సొంత పార్టీ ఎమ్మెల్యేల తీరుపై తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇటీవల జరిగిన పరిణామాలు చంద్రబాబు దృష్టికి రావడంతో.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తైంది. అయితే గెలిచిన తొలి రోజు నుంచి కొందరు ఎమ్మెల్యేల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తూనే ఉన్నాయి. చివరికి పల్లా శ్రీనివాసరావు స్వయంగా హెచ్చరించినా కూడా కొంతమంది పార్టీ నేతల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఇక క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరై చీవాట్లు తిన్నప్పటికీ.. నేతల్లో తీరు మారకపోవడంతో ఇలాంటి వారి పట్ల ఇతర నేతలు కాస్త అసహనంతో ఉన్నారు.
Also Read :
సాధారణంగా చంద్రబాబు అంటే.. అధికారంలో ఉన్నప్పుడు కేవలం ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పరిపాలన చేస్తారని.. పార్టీ పైన పెద్దగా దృష్టి పెట్టరనే అపవాదు ఉంది. అయితే ఈసారి మాత్రం చంద్రబాబు పార్టీలో జరుగుతున్న పరిణామాలపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. అటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి అక్కడే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీలో కొందరు ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు ప్రజా దర్బార్ నిర్వహించాలని.. ప్రజల సమస్యలను ప్రతి ఎమ్మెల్యే స్వయంగా తెలుసుకోవాలని సూచించారు. అదే సమయంలో పార్టీ లైన్ దాటిని వారిపై చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. ఇదే సమయంలో పల్లా శ్రీనివాసరావుతో ప్రత్యేకంగా భేటీ అయిన లోకేష్.. ఇకపై పార్టీ నేతలు చేయాల్సిన పనులకు సంబంధించిన టైమ్ టేబుల్ రూపొందించాలని సూచించారు.
Also Read :
దీంతో టీడీపీ అధిష్ఠానం.. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులకు కొత్తగా టైమ్ టేబుల్ రూపొందించింది. పార్టీ ఎమ్మెల్యేలు ప్రతి నెలా ఒకటో తేదీన ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంది. అలాగే 5వ తేదీన తమ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో తనిఖీలు నిర్వహించాలి. అక్కడ విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతులపైన ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. 10వ తేదీన నియోజకవర్గం పరిధిలోని అన్న క్యాంటిన్‌లో భోజనం చేసి.. అక్కడ ప్రభుత్వం అందిస్తున్న భోజనం గురించి ప్రజలకు వివరించాలి. 15వ తేదీన ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేయాలి. అక్కడ రోగుల సమస్యలపై ఆరా తీయాలి. వైద్య సిబ్బంది సమస్యలపై దృష్టి పెట్టాలి. ఇక ప్రతి నెల 20వ తేదీన ముఖ్యమంత్రి సహాయ నిధి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బీమా చెక్కులను పంపిణీ చేయాలి. 25వ తేదీన తహశీల్దార్ లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేయాలి. అక్కడ పెండింగ్‌లో ఉన్న దస్త్రాల వివరాలు సేకరించాలి. చివరగా.. నెలలో ఏదో ఒకరోజున తప్పనిసరిగా నియోజకవర్గంలోని ఏదో ఒక గ్రామం, ఊర్లో పాదయాత్ర చేసి.. ప్రజలతో మమేకం కావాలని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. వీటిపై ప్రతి ఒక్కరు పార్టీకి సమాచారం ఇవ్వాలని.. కుదరకపోతే.. అందుకు కారణాలను కూడా ముందుగా తెలియజేసి.. వారి స్థానంలో మరొకరిని పురమాయించాలని కూడా ఆదేశించారు. పార్టీ ఆదేశాలు భేఖాతరు చేసిన వారిపై చర్యలుంటాయని కూడా హెచ్చరించారు.

