ఫోన్ ట్యాపింగ్ కుంభకోణానికి సంబంధించి హైదరాబాద్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతం చేస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను సిట్ అధికారులు విచారించారు. కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ప్రధాన ఆరోపణ. ఈ ట్యాపింగ్ వెనుక కేటీఆర్, హరీష్ రావు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు కేసీఆర్ కుమార్తె కవిత, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసుపై పోలీసులు విచారణ జరిపిస్తున్నారు.
మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావును వేరు వేరుగా దాదాపు ఏడు గంటల పాటు సిట్ ప్రశ్నించింది. అయితే ఇక్కడే ఓ ప్రశ్న అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇద్దరు నాయకులు చట్టానికి అతీతులు కాదు. నిజానికి చట్టానికి ఎవరూ అతీతులు కాదు. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ నేతల తీరు.. మరీ ముఖ్యంగా కేటీఆర్, హరీష్ తీరు చూస్తుంటే.. చట్టానికి తాము అతీతులమనే విధంగా ప్రవర్తిస్తున్నారు. వారి దృష్టిలో సిట్ అధికారులు గంటల పాటు విచారించడం ఇంకా పెద్ద తప్పు. ఇంకా చెప్పాలంటే.. సిట్ అధికారులు ఇలా విచారించి తప్పు చేస్తున్నారనేది కేటీఆర్, హరీష్ చెబుతున్న మాట.
Also Read : వైవీ సుబ్బారెడ్డికి చేదు అనుభవం..!
నిజానికి రాజకీయ నాయకులను విచారణ కోసం పోలీసులు స్టేషన్‌కు పిలిపించడం సర్వసాధారణం. ఇదే మొదటిసారి కాదు. గతంలో అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని 3 రోజుల పాటు విచారించిన తర్వాతే అరెస్టు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ నేతలను కూడా పోలీసులు విచారించారు. ఇంకా చెప్పాలంటే.. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు వంటి ప్రముఖులు కూడా రాజకీయ ప్రేరేపిత కేసులను ఎదుర్కొన్నారు. సమన్లు అందుకున్నారు. కోర్టుల ముందు హాజరయ్యారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల ముందు హాజరవ్వడాన్ని కేటీఆర్, హరీష్ సహా బీఆర్ఎస్ నేతలు మాత్రం అహంకారపూరిత వైఖరి ప్రదర్శిస్తున్నారు. దర్యాప్తు అధికారులను ముందు విచారించాలనేలా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక మరో మాజీ మంత్రి హరీష్ రావు అయితే.. పదవీ విరమణకు దగ్గరగా ఉన్న వారికి కూడా వార్నింగ్ ఇచ్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. “అన్యాయంగా లేదా చట్టవిరుద్ధంగా” వ్యవహరించే అధికారులు పదవీ విరమణ తర్వాత కూడా దీర్ఘకాలిక న్యాయ పోరాటాలతో సహా జీవితాంతం పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని, వారు ఎక్కడ ఆశ్రయం పొందుతున్నా సరే.. వదిలేది లేదన్నట్లు ఆయన హెచ్చరిస్తున్నారు.
Also Read : చెవిరెడ్డి : విజయవాడ టూ తీహార్.. వయా మంతెన ఆశ్రమం..!
నిజానికి ఇలాంటి వ్యాఖ్యలు చట్టబద్ధమైన విధులను నిర్వర్తిస్తున్న వారిని బెదిరించడమే. చట్టాలను తప్పుబట్టడమే అవుతుంది. నిజానికి కేటీఆర్, హరీష్‌లను పోలీసులు, కోర్టులు నిందితులుగా ముద్ర వేయలేదు. కేసు విచారణలో భాగంగా మాత్రమే వారికి సమన్లు జారీ చేశారు. వారిద్దరిని విచారించారు. కేసు దర్యాప్తుకు ఎవరైనా సరే సహకరించాలి. ఇంకా చెప్పాలంటే.. ఎలాంటి తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం లేదు. కేటీఆర్, హరీష్ మాత్రం సహకరించకుండా బహిరంగంగా బెదిరిస్తున్నారు. గతంలో వివేకా హత్య కేసులో విచారణకు రావాలని ఎంపీ అవినాష్ రెడ్డికి సమన్లు జారీ చేస్తే.. వస్తా అని చెప్పి.. సైలెంట్‌గా కర్నూలు వెళ్లిపోయారు.
మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితురాలని, తన తండ్రి నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తన భర్త ఫోన్‌ను కూడా ట్యాప్ చేసిందని బహిరంగంగా ఆరోపించారు. నిజానికి ఈ ఆరోపణలపై కూడా సిట్ దర్యాప్తు చేయాలి. కవిత చేసిన ఆరోపణలపై కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు కనీసం స్పందించలేదు. ఇలాంటి వ్యాఖ్యలను చేసిన కవితను కూడా విచారించాలనేది సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట.

