సాధారణంగా నూతన సంవత్సర వేడుకలు అనగానే.. రోడ్లపై కేకులు కట్ చేయడం, ట్రిపుల్ రైడింగ్, బాణా సంచా కాల్చడం, సైలెన్సర్ లు పీకి హడావుడి చేయడం వంటి సన్నివేశాలను మనం చూస్తూనే ఉంటాం. ప్రపంచంలోని అన్ని దేశాల్లో దాదాపుగా ఇవే సన్నివేశాలు కనపడతాయి. అయితే వీటి విషయంలో బెజవాడ పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. వాటిల్లో ఏ ఒక్కటి చేసినా తిత్తి తీస్తామని, తాగి రోడ్ల మీదకు వస్తే.. ఊచలు లేక్కబెట్టాల్సిందే అంటూ వార్నింగ్ ఇచ్చారు.
బెజవాడ సీపీ రాజశేఖర్ బాబు కాసేపటి క్రితం కీలక వ్యాఖ్యలు చేసారు. కొత్త సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని.. పోలీసులు నగరంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ఠమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ నెల 31 రాత్రి వేడుకల సందర్భంగా నగరంలోని బెంజ్ సర్కిల్, కనకదుర్గ ఫ్లైఓవర్‌తో సహా అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తున్నామని, ఈ నిబంధన జనవరి 13వ తేదీ వరకు రాత్రి వేళల్లో అమలులో ఉంటుందన్నారు.
నూతన సంవత్సర సంబరాల పేరుతో రోడ్లపైకి వచ్చి కేకులు కట్ చేయడం, బాణసంచా కాల్చడం, గుంపులుగా చేరి హడావుడి చేయడం వంటివి పూర్తిగా నిషేధించినట్లు వివరించారు. అతివేగంగా వాహనాలు నడపడం, బైక్‌లపై ప్రమాదకర విన్యాసాలు చేయడం, సైలెన్సర్లు తీసి శబ్ద కాలుష్యం సృష్టించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని పట్టుకునేందుకు ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

