పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న చమురు ధరల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోబోతోందని, ముఖ్యంగా దేశవ్యాప్తంగా రాబోయే రెండేళ్లపాటు భారీ నిర్మాణ పనులపై నీతి ఆయోగ్ నిషేధాన్ని సిఫార్సు చేసిందనే వార్తలు రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఢిల్లీలోని సెంట్రల్ సెక్రటేరియట్ పనులను సైతం కేంద్రం వాయిదా వేసిందన్న ప్రచారం ఈ ఆందోళనలను మరింత పెంచింది.
Also Read : బ్రేకింగ్: నాగార్జున యాదవ్ కు మ్యూజిక్ స్టార్ట్..!
అయితే, ఈ వార్తలపై నీతి ఆయోగ్ తాజాగా స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చింది. నిర్మాణ రంగంపై తాము ఎటువంటి నిషేధాన్ని ప్రతిపాదించలేదని, కేంద్రానికి అటువంటి సిఫార్సులు చేయలేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో మరియు కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలు వాస్తవ విరుద్ధమని కొట్టిపారేసింది. సెంట్రల్ సెక్రటేరియట్ పనులు నిలిపివేసినట్లు వస్తున్న వార్తల్లోనూ నిజం లేదని, ప్రభుత్వ కార్యకలాపాలు ప్రణాళిక ప్రకారమే సాగుతాయని పేర్కొంది.
Also Read : అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపులో వాస్తవాలు ఇవే..!
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణ పనులపై దీని ప్రభావం ఉంటుందా అన్న సందేహాలు వెల్లువెత్తాయి. నీతి ఆయోగ్ క్లారిటీ ఇవ్వడంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్టులకు ఎటువంటి అధికారిక అడ్డంకులు లేవని స్పష్టమవుతోంది. కేంద్రం నుంచి నిధుల విడుదల మరియు నిర్మాణ పనులు యథాతథంగా కొనసాగే అవకాశం ఉంది. అయినప్పటికీ, అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిసరుకుల ధరలు, రవాణా వ్యయాలు నిర్మాణ రంగంపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. యుద్ధ వాతావరణం వల్ల దిగుమతి ఖర్చులు పెరిగితే, ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగవచ్చు. కాబట్టి, ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులను సమన్వయం చేసుకుంటూ ఈ కీలక ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడమే ఏకైక మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

