చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మరోసారి ఖాకీలపై తమ ప్రతాపం చూపించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులపైన, అందులోనూ విధుల్లో ఉన్న ఒక మహిళా అధికారిని కూడా చూడకుండా అత్యంత దారుణంగా ప్రవర్తించారు. పూతలపట్టు పరిధిలో జరిగిన ఒక ఉదంతంలో వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా రెచ్చిపోయి, అక్కడ బందోబస్తులో ఉన్న మహిళా ఏఎస్సై జ్యోతిని కనీస మానవత్వం లేకుండా కింద పడేసి, తొక్కుకుంటూ ముందుకు వెళ్లారు.
Also Read : విశాఖకు రెడ్ అలెర్ట్.. బీ కేర్ ఫుల్..!
ఈ అనాగరిక చర్యతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేగుతోంది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఒకేసారి గుంపులుగా దూసుకురావడం, పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ తోసుకుపోవడంతో అక్కడ తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలోనే విధులను నిర్వర్తిస్తున్న ఏఎస్సై జ్యోతి కింద పడిపోయారు. ఆ సమయంలో ఉన్మాదంతో ఊగిపోయిన వైసీపీ మూకలు ఆమెను తొక్కుకుంటూ వెళ్లడంతో ఏఎస్సై జ్యోతి తలకు తీవ్ర గాయమైంది. ఒంటిపై పలుచోట్ల గాయాలవడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
Also Read : పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం గుడ్ న్యూస్..!
వెంటనే తోటి సిబ్బంది, స్థానికులు ఆమెను రక్షించి, చికిత్స నిమిత్తం సమీపంలోని పి.కొత్తకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ అత్యవసర చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏఎస్సై జ్యోతి ఈ దారుణ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము శాంతిభద్రతలను కాపాడుతుండగా, పోలీసుల విధులకు తీవ్ర ఆటంకం కలిగించడమే కాకుండా.. విధుల్లో ఉన్న తనపై ఉద్దేశపూర్వకంగానే దౌర్జన్యం చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళా అధికారిపై దాడి మరియు ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించిన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడికి ఉసిగొల్పిన మరియు దౌర్జన్యానికి పాల్పడిన 25 మంది వైసీపీ నేతలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

