2014 నుంచి 2019 వరకు ఏపీలో ఓ వింత పరిస్థితి ఉండేది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బిజెపి కలిసి ఎన్నికలకు వెళ్లి విజయం సాధించాయి. ఆ సమయంలో వైసీపీ ప్రతిపక్షంగా ఉండేది. అయితే ఇక్కడ బిజెపి నేతలు ఆలోచన చాలా వింతగా ఉండేది. ప్రభుత్వంలో ఉంటూనే ప్రతిపక్షానికి సహకరిస్తున్నారనే ఆరోపణ అప్పట్లో చాలా మందిపై వచ్చేది. ఓ రాజ్యసభ ఎంపీ, ఓ ఎమ్మెల్సీ సహా పలువురు బిజెపి రాష్ట్రస్థాయి నాయకులు వైసిపికి సహాయ సహకారాలు అందించే వాళ్లు అనేది అప్పట్లో వినపడిన ఆరోపణ. బహిరంగంగా ప్రభుత్వంపై, ప్రభుత్వ పెద్దలపై ఆ నాయకులు విమర్శలు కూడా చేస్తూ ఉండేవారు.
Also Read : రాజ్యసభలో రామ్మోహన్ నాయుడు సంచలన ప్రకటన..!
2019 ఎన్నికల్లో జగన్ కు కేంద్రం నుంచే సహకారం అందటానికి ఈ నాయకులే కారణం. బిజెపి పెద్దలకు చంద్రబాబును దూరం చేయడంలో కూడా వీళ్లు కీలకపాత్ర పోషించారు. ఇక దీనిని దృష్టిలో పెట్టుకుని 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు బిజెపి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అటు చంద్రబాబుతో బీజేపీకి కూడా అవసరం ఉండటంతో.. రాష్ట్ర అధ్యక్షుడు సహా అనేక విషయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కోవర్టులుగా ఉన్న వారిని తప్పించి కొత్తవారికి అవకాశాలు ఇచ్చింది. అయితే కోవర్టులు మళ్లీ ఇప్పుడు పని మొదలుపెట్టారు అనేది వినపడుతున్నటువంటి ఆరోపణ.
Also Read : గరం గరం గన్నవరం..!
వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, టిడిపి నేతల సమాచారాన్ని వైసీపీకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని, ప్రభుత్వంలో ఉంటూనే కొన్ని లోపాలపై వైసీపీ అధిష్టానానికి సమాచారం చేరవేస్తున్నారని, సచివాలయంలో సహా ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే వ్యవహారాలకు సంబంధించి వైసీపీకి సమాచారం చేరుతోందని.. పరోక్షంగా వైసీపీకి మేలు జరిగే విధంగా వారి వ్యవహార శైలి కూడా ఉందని.. ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి బిజెపి కీలక నేత ఒకరు ఆ పార్టీ అధిష్టానానికి లేఖ కూడా రాశారట. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్దకు ఇప్పటికే సమాచారం కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరా తీస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

