ఏపీలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వ్యవహారంతో పాటు పరకామణి చోరీ కేసులో విచారణ వేగంగా జరుగుతోంది. ఈ రెండు కేసుల్లో వైసీపీ ముఖ్యనేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన వైసీపీ అధినేత జగన్.. ఈ వ్యవహారంలో తానే స్వయంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదే సమయంలో టీడీపీ సిట్టింగ్ ఎంపీ పైన కూడా ఆరోపణలు చేశారు జగన్.
ఈ రెండు కేసుల్లో ప్రధానంగా వైసీపీ ఎంపీ, జగన్ సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి చుట్టూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇక కల్తీ నెయ్యి సరఫరా కేసులో ఇప్పటికే సుబ్బారెడ్డి పీఏ అప్పన్నను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంతో సుబ్బారెడ్డి అరెస్టు ఖాయమనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన జగన్.. బాబాయ్ తరఫున వకాల్తా పుచ్చుకున్నారు.
Also Read : బ్రేకింగ్: గంభీర్ కు షాక్ ఇచ్చిన బోర్డు
గతంలో వైసీపీలో రాజ్యసభ సభ్యునిగా పని చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపైనే విమర్శలు చేశారు. ప్రస్తుతం వేమిరెడ్డి నెల్లూరు టీడీపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైసీపీలో ఉన్నప్పుడు జగన్‌కు అత్యంత సన్నిహితుల్లో వేమిరెడ్డి ఒకరు. పార్టీకి ఆర్థికంగా అండగా కూడా నిలిచారు. అయితే వైసీపీ వీడిన నాటి నుంచి వేమిరెడ్డిని ఆ పార్టీ నేతలు టార్గెట్ చేశారు. ఇప్పటికే వేమిరెడ్డి సతీమణి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై… వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.
వేమిరెడ్డికి అపర దానకర్ణుడు అనే పేరుంది. నెల్లూరులో ఎన్నో సేవా కార్యక్రమాల్లో వేమిరెడ్డి చురుగ్గా పాల్గొంటున్నారు కూడా. అయితే తాజాగా వేమిరెడ్డిపై జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్న ఎవరో తనకు తెలియదని.. నిజానికి ఆ అప్పన్నకు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు జగన్. అదే సమయంలో అప్పన్నకు ప్రతి నెలా వీపీఆర్ చెక్ రూపంలో జీతం ఇచ్చారని కూడా ఆరోపించారు.
Also Read : మళ్ళీ యాక్టివ్ అవుతోన్న అన్నలు..?
దీనికి వేమిరెడ్డి ఘాటుగా బదులిచ్చారు. జగన్ తనపై అనవసరమైన ఆరోపణలు చేశారన్నారు. తన గురించి జగన్ ఆత్మకు మొత్తం తెలుసని.. సుబ్బారెడ్డి దగ్గర పని చేస్తున్న పీఏ అప్పన్నకు ఎవరు చెబితే సాయం చేశానో జగన్‌కు బాగా తెలుసన్నారు. జగన్ మాట్లాడే ముందు.. అందులో నిజం ఉందో లేదో తెలుసుకోవాలన్నారు. తనపై చేసిన ఆరోపణలను నిజమని దేవునిపై ప్రమాణం చేయగలరా అని నిలదీశారు.
సాయం ఎవరు అడిగినా తాను చేస్తానని.. ఇలా ప్రతీ నెలా తాను సాయం చేసే వారి జాబితా చాలా ఉందన్నారు. ఎవరు చెప్తే అప్పన్నకు తాను సాయం చేశానో కూడా జగన్‌కు బాగా తెలుసన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేయాల్సిన అవసరం జగన్‌కు లేదన్నారు. కొన్నిసార్లు సాయం చేయడమే కాకుండా నిందలు కూడా పడాల్సి వస్తోందన్నారు వేమిరెడ్డి. జగన్ మాటలు బాధ కలిగించడం వల్లే తాను స్పందించాల్సి వస్తోందన్నారు.

