నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నాలుగేళ్ల క్రితం విడుదలైన అఖండ ఎంతటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ఈ సినిమా, కరోనా తర్వాత థియేటర్లకు దూరమైన ప్రేక్షకులను తిరిగి పెద్ద ఎత్తున స్క్రీన్‌ల ముందుకు రప్పించింది. ఇప్పుడు అదే చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన అఖండ 2 పై భారీ ఆసక్తి నెలకొంది. 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, ఇషాన్ సక్సెనాలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలయ్య చిన్న కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరించడం ప్రత్యేకత.
సంయుక్త మీనన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా, కబీర్ దుహన్ సింగ్, స్వస్త ఛటర్జీ, రాన్‌సన్ విన్సెంట్, అచ్యుత్ కుమార్, సంగే షెల్ట్రిమ్, రవి మరియా, విక్రమ్‌జిత్, పూర్ణ, సాయికుమార్, హర్ష చెముడు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం, తమ్మిరాజు ఎడిటింగ్, సీ. రాంప్రసాద్ – సంతోష్ దేట్కే సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి బలమైన అస్త్రాలు.
Also Read : దురంధర్ ను భయపెడుతున్న అఖండ..?
బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్ అంటేనే భారీ అంచనాలు తప్పవు. టీజర్, ట్రైలర్స్, ప్రమోషనల్ కంటెంట్.. అన్ని కలిసి అఖండ 2పై క్రేజ్‌ను మరింత పెంచాయి. అధికారికంగా సినిమా డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుండగా, పెయిడ్ ప్రీమియర్లు డిసెంబర్ 11 రాత్రి నుంచే ప్రారంభమయ్యాయి. తొలి షో పూర్తి చేసిన నెటిజన్లు, క్రిటిక్స్, సినీ ప్రముఖుల అభిప్రాయాలను ఒకసారి పరిశీలిస్తే…
బాలకృష్ణ యొక్క యాక్షన్ ఎనర్జీ మరోసారి ఆడియెన్స్‌ను షేక్ చేసినట్టే చెప్పుకోవాలి. మొదటి పార్ట్ ఎక్కడ ముగుస్తుందో, రెండో పార్ట్ అక్కడ నుంచే మొదలవుతుంది. సినిమా ప్రారంభంలో వచ్చే అష్ట సిద్ది యాగం.. ఆ తరువాత వచ్చే టైటిల్ కార్డ్స్ ప్రేక్షకులకి ఒక మంచి మూడ్ ని సెట్ చేస్తాయి. కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఆయనకే సాధ్యం అనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, ఇంటెన్సిటీ.. ప్రతి పంచ్‌లో కనిపించే బాలయ్య ప్రత్యేకత ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి. అఘోరా అవతారంలో బాలయ్య గర్జన థియేటర్లను ఉర్రూతలూగించేలా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక రాయలసీమ ఎమ్మెల్యేగా బాల మురళీకృష్ణ డైలాగ్స్ ఎంతో పవర్ఫుల్ గా ఉన్నాయి. సినిమా ప్రధమార్ధంలో మహా కుంభమేళా సీక్వెన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది.
Also Read : దేవుడా.. టీటీడీలో మరో భారీ మోసం..!
దర్శకుడు బోయపాటి శ్రీను ఈసారి భావోద్వేగాలకు మరింత ప్రాముఖ్యత ఇస్తూనే, పౌరాణికత, ఆధ్యాత్మికత, హై వోల్టేజ్ మాస్ ఎలిమెంట్స్‌ని సమతుల్యం చేసాడు. ఫస్ట్ హాఫ్‌లో లాగా కథనాన్ని నిశబ్దంగా నడిపిస్తూ, మానవ సంఘర్షణలు, విలన్ ప్రాభవం, ఆధ్యాత్మిక నేపథ్యాన్ని సెట్ చేశారు. సెకండ్ హాఫ్‌లో నాన్‌స్టాప్ యాక్షన్, భారీ ఎలివేషన్స్, థమన్ బీజీఎం కలిపి సస్పెన్స్‌ను పీక్‌కు తీసుకెళ్లాయి. క్లైమాక్స్ విజువల్లీ గ్రాండ్‌గా, భావోద్వేగపరంగా ఘనంగా ఉండడమే కాకుండా, పౌరాణికత–మాస్ కలయికకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
బాలయ్య నటనలో సింహగర్జన, ఆధ్యాత్మిక మార్పులు, ఆగ్రహం–శాంతత మధ్య బాలన్స్ ఏకకాలంలో పీక్‌లో ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు. యాక్షన్ కొరియోగ్రఫీ స్టైలిష్‌గా, అదే సమయంలో భారీగా ఉంది. థమన్ బీజీఎం మరో లెవల్‌లో ఉందని ప్రీమియర్ షో చూసిన వారు పేర్కొంటున్నారు. సినిమా క్లైమాక్స్ ఫైట్ సినీ ప్రేమికులని, బాలయ్య అభిమానులని ఉర్రూతలూగిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాటోగ్రఫీ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత దగ్గరగా అనుభూతి చెందేలా చేస్తోంది.
మొత్తానికి, అభిమానులు కోరుకునే ప్రతి అంశం ఉన్న పర్ఫెక్ట్ మాస్–పౌరాణిక ఎంటర్‌టైనర్‌గా అఖండ 2 నిలిచిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అఖండ 2 లో బాలయ్య నిజంగానే అఖండ తాండవం చెసాసనే చెప్పుకోవాలి.

