మోంథా తుఫాన్ విషయంలో గత నాలుగు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది. వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని ముందు నుంచి వాతావరణ శాఖ హెచ్చరిస్తూనే ఉంది. తీరం దాటే సమయంలో ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఇంకా కొన్ని జిల్లాల్లో ఇప్పటికే చెదురుమొదురుగా వర్షాలు పడుతున్నాయని, 28వ తేదీ నుంచి వర్షాలు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇస్తోంది.
Also Read : తప్పుడు ఆరోపణలు.. వాస్తవాలు..!
అయితే ఇప్పుడు దీని విషయంలో సోషల్ మీడియాలో సెటైర్లు వస్తున్నాయి. ఉభయగోదావరి, కృష్ణాజిల్లాలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ముందు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఈ జిల్లాల్లో ఆ స్థాయిలో ప్రభావం ఎక్కడ కనపడలేదు. దీంతో సోషల్ మీడియా జనాలు దీన్ని కూడా కామెడీగా మార్చేశారు. వాతావరణ శాఖ చెప్తే అది జరగదు అంటూ, తుఫాను ప్రభావం ఏమీ లేదని, ఉంటే ఈపాటికి వర్షాలు పడతాయంటూ కొంతమంది కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. కొంతమంది అయితే బట్టలు ఆరేసుకోవచ్చని, వడియాలు ఎండబెట్టుకోవచ్చని, పిల్లలు క్రికెట్ ఆడుకోవచ్చని సెటైర్లు వేస్తున్నారు.
Also Read : బెజవాడలో అఖండ తాండవం.. క్రేజీ అప్డేట్..!
ఇక వాతావరణ శాఖ విషయంలో సినిమాల్లో ఉన్న జోకులను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరి కొంతమంది అయితే ప్రభుత్వం హడావుడి చేస్తోందని, క్షేత్రస్థాయిలో అంత సినిమా లేదంటూ కామెంట్స్ మొదలుపెట్టారు. పిల్లలకు సెలవులు ఇవ్వడానికే తుఫాన్ వచ్చిందని, రైతులు భయపడాల్సిన అవసరం లేదని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. అయితే దీనిపై వాతావరణ శాఖ నిపుణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో ప్రభావం ఎక్కువగా ఉంటుందని, కుండ పోత వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడాలని, ప్రతి విషయంలో కామెడీ తగదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

