వైవీ సుబ్బారెడ్డి… ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నంబర్ టూ స్థానంలో ఉన్న నేత. ఇంకా చెప్పాలంటే వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కూడా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తోడల్లుడు కావడంతో వైవీ సుబ్బారెడ్డికి అటు పార్టీలో, ఇటు కుటుంబంలో మంచి గుర్తింపు ఉంది. సుబ్బారెడ్డి మాటకు మంచి గుర్తింపు కూడా ఇస్తారు. అందుకే జగన్ కూడా సుబ్బారెడ్డికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. 2014-19 మధ్య కాలంలో ఒంగోలు పార్లమెంట్ తరఫున వైసీపీ ఎంపీగా పోటీ చేసి గెలిచారు సుబ్బారెడ్డి. 2019-24 మధ్య కాలంలో సుబ్బారెడ్డిని రెండుసార్లు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్‌ను చేశారు. ఆ తర్వాత రాజ్యసభకు పంపారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర వైసీపీ కో – ఆర్డినేటర్‌గా ఉన్నారు.
Also Read : బొలిశెట్టిని ఇరికించిన ఏబీవీ..!
వైవీ సుబ్బారెడ్డికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మంచి పలుకుబడి ఉంది. ఇంకా చెప్పాలంటే.. వైసీపీలో ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ప్రత్యేక ఓటు బ్యాంక్ కూడా సుబ్బారెడ్డికి ఉంది. అలాంటి సుబ్బారెడ్డికి సొంత జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. అది కూడా సొంత పార్టీ నేతల నుంచే కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రెండు రోజుల క్రితం మార్కాపురం జిల్లా కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని శంఖరాపురం వెళ్లారు సుబ్బారెడ్డి. ఆ గ్రామంలో ఉన్న తన పీఏ దశరధ రామిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తర్వాత నేరుగా పామూరు మీదుగా కనిగిరి చేరుకున్నారు.
పార్టీలో అధినేత తర్వాత అధినేత స్థాయి వైవీ సుబ్బారెడ్డి కనిగిరి వస్తే.. నియోజకవర్గం వైసీపీ సమన్వయ కర్త కనీసం ఆయనను కలవలేదు. నిజానికి నియోజకవర్గం సమన్వయకర్త అందుబాటులో లేకపోతే.. ముఖ్య నేతల పర్యటనపై ముందుగానే సమాచారం ఇస్తారు. అప్పుడు ఆఘమేఘాల మీద నియోజకవర్గం చేరుకుని.. నేత వెళ్లే వరకు ఆయనతోనే ఉంటారు. కానీ సుబ్బారెడ్డి పర్యటన సమయంలో నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దద్దాల నారాయణ యాదవ్ కనిగిరిలోనే ఉన్నారు. అయినా సరే సుబ్బారెడ్డిని మర్యాద పూర్వకంగా కూడా కలవకపోవడం ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : చెవిరెడ్డి : విజయవాడ టూ తీహార్.. వయా మంతెన ఆశ్రమం..!
కనిగిరి వచ్చిన వైవీ సుబ్బారెడ్డి పీడీసీసీ బ్యాంక్ మాజీ ఛైర్మన్ వైఎం ప్రసాద్‌రెడ్డితో కలిసి డాక్టర్ పెరుగు మురళీ నూతనంగా నిర్మించిన ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చాలాసేపు గడిపారు. ఇదే ఇప్పుడు అసలు వివాదానికి కారణం. వైఎం ప్రసాద్ రెడ్డికి దద్దాల నారాయణ యాదవ్‌కు తొలి నుంచి వైరం ఉంది. జిల్లా జెడ్పీటీసీల సంఘం గుంటక తిరుపతి రెడ్డి కూడా ప్రసాద్ రెడ్డి తీరుపై పార్టీ పెద్దలకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి ఫలితం లేదు. వైఎం ప్రసాద్ రెడ్డి, డాక్టర్ పెరుగు మురళీ మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ వర్గానికి చెందిన నేతలుగా నియోజకవర్గంలో గుర్తింపు. వీరిద్దరు ఇప్పటికీ కనిగిరిలో పెత్తనం చేస్తున్నారనేది దద్దాల, గుంటక వర్గాల ప్రధాన ఆరోపణ.
గత ఎన్నికల సమయంలో బుర్రా మధుసూదన్ యాదవ్‌ను కనిగిరి నుంచి కందుకూరుకు ట్రాన్స్‌ఫర్ చేశారు జగన్. ఆయన స్థానంలో వైసీపీ తరఫున పోటీ చేసిన దద్దాల నారాయణ యాదవ్ 14 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే తన ఓటమికి వైఎం ప్రసాద్ రెడ్డి కారణమని.. గత ఎన్నికల్లో డాక్టర్ పెరుగు మురళీ వైసీపీకి వెన్నుపోటు పొడిచారనేది దద్దాల వర్గం ఆరోపణ. మురళీని సస్పెండ్ చేయాలని పార్టీ పెద్దలకు లేఖలు కూడా రాశారు. అలాంటి పెరుగు మురళీ దగ్గరకు వైవీ సుబ్బారెడ్డి వెళ్లడం దద్దాల, గుంటక వర్గానికి పుండు మీద కారం చల్లినట్లుగా అయ్యింది. పార్టీలో అసలు జనబలం లేని వారి మాటలకు సుబ్బారెడ్డి విలువ ఇస్తున్నారని.. దద్దాల నారాయణ యాదవ్ ఆరోపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఉంటే తాము కూడా తీవ్రంగా నష్టపోతామని దద్దాల, గుంటక వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి కనిగిరి పర్యటనతో వైసీపీలో వర్గపోరు మరింత రాజుకుంది.

