బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటున్నప్పటికీ, ఆమె చేస్తున్న పాత్రలపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. స్టార్ హీరోల సరసన నటిస్తున్నా కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకునే రేంజ్‌లో రోల్స్ మాత్రం రావడం లేదని కొందరు సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. రీసెంట్‌గా రిలీజైన పెద్ది చిత్రంలో జాన్వీ పోషించిన అచ్చియమ్మ పాత్రపై మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. నిజానికి రామ్ చరణ్‌తో ఆమె జోడీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు స్ట్రాంగ్ రోల్ ఇచ్చి ఉంటారని అభిమానులు భావించారు. అయితే సినిమా విడుదలైన తర్వాత, జాన్వీ పాత్రకు కథలో పెద్దగా ప్రాధాన్యం లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఆమెను ఎక్కువగా గ్లామర్ యాంగిల్ లోనే చూపించారని సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే.. అసలు సినిమాలో జాన్వీ అవసరమే లేదంటున్నారు కూడా.
Also Read : అలాంటి వారితో బీ కేర్ ఫుల్..!
అయితే జాన్వీ విషయంలో ఇలాంటి కామెంట్లు రావడం ఇదే మొదటిసారి కాదని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. టాలీవుడ్‌లో ఆమె తొలి చిత్రం దేవర. అందులో కూడా జాన్వీ పాత్ర లిమిటెడ్‌గానే ఉందని అప్పట్లో విమర్శలు వచ్చాయి. తంగం పాత్రలో కనిపించిన ఆమెకు కథలో చెప్పుకోదగ్గ స్కోప్ లేకపోవడం, కొన్ని సీన్స్, పాటలకు మాత్రమే పరిమితం కావడం అప్పట్లోనే చర్చనీయాంశమైంది. దీంతో తెలుగులో ఇప్పటి వరకు జాన్వీ చేసిన రెండు సినిమాల్లోనూ యాక్టింగ్‌కు అవకాశమున్న పాత్రలు దక్కలేదనే అభిప్రాయం ఫ్యాన్స్‌లో వ్యక్తమవుతోంది. స్ట్రాంగ్ రోల్ దక్కితే ఆమెలోని అసలు టాలెంట్ బయటవడుతుందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : రెండేళ్ల పాలనపై సర్వే.. ఎవరికెన్ని మార్కులు..?
అదే సమయంలో జాన్వీ కపూర్‌కు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో ఫుల్‌గా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో స్క్రీన్ పై తనను ఎలా ప్రెజెంట్ చేయాలనేది దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ నిర్ణయమన్నారు. “డైరెక్టర్ లేదా డీవోపీ కెమెరాను ఎలా ఉపయోగించాలనుకుంటారనేది వారిదే ప్లాన్. ఒక రోల్‌లో ఎలా చూపించాలనేది కూడా వారి నిర్ణయమే” అని జాన్వీ చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే తనపై ఇప్పటికే గ్లామర్ డాల్ తరహా ఇమేజ్ ఏర్పడిందని, అందువల్ల చాలామంది మేకర్స్ కూడా అదే యాంగిల్‌లో తనను చూపించాలని భావిస్తారని జాన్వీ వ్యాఖ్యానించారు. అయితే ఒక నటిగా ప్రతి విషయంపై తాను నిర్ణయం తీసుకునే స్థితిలో ఉండనని, క్యారెక్టరైజెషన్‌లో మేకర్స్ ఆలోచనే మెయిన్‌గా వర్క్ చేస్తుందంటూ జాన్వీ చేసిన కామెంట్స్ మళ్లీ చర్చకు దారితీశాయి.
ఏదేమైనా ఇప్పుడు జాన్వీ కామెంట్స్.. ఆమె పోషించిన రోల్స్ రెండూ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకునే స్టార్ హీరోయిన్ అయినప్పటికీ, రోల్ విషయంలో తుది నిర్ణయం దర్శకులదే అంటూ ఆమె చేసిన కామెంట్స్‌ను పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కానీ కేవలం గ్లామర్‌కు మాత్రమే పరిమితం చేయకుండా కథలో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు ఇస్తే జాన్వీ నటిగా మరింత గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం త్రో బ్యాక్ వీడియోతో పాటు ఆమె జర్నీపై జోరుగా సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది.

