ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. కోట్ల మంది భక్తుల నమ్మకంతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంపై అయోధ్య బార్ అసోసియేషన్.. సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన నిందితులకు స్థానికంగా ఎలాంటి న్యాయసహాయం అందకూడదని బార్ అసోసియేషన్ స్పష్టం చేసింది. అయోధ్య బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాళికా ప్రసాద్ మిశ్రా నేతృత్వంలో సోమవారం న్యాయవాదుల అత్యవసర సమావేశం జరిగింది.
Also Read : మల్టీ స్టారర్ లపై స్టార్ హీరో సంచలన కామెంట్స్..!
ఈ సందర్భంగా, రాముడి నిధుల గోల్మాల్ కేసులో అరెస్ట్ అయిన నిందితుల తరఫున జిల్లాకు చెందిన ఏ ఒక్క న్యాయవాది కూడా కోర్టులో వకాల్తా పుచ్చుకోకూడదని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఒకవేళ అసోసియేషన్ నిర్ణయాన్ని ధిక్కరించి, నిందితులను సమర్థిస్తూ ఎవరైనా కోర్టులో వాదించడానికి ముందుకొస్తే.. సదరు లాయర్ పై అసోసియేషన్ తరఫున రూ.5 లక్షల భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. రామమందిర పవిత్రతను దెబ్బతీసిన ఈ నిధుల దారిమళ్లింపు వ్యవహారంలో కీలక పాత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
Also Read : కాషాయ పార్టీ స్పెషల్ ఫోకస్.. టార్గెట్ ఫిక్స్..!
ఈ వివాదంపై తీవ్ర విమర్శలు రావడంతో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇప్పటికే నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. అయితే, కేవలం రాజీనామాలతో సరిపెట్టకుండా చంపత్ రాయ్‌తో పాటు ట్రస్ట్‌కు చెందిన అనిల్ మిశ్రా, గోపాల్ రావులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, దీనిపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని లాయర్ల సంఘం డిమాండ్ చేస్తోంది. రామాలయ కానుకల దొంగతనం తమ సెంటిమెంట్‌ను తీవ్రంగా గాయపరిచిందని బార్ అసోసియేషన్ సెక్రటరీ శైలేంద్ర జైస్వాల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. గతంలో 2005లో అయోధ్య తాత్కాలిక రామాలయంపై ఉగ్రవాదులు దాడి చేసిన సమయంలో కూడా తాము ఇలాంటి నిర్ణయమే తీసుకున్నామని ఆయన గుర్తుచేశారు. అప్పట్లో ఉగ్రదాడి నిందితుల తరఫున వాదించడానికి ఏ ఒక్క స్థానిక లాయర్ ఒప్పుకోలేదని, ఇప్పుడు రాముడి సొమ్మును కాజేసిన నిందితులకు కూడా అదే శిక్ష వర్తిస్తుందని న్యాయవాదుల సంఘం స్పష్టం చేసింది.

