కర్ణాటకలో రాజకీయ తుఫాన్ తీరం దాటినట్లే అనిపిస్తుంది. కొద్ది రోజులుగా కర్ణాటక రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మార్పు అనే అంశం పై జోరుగా చర్చ నడుస్తోంది. 2023 ఎన్నికలు ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి కుర్చీ కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య గట్టి పోటీ తలెత్తింది. అయితే ఈ పోటీకి కాంగ్రెస్ పెద్దలు ఒక పరిష్కారం చూపించారు. ముందు సిద్ధ రామయ్య.. ఆ తర్వాత డీకే అని సూచించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే నిజానికి సీఎంగా సిద్ధ రామయ్య,డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ పెద్దలు అవకాశం ఇచ్చారు. అలాగే ట్రబుల్ షూటర్ డీకేను కేపీసీసీ అధ్యక్షుడిని కూడా చేశారు.
Also Read : అయ్యన్నార్ దెబ్బకు వైవీ ఉక్కిరిబిక్కిరి
సిద్ధరామయ్య అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తైన నేపథ్యంలో మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణ కోసం నేతలంతా ఢిల్లీ బాట పట్టారు. అదే సమయంలో సీఎం మార్పు అనే అంశంపై కూడా జోరుగా చర్చ మొదలైంది. డీకే కూడా సీఎం పదవి కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు వినిపించాయి. అయితే వీటికి చెక్ పెట్టిన డీకే.. తామంతా సిద్ధరామయ్య వెంటే ఉన్నామని ప్రకటించారు. ఎలాంటి గ్రూప్ రాజకీయాలు లేవన్నారు. పార్టీ పెద్దల నిర్ణయమే ఫైనల్ అన్నారు కూడా.
ఇదే సమయంలో సీఎం పదవి కోసం హోమ్ మంత్రి సహా పలువురు సీనియర్ నేతలు కూడా ప్రయత్నం చేస్తున్నట్లు పుకార్లు షికారు చేశాయి. సిద్ధరామయ్యను తప్పిస్తే.. తమకే అవకాశం ఇవ్వాలని ఓ పది మంది నేతలు గట్టిగానే మాట్లాడారు. సిద్ధరామయ్యను పదవి నుంచి తొలిగిస్తే.. లింగాయత్ వర్గం దూరం అవుతుందని నేతలు భావించారు. దీంతో ఈ వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య విభేదాలు తలెత్తాయనే పుకార్లు బాగా వినిపించాయి. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ పెద్దలు.. సమస్య పరిష్కార బాధ్యతను కేసీ వేణుగోపాల్‌కు అప్పగించారు. నిన్న బెంగళూరు చేరుకున్న కేసీ వేణుగోపాల్.. సీఎం సిద్ధరామయ్యతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డీకే శివకుమార్‌తో బ్రేక్‌ఫాస్ట్ చేయాలని కేసీ వేణుగోపాల్ చెప్పారు. సీఎం మార్పుపై ఊహాగానాలకు చెక్ పెట్టేందుకు ఈ ఉదయం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య జరిగిన ‘బ్రేక్‌ఫాస్ట్’ భేటీ వేదికగా మారింది.
Also Read : బాబు గారు.. ఆ మాట మర్చిపోయారా..!
గందరగోళానికి పుల్‌స్టాప్ పెట్టాలనే బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నామని.. 2028 ఎన్నికల స్ట్రాటజీపై చర్చించామని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఉప ముఖ్యమంత్రి డీకేతో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని.. భవిష్యత్‌లోనూ ఉండబోవని సిద్ధరామయ్య ప్రకటించారు. 2028లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని సిద్ధరామయ్య ప్రకటించారు. బీజేపీ, జేడీఎస్, మీడియా వదంతులు వ్యాప్తి చేస్తున్నాయని.. హైకమాండ్ నిర్ణయం శిరసావహిస్తామని సిద్ధరామయ్య ప్రకటించారు. దీంతో.. కర్ణాటక కాంగ్రెస్ తుఫాన్ తీరం దాటిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

