రాజకీయ వారసత్వం కోసం నేతలు ప్రయత్నాలు చేయడం సర్వ సాధారణం. అందుకోసం ఎంత దూరమైనా సరే వెళ్లేందుకు రెడీ అవుతారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరో రాజకీయ వారసుడి కోసం తండ్రి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఇప్పటికే నలుగురు రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు మరో నేత కూడా తన అదృష్టం పరీక్షించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో ఆయనకు అన్ని విధాలుగా సహకరించిన వారిలో పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర్రావు ఒకరు. ఆ తర్వాత ఎన్టీఆర్ కేబినెట్‌లో చంద్రబాబు, దగ్గుబాటి మంత్రులుగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత 1995 నాటి పరిణామాల్లో చంద్రబాబు కేబినెట్‌లో కీలక మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే రాజకీయంగా చంద్రబాబుతో విభేదించిన దగ్గుబాటి… వేరు కుంపటి పెట్టుకున్నారు.
Also Read : బీఆర్ఎస్ కు నిద్ర లేకుండా చేస్తున్న రేవంత్ టూర్
2004లో దగ్గుబాటి వెంకటేశ్వర్రావు సతీమణి పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీలో చేరి వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి మారిపోయింది. పురందేశ్వరి బీజేపీలో చేరారు. 2024 ఎన్నికల్లో రాజమండ్రి నుంచి పోటీ చేసి మరోసారి ఎంపీగా గెలిచారు. అయితే ఇదే సమయంలో తమ రాజకీయ వారసుని కోసం దగ్గుబాటి దంపతులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 2019లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు దగ్గుబాటి కుమారుడు హితేష్ చెంచురామయ్య రంగంలోకి దిగాడు. వైసీపీ తరఫున పర్చూరు నుంచి పోటీ చేసేందుకు రెడీ అయిన హితేష్‌కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. అమెరికా పౌరసత్వం కావడంతో.. హితేష్‌కు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో హితేష్ రాజకీయ ప్రయాణానికి బ్రేకులు పడ్డాయి.
Also Read : మళ్ళీ పవన్ తో సున్నం పూసుకుంటున్న వైసీపీ
ఇక పురందేశ్వరి బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడం, ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో టీడీపీ భాగస్వామ్యం కావడంతో… హితేష్‌ను మరోసారి ఎన్నికల గోదాలో దింపేందుకు దగ్గుబాటి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఈసారి బీజేపీ లేదా టీడీపీ తరఫున చట్టసభకు ఎన్నికవ్వాలనేది హితేష్ ప్లాన్. అందులో భాగంగానే రెండు రోజుల క్రితం చంద్రబాబుతో దగ్గుబాటి వెంకటేశ్వర్రావు భేటీ అయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి వీరిద్దరు తోడల్లుళ్లు అయినప్పటికీ… ముఖాముఖి పలకరింపులు చాలా తక్కువ. దగ్గుబాటికి ఆపరేషన్ అయినప్పుడు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు చంద్రబాబు. ఇక అప్పుడప్పుడు కుటుంబ ఫంక్షన్‌లలో కలవటం తప్ప… వారిద్దరు కలిసిన సందర్భాలు లేవు.
Also Read : ఉమాకు ఈసారి కూడా నిరాశ తప్పదా…?
ఓ వైపు చంద్రబాబు వారసుడు లోకేష్ రాజకీయాల్లో దూసుకెళ్తున్నాడు. అటు బాలకృష్ణ కుటుంబం నుంచి కూడా అల్లుళ్లు ఇద్దరు రాజకీయాల్లో ఉన్నారు. దీంతో తమ కుమారుడు కూడా రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అనేది దగ్గుబాటి దంపతుల ప్లాన్. ఇదే విషయంపై ఇటీవల చంద్రబాబుతో కలిసిననప్పుడు దగ్గుబాటి హితేష్ ప్రస్తావన చేసినట్లు సన్నిహితులు చెబుతున్నారు. హితేష్‌కు రాజ్యసభ లేదా ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని చంద్రబాబును దగ్గుబాటి కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మరి హితేష్‌కు చంద్రబాబు అవకాశమిస్తే… ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు రాజకీయాల్లోకి వచ్చినట్లే అవుతుంది. చంద్రబాబు, వెంకటేశ్వర్రావు, హరికృష్ణ, బాలకృష్ణ, పురందేశ్వరి, లోకేశ్ తోపాటు ఎన్టీఆర్ మనవరాలిని వివాహం చేసుకున్న శ్రీ భరత్ కూడా నందమూరి కుటుంబానికి చెందిన వారి జాబితాలోనే చేరిపోయారు. ఇప్పుడు కొత్తగా హితేష్ కూడా ఈ జాబితాలో చేరనున్నట్లు తెలుస్తోంది.

