తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌పై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. టీటీడీ ఈవో పదవి నుంచి సింఘాల్‌ను తప్పించి.. ఆయన స్థానంలో సీఎంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్రను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయం రెండు రోజుల ముందే ఆంధ్ర న్యూస్ 9 చెప్పేసింది కూడా. వారం రోజులుగా ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన అంశం కల్తీ నెయ్యి కుంభకోణం. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు సిట్ అధికారులు కోర్టుకు నివేదిక సమర్పించారు. అయితే ఈ కుంభకోణం జరిగిన సమయంలో ఎవరున్నారనే విషయం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కల్తీ నెయ్యి సరఫరా మొదలైనట్లు నివేదికలు చెబుతున్నాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో అప్పటికే టీటీడీ ఈవోగా ఉన్నారు అనిల్ కుమార్ సింఘాల్. ఆ తర్వాత మరో ఏడాదిన్నర పాటు కూడా ఆయన అదే పదవిలో కొనసాగారు. దీంతో కల్తీ నెయ్యి కుంభకోణం సింఘాల్ ఆధ్వర్యంలో జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక సిట్ అధికారులు కూడా సింఘాల్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో సింఘాల్‌ను టీటీడీ ఈవో పదవి నుంచి తక్షణమే బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈవో బాధ్యతలను తక్షణమే అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అప్పగించి రిలీవ్ అవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సింఘాల్‌ను వెంటనే జీఏడీలో రిపోర్టు చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. సింఘాల్ స్థానంలో ముద్దాడ రవిచంద్రను ఇంఛార్జ్ ఈవోగా నియమిస్తూ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read : వీణ రాగాలకు మాయమైన మద్దతు..!
అసలు విషయం ఏమిటంటే.. శ్రీవారి లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యిలో రసాయనాల మిశ్రమం కలవటం పై సీబీఐ సిట్ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను సింఘాల్ గుడ్డిగా అమలు చేశారని, ఆయనతో పాటు అప్పటి తిరుమల అదనపు ఈవో ధర్మారెడ్డి, టీటీడీ ఆర్ధిక సలహాధారు బాలాజీ, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా.. అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్లు మౌనం వహించారని ప్రభుత్వానికి రాసిన లేఖలో సిట్ అధికారులు స్పష్టం చేశారు. ఆ ముగ్గురి పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సిట్ అధికారులు కోరారు కూడా. అయితే ఈ ముగ్గురిలో ధర్మారెడ్డి ఇప్పటి నుంచే సర్వీస్ నుంచి రిటైర్ అయ్యారు. అయన ప్రస్తుతం నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెందిన ఒక కంపెనీలో సీఈవోగా పనిచేస్తున్నారు. ధర్మారెడ్డిని ఇప్పటికే సిట్ అధికారులు విచారించారు కూడా.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు అన్ని శాఖల్లో కీలక స్థానాల్లో ఉన్న అందరు అధికారులను జగన్ సర్కార్ బదిలీ చేసింది. దీంతో సింఘాల్ పై కూడా వేటు ఖాయమని అంతా అనుకున్నారు. అయితే ధర్మారెడ్డి సిఫార్సుతోనే అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ ఈవోగా కొనసాగినట్లు అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అలా కొనసాగటమే ఇప్పుడు ఆయన కొంప నిలువునా ముంచిందనేది వాస్తవం. నిజానికి 2017లోనే టీటీడీ ఈవోగా సింఘాల్‌ను నియమిస్తూ అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లు ఈవోగా పని చేసిన సింఘాల్.. అంతటితో తృప్తి పడలేదు. ఆయనకు అత్యంత సన్నిహితుడైన అప్పటి తిరుమల అదనపు ఈవో ధర్మారెడ్డి ద్వారా అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి.. మరికొంత కాలం ఈవో పోస్టు కొనసాగించాలని కోరినట్లు తెలుస్తోంది.
Also Read : కేంద్ర బడ్జెట్ ప్రభావం: మార్కెట్లకు ముప్పేనా?
తనకు అత్యంత సన్నిహితుడైన ధర్మారెడ్డి సిఫార్సు చేయడంతో.. జగన్ కూడా సింఘాల్‌ను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారనేది సన్నిహితుల మాట. ఆ నిర్ణయమే ఇప్పుడు ఆయన కొంప ముంచింది అనే మాట సచివాలయ వర్గాల్లో, ఐఏఎస్ సర్కిల్‌లో వినిపిస్తోంది. సింఘాల్ ఈవోగా ఉన్న సమయంలోనే కల్తీ నెయ్యి టెండర్లకు నాటి వైసీపీ ప్రభుత్వం తెర లేపింది. టీటీడీ పాలకమండలి ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి పేరును అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించిన జగన్.. మిగిలిన పాలకమండలి సభ్యులను మాత్రం ఆరు నెలల తర్వాతే ప్రకటించారు. దీంతో పాలకమండలి నిర్ణయంలో ఛైర్మన్, ఈవో, అదనపు ఈవో మాత్రమే నిర్ణయాలు తీసుకున్నారు.
“దురా” లోచనతో.. ఒక పథకం ప్రకారం సింఘాల్‌ను కల్తీ నెయ్యి కుంభకోణంలో ధర్మారెడ్డి ఇరికించారా అనే అనుమానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మూడేళ్ల పాటు ఈవో పదవిలో ఉన్న సింఘాల్.. మరో ఏడాది కూడా కొనసాగాలని ఆశ పడటం వల్లే ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనేది అధికార వర్గాల్లో వినిపిస్తున్న మాట. నాడు సింఘాల్ పదవి కోసం సిఫార్సు చేసిన ధర్మారెడ్డి.. ఇప్పుడు తనకేం తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారని.. అందుకే ఇప్పుడు బదిలీ వేటుతో పాటు ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారనేది బహిరంగ రహస్యం.

