పరిపాలనా బాధ్యతల్లో ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు. కొన్ని శాఖల పేలవమైన పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని.. మంత్రులు, అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. దేశ పురోభివృద్ధే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సైనిక క్రమశిక్షణతో పని చేయాలని, ప్రజాధనాన్ని వీలైనంతగా పొదుపు చేయాలని స్పష్టం చేశారు. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ వ్యవస్థ పనితీరు మారాలని, వికసిత భారత్ లక్ష్యం కోసం రంగాల వారీగా దూసుకుపోవాలని మోదీ పిలుపునిచ్చారు.

Also Read : అక్కడ మాజీ మంత్రికే పలుకుబడి..!

ఈసారి జరగబోయే పునర్వ్యవస్థీకరణలో దాదాపు 20 నుంచి 30 మంది మంత్రుల వరకు మార్పులు చేర్పులు ఉండవచ్చని ఢిల్లీ వర్గాల సమాచారం. పనితీరు సరిగ్గా లేని కొందరు సీనియర్లను తప్పించి, వారి స్థానంలో కొత్త ముఖాలకు, ముఖ్యంగా యువత, మహిళలకు కేబినెట్‌లో చోటు కల్పించే యోచనలో బీజేపీ అధిష్ఠానం ఉంది. గతంలో మోదీ 2.0 హయాంలో జూలై 7, 2021న జరిగిన అతిపెద్ద కేబినెట్ ప్రక్షాళనలో 43 మంది కొత్త మంత్రులు ప్రమాణం చేయగా, 12 మంది సీనియర్లకు ఉద్వాసన పలికారు. ఇప్పుడు కూడా అదే తరహాలో గట్టి నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని, క్షేత్రస్థాయిలో పట్టున్న కొందరు అనుభవజ్ఞులైన సీనియర్ నేతలకు మళ్లీ కేబినెట్‌లో చాన్స్ ఇవ్వనున్నారు.

రాబోయే 2027 నాటికి దేశంలోని ఏడు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలల్లోనే ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలకు, అలాగే ఈ ఏడాది నవంబర్-డిసెంబర్‌లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండటంతో ఆయా రాష్ట్రాల నుంచి గెలిచిన నేతలకు కేంద్ర కేబినెట్‌లో సముచిత స్థానం దక్కనుంది. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలనే వ్యూహంలో భాగంగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా కొందరు కీలక నేతలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

Also Read : చంద్రబాబుకు తల నొప్పిగా గుంటూరు ఎమ్మెల్యేలు..!

జూన్ 9 నాటికి మోదీ ప్రభుత్వం కేంద్రంలో 12 ఏళ్ల సుదీర్ఘ పాలనను పూర్తి చేసుకోనుంది. ఈ లోపే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తన నూతన కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైంది. అలాగే యూపీలో కొత్తగా ఎన్నికైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పంకజ్ చౌదరి కూడా తన కొత్త టీము ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం నుండి ఉద్వాసనకు గురయ్యే సీనియర్ నేతలను జాతీయ స్థాయిలో నితిన్ నవీన్ టీమ్ల్‌లోకి తీసుకునే చాన్స్ ఉంది. దీనివల్ల ప్రభుత్వంలో బాధ్యతలు తగ్గినా.. పార్టీ పరంగా వారికి తగిన గౌరవం ఇచ్చినట్లు అవుతుందని బీజేపీ భావిస్తోంది. అలాగే మోదీ 3.0 లో ఉన్న మిత్రపక్షాల సూచనల మేరకు కేంద్ర మంత్రివర్గంలో మార్పులు ఉంటాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి మిత్రపక్షాల నేతలకు కేబినెట్‌లో మరికొన్ని కీలక పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి.

Also Read : బండి ఫ్యూచర్ ప్లాన్ ఏమిటీ..?

కేంద్రంలో మోదీ సర్కార్ 12 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్ 5 నుంచి 21 వరకు “12 ఏళ్ల విశ్వాసం – వికాసం – జన సంక్షేమం” పేరిట దేశవ్యాప్తంగా భారీ ఎత్తున వేడుకలు నిర్వహించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ రాష్ట్రాల అధ్యక్షులను ఆదేశించారు. జూన్ 8, 9 తేదీల్లో ఢిల్లీలో భారీ మీడియా సంవాద్ కార్యక్రమం, జూన్ 11, 12 తేదీల్లో ఎన్డీయే ముఖ్యమంత్రులు, మంత్రుల ప్రత్యేక సమావేశం జరగనుంది. ప్రత్యేక జన సంపర్క ప్రచారంలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక రోజంతా గడపనున్నారు. మూడు రోజుల పాటు జన సంక్షేమ శిబిరాలు నిర్వహించి ప్రభుత్వ పథకాల లబ్దిదారుల నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్ చేపడతారు. జూన్ 5న “0అమ్మ పేరుతో ఒక మొక్క” కార్యక్రమాన్ని, జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి మండలంలో భారీగా నిర్వహించనున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఇంధన సంక్షేమ పరిస్థితుల దృష్ట్యా నేతలు వ్యక్తిగత కాన్వాయ్‌లు కాకుండా కార్ పూలింగ్ లేదా ప్రజా రవాణాను వాడాలని అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే కేవలం స్వదేశీ ఉత్పత్తులనే ప్రోత్సహించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మహిళా పోలీసు తీరు...

జరిగింది ఘోరం.. అత్యంత నీచమైన చర్య.....

కమ్మ నేతకు రాజ్యసభ..?...

ఏపీలో త్వరలో ఖాళీ కానున్న 4...

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం...

దేశంలోని గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను పూర్తిగా...

గోదావరి క్లీనింగ్‌ పై...

ఏపీ డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్...

దుమారం రేపుతున్న సీజేఐ...

ఆల్ ఇండియా సెంట్రల్ సర్వీసెస్‌కు చెందిన...

బండి ఫ్యూచర్ ప్లాన్...

తెలంగాణ బీజేపీలో ఫైర్ బ్రాండ్ నేతగా...

పోల్స్