రాజధాని అమరావతి నిర్మాణంపై చంద్రబాబు సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలు మొదలయ్యాయి. ఇటీవలే ఏపీ సీఆర్‌డీఏ రీజనల్ కార్యాలయం తుళ్లూరులో ప్రారంభమైంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఏఐఎస్, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నివాస గృహాల నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఫైనాన్సియల్ సిటీలో 25 బ్యాంకుల రీజినల్ కార్యాలయ భవనాలకు కూడా శంకుస్థాపన చేశారు. అలాగే అమరావతిలో అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుతో పాటు స్పోర్ట్స్ సిటీలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంతో పాటు ఫుడ్ బాల్ స్టేడియం, బ్యాడ్మింటన్ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Also Read : బెజవాడ రూపు రేఖలు మారుతున్నాయి..!
ఏపీలో 2016లో మొదలైన అమరావతి నిర్మాణ పనులు 2019 – 24 మధ్య కాలంలో పూర్తిగా ఆగిపోయాయి. వైసీపీ ప్రభుత్వంలో అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి పనులు నిలిచిపోయాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులు మళ్లీ పట్టాలెక్కాయి. అమరావతి నిర్మాణం కోసం తొలి విడతలో 33 వేల ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. దీనిలో నవ నగరాలు నిర్మించేందుకు ప్లాన్ చేసింది. అయితే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. అమరావతి అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చి దిద్దే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో డేటా సెంటర్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అమరావతిలో పలు అంతర్జాతీయ సంస్థలు క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. అమరావతిని క్వాంటమ్ వ్యాలీ చేస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. దీంతో రాబోయే రోజుల్లో అమరావతికి మరింత డిమాండ్ పెరగనుంది.
Also Read : సిద్దరామయ్య సేఫేనా..? బలాలు ఇవే..!
ఈ నేపథ్యంలో అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేయాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి దశలో రైతుల నుంచి 34 వేల ఎకరాల సమీకరణ.. రెండో దశలో మరో 16 వేల ఎకరాలు సేకరింపుపై కసరత్తు ప్రారంభించింది. మొత్తం అమరావతి కోసం రైతుల నుంచి 50 వేల ఎకరాల భూసమీకరణ చేయనున్న ప్రభుత్వం.. మొదటి దశలో ప్రభుత్వ భూమి 16 వేల ఎకరాలు సీఆర్డీఏకు అప్పగించాలని నిర్ణయించింది. మొత్తం ప్రభుత్వ భూమి, రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమితో కలిపి 70 వేల ఎకరాల భూమిలో రాజధాని నిర్మాణం జరుగుతుందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రెండో విడత భూ సమీకరణకు సంబంధించి 7 గ్రామాల్లో భూ సేకరణ ప్రక్రియ జరగనుంది. వైకుంఠపురంలో 3,361 ఎకరాలు, పెదమద్దూరులో 1,145 ఎకరాలు, ఎండ్రాయి 2,166 ఎకరాలు, కర్లపూడిలో 2,944 ఎకరాలు, వడ్డమానులో 1,913 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 2,418 ఎకరాలు, పెదపరిమిలో 6,513 ఎకరాల భూ సమీకరణ చేయనున్నారు. అసైన్డ్ ప్రభుత్వ భూములతో కలిపి మొత్తం 20,494 ఎకరాల భూ సేకరణ ద్వారా సీఆర్డీఏ తీసుకోనుంది. త్వరలోనే సీఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ లభించింది.

