Sunday, September 6, 2026 10:33 AM
Sunday, September 6, 2026 10:33 AM

అయ్యన్న పాత్రుడి అలుపెరుగని రాజకీయ ప్రస్థానం

పుట్టినరోజు తర్వాత ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన ప్రకటన చేశారు. నియోజకవర్గ ప్రజలు, ఆయన అభిమానులు ఊహించని విధంగా.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అని ప్రకటించారు. భవిష్యత్ లో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనన్నారు. తన వయసు పెరిగిపోయిందని.. రెస్ట్ తీసుకుంటానన్నారు. ఇక తన పదవీ కాలం మూడేళ్లే.. ఈ లోపే ఏదో ఒక మంచి చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నా అన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. సుదీర్ఘ కాలం పాటు ప్రజాసేవలో ఉన్నందున తదుపరి ఎన్నికలలో పోటీ చేయనని, మిగిలిన పదవీకాలంలో ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు.

Also Read : ఏపీ రాజకీయాల్లో బిగ్ షాక్.. రాజకీయాలకు అయ్యన్నపాత్రుడు గుడ్ బై..!

రాజకీయాల్లో పదవులు రావడం ఒక ఎత్తయితే.. వచ్చిన పదవులను నిలబెట్టుకోవడం మరో ఎత్తు. విజయాలు, ఓటములు సహజమే అయినా.. ఓటమి ఎదురైన ప్రతిసారీ మళ్లీ పుంజుకుని తన ఉనికిని చాటుకోవడం మాత్రం కొద్దిమంది నేతలకే సాధ్యం. అలాంటి అరుదైన రాజకీయ ప్రస్థానాల్లో చింతకాయల అయ్యన్న పాత్రుడి ప్రయాణం ఒకటి. కార్యకర్తగా మొదలైన ప్రస్థానం.. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా సాగి.. చివరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌ స్థాయికి చేరింది. నాలుగు దశాబ్దాలకు పైగా సాగుతున్న ఈ రాజకీయ ప్రయాణంలో విజయాలే కాదు.. ఓటములు, విమర్శలు, రాజకీయ ఒడిదుడుకులు కూడా ఎన్నో ఉన్నాయి. అయినా రాజకీయాల నుంచి వెనక్కి తగ్గని పట్టుదలే అయ్యన్న పాత్రుడిని ప్రత్యేకంగా నిలబెట్టింది.

అప్పటినుంచి ఇప్పటివరకూ ఆయన పసుపు జెండాను విడిచిపెట్టలేదు. చింతకాయల అయ్యన్న పాత్రుడు 1957 సెప్టెంబర్ 4న నర్సీపట్నంలో జన్మించారు. కాకినాడ పీఆర్ ప్రభుత్వ కళాశాలలో బీఏ చదివారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో ఎన్టీఆర్ సిద్ధాంతాలకు ఆకర్షితుడై రాజకీయాల్లోకి వచ్చారు. 1983లో నర్సీపట్నం నుంచి టీడీపీ అభ్యర్థిగా తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. 25 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన అయ్యన్నకు అది కేవలం ఒక ఎన్నికల విజయం కాదు.. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి ఆరంభం. ఆ తర్వాత 1985లోనూ నర్సీపట్నం నుంచి గెలిచారు.

Also Read : ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్..!

అసెంబ్లీలో అడుగుపెట్టిన కొద్దికాలానికే అయ్యన్నకు మంత్రి పదవి దక్కింది. ఎన్టీఆర్ మంత్రివర్గంలో 1984-86 మధ్య సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. చిన్న వయసులోనే మంత్రి బాధ్యతలు చేపట్టడం ఆయన రాజకీయ ఎదుగుదలకు నిదర్శనంగా నిలిచింది. అయితే రాజకీయ ప్రస్థానం ఎప్పుడూ సాఫీగా సాగలేదు. 1989లో నర్సీపట్నం నుంచి ఓటమి ఎదురైంది. అయినా ఆ పరాజయం ఆయన రాజకీయ ప్రయాణానికి బ్రేక్ వేయలేదు. 1994లో మళ్లీ నర్సీపట్నం నుంచి గెలిచి అసెంబ్లీలోకి వచ్చారు. అదే సమయంలో ఆర్‌అండ్‌బీ, పోర్టుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

అయ్యన్న పాత్రుడి రాజకీయ ప్రస్థానంలో మరో కీలక మలుపు 1996. రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేశారు. అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1996-98 మధ్య లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. అంటే ఒకే రాజకీయ జీవితంలో అసెంబ్లీ, మంత్రివర్గం, పార్లమెంట్.. ఇలా మూడు కీలక వేదికలను అనుభవించిన నాయకుడిగా అయ్యన్న ఎదిగారు. ఎంపీగా ఉన్న తర్వాత తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చిన అయ్యన్న 1999లో నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ఒకసారి మంత్రి పదవి కోల్పోయిన తర్వాత రాజకీయంగా కనుమరుగవకుండా, మరోసారి ప్రజల తీర్పుతో తిరిగి తన స్థానాన్ని సంపాదించుకోవడం అయ్యన్న శైలిలో కనిపిస్తుంది.

Also Read : పీఆర్‌సీ కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్.. ఎవరికో ఆ ఛాన్స్..?

2009 ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి అయ్యన్న ఓటమి పాలయ్యారు. రాజకీయాల్లో వరుస విజయాలకు అలవాటుపడిన నేతకు అది పెద్ద ఎదురుదెబ్బే. కానీ అయ్యన్న కథ అక్కడితో ముగియలేదు. 2014లో మళ్లీ నర్సీపట్నం నుంచి గెలిచారు. చంద్రబాబు మంత్రివర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, ఎన్‌ఆర్‌ఈజీఎస్ శాఖలకు బాధ్యతలు చేపట్టారు. 2017లో శాఖల మార్పుతో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా కొనసాగారు. 2014-19 మధ్య మంత్రిగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయాల్లో ఎంత సుదీర్ఘ అనుభవం ఉన్నా.. ఎన్నికల తీర్పు ఎప్పుడూ ఒకేలా ఉండదు. 2019లో అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలో ఓటమి చవిచూశారు.

కానీ మరోసారి రాజకీయంగా పునరాగమనం చేస్తాననే పట్టుదలతో ముందుకు సాగారు. ఆయన పట్టుదలే నెగ్గింది. విజయం మళ్లీ ఆయన ముంగిట వాలింది. 2024 ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి మళ్లీ విజయం సాధించారు. ఇది ఆయన రాజకీయ జీవితంలో మరో కీలక మలుపు. ఎందుకంటే వరుసగా అనేక దశాబ్దాల రాజకీయ అనుభవం తర్వాత కూడా ప్రజల తీర్పుతో మరోసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టడం ఆయన రాజకీయ స్థైర్యాన్ని ప్రతిబింబించింది. ఎమ్మెల్యేగా ప్రారంభమైన ప్రస్థానం.. మంత్రి, ఎంపీ, మరోసారి మంత్రి అనే దశలను దాటి.. 2024 జూన్ 22న ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో మూడో స్పీకర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇది ఆయన రాజకీయ ప్రయాణంలో అత్యంత కీలకమైన ఘట్టం.

Also Read : నేపాల్ తర్వాత భారత్..? హిమాలయాల్లో పొంచి ఉన్న ముప్పు..!

ఒకప్పుడు అసెంబ్లీలో యువ ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన నాయకుడే.. దశాబ్దాల తర్వాత అదే సభకు సభాపతిగా అధ్యక్షత వహించే స్థాయికి చేరుకున్నారు. అయ్యన్న పాత్రుడి రాజకీయ జీవితాన్ని కేవలం పదవుల జాబితాగా చూస్తే.. ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ, మళ్లీ మంత్రి, స్పీకర్ అనే వరుస కనిపిస్తుంది. కానీ ఆ పదవుల వెనుక చూస్తే.. గెలుపు-ఓటములు, రాజకీయ ఒడిదుడుకులు, విమర్శలు, తిరిగి పుంజుకోవడం వంటి అనేక దశలు కనిపిస్తాయి. 1983లో యువ ఎమ్మెల్యేగా మొదలైన ప్రస్థానం.. 1996లో ఎంపీగా జాతీయ రాజకీయాల వరకు వెళ్లింది. మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా కొనసాగింది. 2009 ఓటమి తర్వాత 2014లో పునరాగమనం చేసింది. 2019 పరాజయం తర్వాత 2024లో మళ్లీ గెలిచి.. చివరకు స్పీకర్ పీఠాన్ని అధిష్ఠించింది.

అందుకే అయ్యన్న పాత్రుడి రాజకీయ ప్రస్థానాన్ని పదవుల ప్రయాణం అనడం కంటే పట్టుదల ప్రయాణం అనడం సముచితంగా ఉంటుంది. రాజకీయాల్లో గెలుపు ఎంత ముఖ్యమో.. ఓటమి తర్వాత తిరిగి నిలబడే సామర్థ్యం అంతకంటే ముఖ్యమని అయ్యన్న పాత్రుడి నాలుగు దశాబ్దాల ప్రస్థానం చెబుతోంది.ఎమ్మెల్యేగా మొదలై.. మంత్రిగా ఎదిగి.. ఎంపీగా ఢిల్లీకి వెళ్లి.. మళ్లీ మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో తన ముద్ర వేసి.. చివరకు అదే శాసనసభకు స్పీకర్‌గా మారిన అయ్యన్న పాత్రుడి ప్రస్థానం.. నిజంగా అలుపెరుగని రాజకీయ ప్రయాణమే. ఆయన తన వారసుడిగా పంపిన విజయ్ రాజ్యసభలో తెలుగు వారి సత్తా ఏంటో నిరూపిస్తున్నారు. ఒక తండ్రికి అంతకంటే ఆనందం ఏముంటుంది.

-జి.సత్యనారాయణరాజు

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ప్లేట్ తిప్పేసిన రాజగోపాల్...

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో గత కొంతకాలంగా...

ఏపీ ఉద్యోగులకు సీఎం...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘకాల సమస్యల...

టీవీకే టార్గెట్‌లో డీఎంకే...

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రణం మొదలైంది....

ఏపీ రాజకీయాల్లో బిగ్...

ఏపీ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు,...

సాయి రెడ్డి పార్టీకి...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నాళ్ళుగా తీవ్ర...

తెలంగాణలో రేపే మంత్రివర్గ...

తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా...

పోల్స్