రాజకీయాల్లో కొంతమంది నేతల తీరు చాలా ఇబ్బందిగా ఉంటుంది. రాజకీయాల్లో ఎవరికైనా అల్టిమేట్ ఒకటే. పదవి మాత్రమే. ఆ పదవి కోసమే పార్టీలు మారతారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఆ నేత తీరు తీవ్ర విమర్శలకు తావిస్తుంది. ఆయన ఎవరో కాదు.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గం నుంచి గెలిచిన రాజగోపాల్.. తొలి రోజు టార్గెట్ కాంగ్రెస్ సర్కార అన్నట్లుగా విమర్శలు చేస్తున్నారు. వాస్తవానికి మంత్రి పదవి వస్తుందని గంపెడాశలు పెట్టుకున్న రాజగోపాల్.. అది రాకపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. మంత్రివర్గ విస్తరణలో తన పేరు తప్పకుండా ఉంటుందని భావించారు. మంత్రి పదవి ఖాయమని అనుచరులకు చెప్పేశారు కూడా. అయితే పదవి రాలేదు. దీంతో రాజగోపాల్‌లో అసహనం తారాస్థాయికి చేరుకుంది.
Also Read : ఏపీ రాజకీయాల్లోకి మరో స్టార్ యాక్టర్, తమిళమా..? తెలుగా..?
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా పార్టీకి కట్టుబడే ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎంపీగా, ఎమ్మెల్సీగా కూడా వ్యవహరించారు. మధ్యలో ఒక ఏడాది కాలం మాత్రం కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. బీజేపీ తరఫున మునుగోడులో పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి.. ఓడిపోయారు. అయితే సరిగ్గా ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెసా పార్టీలో చేరి మళ్లీ మునుగోడు నుంచే పోటీ చేసి గెలిచారు. ఇక్కడే రాజగోపాల్‌తో కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులు మొదలయ్యాయి.
తనకు మంత్రిపదవి వస్తుందని రాజగోపాల్ గంపెడాశ పెట్టుకున్నారు. కానీ కాంగ్రెస్ పెద్దలు మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రిపదవి ఇచ్చారు. దీంతో రాజగోపాల్ రెడ్డికి ఇచ్చే పరిస్థితి లేదని పరోక్షంగా వెల్లడైంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవులు వచ్చాయి. మూడ పదవి ఇచ్చే పరిస్థితి లేదు. పైగా ఒకే కుటుంబంలో రెండు మంత్రి పదవులు అసాధ్యం. కాబట్టే రాజగోపాల్ రెడ్డిని పక్కన పెట్టాల్సి వచ్చిందనేది కాంగ్రెస్ పెద్దల మాట.
Also Read : ఉప రాష్ట్రపతి ఆయనే..? తమిళ బ్రాహ్మిణ్ కు కీలక పదవి..!
అయితే ఇవేవీ పట్టించుకోని రాజగోపాల్ రెడ్డి.. తనకు పదవి రాకుండా అడ్డుకున్నది కేవలం సీఎం రేవంత్ రెడ్డి అని భావిస్తున్నారు. రేవంత్ పైన పదే పదే విమర్శలు చేస్తున్నారు. మంత్రి పదవి కోసం ఎవరి కాళ్లో మొక్కాల్సిన అవసరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఉంటే.. ఈ పాటికే మంత్రి పదవి వచ్చేదన్నారు. కానీ కేవలం మునుగోడు ప్రజల కోసమే అక్కడ నుంచి పోటీ చేశానన్నారు. పదవి వస్తే.. అది ప్రజలకే ఉపయోగం అని వ్యాఖ్యానించిన రాజగోపాల్ రెడ్డి.. అందరిలా పైరవీలు చేస్తూ దోచుకునే వాడిని కాదంటూ పార్టీలో ఓ వర్గం నేతలపై విమర్శలు చేశారు. మంత్రి పదవి కావాలా.. మునుగోడు కావాలా.. అని అడిగితే.. మునుగోడు ప్రజలే ముఖ్యమంటాను.. అని పెద్ద పెద్ద మాటలు కూడా చెప్పారు. పార్టీలో చేరినప్పుడు మంత్రిపదవి ఇస్తామన్నారు.. తర్వాత భువనగిరి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఇస్తామన్నారు.. కానీ ఇప్పటికీ రాలేదన్నారు. పదవి కోసం ఒకరి కాళ్లు మొక్కాల్సిన అవసరం లేదంటూ రాజగోపాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాజగోపాల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పీసీసీ క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి పై పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నారనే మాట కాంగ్రెస్ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారింది. దీని వల్ల పార్టీకి, ప్రభుత్వానికి కూడా తీవ్ర నష్టం జరుగుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. దీనిపై రాజగోపాల్ వివరణ తీసుకున్న క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి.. పూర్తి నివేదికను టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు అందించనున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరుపై అటు ఢిల్లీ పెద్దలు కూడా గుర్రుగా ఉన్నారనే మాట పార్టీలో బాగా వినిపిస్తోంది. రాజగోపాల్‌ను కట్టడి చేయకపోతే.. పార్టీలో ఇతర నేతలు కూడా ఇలా బహిరంగ వ్యాఖ్యలు చేస్తే.. భారీ నష్టం జరుగుతుందని భావిస్తున్నారు. అందుకే రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

