అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలకు పాకిస్థాన్ వేదికవుతున్న తరుణంలో, ఇజ్రాయెల్, పాకిస్థాన్ మధ్య తీవ్ర దౌత్యపరమైన యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ ను క్యాన్సర్ లాంటి దేశం అని వర్ణిస్తూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సోషల్ మీడియా వేదికగా ఇజ్రాయెల్‌ను దుష్ట దేశం, మానవాళికి శాపం అని అభివర్ణించారు. అంతేకాకుండా, లెబనాన్ లో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని ఆరోపించారు.
Also Read : మావిగన్ పై తిట్లేనా..? చేసే అభివృద్ధి చెప్పుకోలేరా..?
ఒకవైపు ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు జరుగుతుంటే, మరోవైపు ఇజ్రాయెల్ రక్తపాతం సృష్టిస్తోందని ఆయన విమర్శించారు. దీనిపై ఇజ్రాయిల్ రియాక్ట్ అయింది. పాక్ మంత్రి వ్యాఖ్యలను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ తీవ్రంగా ఖండించారు. శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్నామని చెప్పుకుంటున్న దేశం నుండి ఇలాంటి యూదు వ్యతిరేక వ్యాఖ్యలు రావడం దారుణమని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్ మనుగడను ప్రశ్నార్థకం చేసే ఉగ్రవాదుల నుండి.. వారిని సమర్థించే శక్తుల నుండి తమ దేశాన్ని రక్షించుకునే శక్తి ఇజ్రాయెల్ కు ఉందని ఆయన స్పష్టం చేశారు.
Also Read : ఎమ్మెల్యేలకు లోకేష్ వార్నింగ్..!
ఈ వ్యాఖ్యలతో పాకిస్థాన్ తన తటస్థ వైఖరిని కోల్పోయిందని, చర్చలకు మధ్యవర్తిగా ఉండే అర్హత లేదని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం పేర్కొంది. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో కీలక చర్చలు జరగాల్సి ఉంది. అయితే, పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యల వల్ల ఈ చర్చల వాతావరణం దెబ్బతిందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ ఇప్పటికే తన సైనిక కార్యకలాపాలను లెబనాన్ లో కొనసాగిస్తామని ప్రకటించింది, అక్కడ ఎటువంటి కాల్పుల విరమణ లేదని స్పష్టం చేసింది.

