అమరావతిలో అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మిస్తామంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక విశాఖ సమీపంలోని భోగాపురంలో అల్లూరి సీతారామారాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణం దాదాపు చివరి దశకు చేరుకుంది. 2026 జూన్ నుంచి విమానాల రాకపోకలు ప్రారంభించాలనే ఉద్దేశంతో పనులు చేస్తున్నామంటున్నారు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఇక తిరుపతి సమీపంలోని రేణిగుంటలో కూడా అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం ఇప్పటికే కొత్త ఏటీసీ టవర్, కొత్త టెర్మినల్ భవనం, 18 చెక్ ఇన్ కౌంటర్లు, నాలుగు ఇమ్మిగ్రేషన్ కౌంటర్లతో ప్రయాణీకులకు సేవలందిస్తోంది.
Also Read : జగన్‌కు హిందూ సంఘాల వార్నింగ్..!
మరి విజయవాడ, గుంటూరు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉన్న గన్నవరం విమానాశ్రయం విషయంలో మాత్రం కేంద్ర పౌర విమానయాన శాఖ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో తెలియటం విజయవాడ సమీపంలోని గన్నవరం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. దీనిని రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలోనే బ్రిటీషు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని సుదీర్ఘ రన్‌వే సముద్రమట్టం కంటే 82 అడుగుల ఎత్తులో, 11 వేల అడుగులు పొడవుతో ఉంది. అతి పెద్దవి, వెడల్పు కలిగిన భారీ విమానాలు దిగేందుకు కూడా గన్నవరం విమానాశ్రయం అనుకూలంగా ఉంటుందని డీజీసీఏ ఎప్పుడో అనుమతులు ఇచ్చింది.
రాష్ట్ర విభజన తర్వాత గన్నవరం విమానాశ్రయాన్ని 2017 ఆగస్టులో అంతర్జాతీయంగా కేంద్రం ప్రకటించింది. అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయడంతో.. 2018 డిసెంబర్ నుంచి సింగపూర్, కొలంబో సహా ఇతర దేశాలకు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇక హజ్ యాత్రకు ఇక్కడి నుంచే నేరుగా వెళ్లేందుకు భారత ప్రభుత్వం 2020లో అనుమతి మంజూరు చేసింది. ఎయిర్ ట్రాఫిక్ పెరగటంతో విమానాశ్రయాల అథారిటీ సంస్థ.. గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి, మౌలిక వసతుల్లో మార్పులు చేపట్టింది. దీంతో దాదాపు 470 కోట్లతో గన్నవరం విమానాశ్రయంలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం పనులను ప్రారంభించారు. ఈ పనులను సరిగ్గా 30 నెలల్లో పూర్తి చేస్తామని గొప్పగా ప్రకటించారు కూడా. అయితే ఇప్పటికి సరిగ్గా 68 నెలలు దాటింది. అయినా సరే.. పనులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే.. అసలు ఎప్పటికి పూర్తవుతాయనే విషయంపై ఎవరి దగ్గరా సమాధానం లేదు. ఇదే విషయాన్ని కేంద్ర విమానాయాన శాఖ మంత్రి కింజరావు రామ్మోహన్ నాయుడును అడిగినా సరే.. అవుతున్నాయి.. అంటున్నారు తప్ప.. ఎప్పటికి పూర్తవుతాయనే విషయం మాత్రం చెప్పలేకపోతున్నారు.
Also Read : రోకో లక్కీ గ్రౌండ్.. ఫ్యాన్స్ కు పండుగే
రాజధాని అమరావతికి సమీపంలో ఉన్న విమానాశ్రయం కావడంతో.. నిత్యం వీఐపీల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. గవర్నర్, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ప్రముఖుల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటుంది. అయినా సరే.. కేంద్ర పౌరవిమానయాన శాఖ అధికారులు మాత్రం.. గన్నవరం విషయంలో నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా రెండు సార్లు పరిశీలించి సూచనలు చేసినా సరే.. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. మరి కేంద్ర మంత్రి వార్నింగ్ కూడా పని చేయటం లేదంటే.. గుత్తేదారు సంస్థతో ఏమైనా లోపాయకారి ఒప్పందాలున్నాయేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గన్నవరం విమానాశ్రయంలో మిగిలిన పనుల కంటే కూడా.. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన నిర్మాణం కూటమి నేతలకు పెద్ద సవాల్‌గా మారింది. మచిలీపట్నం, విజయవాడ ఎంపీలు బాలశౌరి, కేశినేని చిన్ని ఇప్పటికే అభివృద్ధి కమిటీ సమావేశాల్లో గట్టిగా డిమాండ్ చేస్తున్నా సరే.. పరిస్థితి మాత్రం మారలేదు.. మార్పు రాలేదు కూడా. ఇదే సమయంలో అసలు ఒక్క భవనం ఎందుకు పూర్తి చేయటం లేదనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన నిర్మాణం ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారి కాంట్రాక్టర్‌కు వార్నింగ్ ఇవ్వడం.. కొత్త గడువు పెడుతున్నారు. ఇలా ఇప్పటికే ఏడాదిన్నర గడిపేశారు. జూన్ నెలలో విమానాశ్రయ అభివృద్ధి గురించి జరిగిన సమావేశంలో డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టారు. కానీ.. అది కూడా దాటి పోతోంది.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ భవనం పూర్తి చేయాలంటే మరో 6 నెలలు పైనే సమయం పడుతుందంటున్నారు విమానాశ్రయ అధికారులు. గతంలో విజయవాడ విమానాశ్రయ పనులు పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు..2025 జూన్ నాటికి పనులు పూర్తి కావాలని ఆదేశించారు. దీని కోసం ఒక వాట్సప్ గ్రూప్ పెట్టాలని.. ప్రతి రోజు పనుల పురోగతిని ఆ గ్రూప్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ పనులను తానే స్వయంగా పర్యవేక్షిస్తా అంటూ గొప్పగా చెప్పారు కూడా. కానీ ఆ గడువు ముగిసి ఇప్పటికే 6 నెలలు దాటింది. మరి ఆ వాట్సప్ గ్రూప్ ఏమైందో తెలియదు.. స్వయంగా పర్యవేక్షిస్తా అన్న కేంద్ర మంత్రి మాట లెక్క చేయని కాంట్రాక్టర్ పైన ఏం చర్యలు తీసుకున్నారో కూడా ఇప్పటి వరకు బయటకు రాలేదు.
Also Read : జగన్ మాస్టర్ ప్లాన్.. మామూలుగా లేదుగా..!
ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ లోపలి వైపు సిమెంట్ భవన నిర్మాణం మాత్రమే ఇప్పటికి పూర్తయ్యింది. దీని బయట వైపు స్టీల్ ఫ్రేములు బిగించాల్సి ఉంది. వాటికి గ్లాసులు ఏర్పాటు చేసే పనుల తీరు చూస్తే.. అసలు పూర్తి చేస్తారా.. లేదా అనే అనుమానం కూడా వస్తుంది. భారీ బోయింగ్ విమాన సర్వీసులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించాలంటే.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నూతన టెర్మినల్ తప్పని సరిగా ఉండాలి. అలా లేకపోవడం వల్ల పేరుకే అంతర్జాతీయ విమానాశ్రయం అయినప్పటికీ.. విమానయాన సంస్థలు భారీ విమానాలను ఇక్కడి నుంచి నడిపేందుకు ముందుకు రావటం లేదు. అందుబాటులో భారీ రన్ వే ఉన్నప్పటికీ.. టెర్మినల్ భవనం లేకపోవడంతో బోయింగ్ సర్వీసులు నడవటం లేదు. ఇప్పటికైనా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ప్రజాప్రతినిధులు దీనిపై దృష్టి పెట్టి పనులు పూర్తి చేయించాలని స్థానికులు కోరుతున్నారు.

