ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన వైఎస్సార్సీపీ హయాం నాటి మద్యం కుంభకోణంలో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. నాటి ఎక్సైజ్, రెవెన్యూ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ విజయవాడ కోర్టులో మేజిస్ట్రేట్ ఎదుట బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 183 కింద అత్యంత కీలకమైన వాంగ్మూలాన్ని ఇవ్వడం సంచలనంగా మారింది. సిట్ అధికారుల విచారణ అనంతరం కోర్టుకు హాజరైన ఆయన, నాటి మద్యం దందా వెనుక ఉన్న అసలు శక్తుల గుట్టును విప్పారు.
Also Read : మీనాక్షి ఎదురుచూపులకు తెరపడనుందా?
మద్యం పాలసీ రూపకల్పన, బ్రాండ్ల ఎంపిక, ధరల పెంపుతో పాటు జరిగిన అక్రమాల వ్యవహారమంతా పూర్తిగా నాటి ముఖ్యమంత్రి కార్యాలయం నియంత్రణలోనే సాగిందని రజత్ భార్గవ స్పష్టం చేశారు. “నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియకుండా ఇదంతా జరిగిందని తాను అనుకోవడం లేదు” అంటూ ఆయన నేరుగా జగన్ను టార్గెట్ చేయడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. సీఎంవో లోని కీలక అధికారులు, జగన్ కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలు ప్రతి విషయంలోనూ తనపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చారని రజత్ భార్గవ వెల్లడించారు.
Also Read : ప్రపంచ దేశాలకు జైశంకర్ వార్నింగ్.. అమెరికా తీరుపై భారత్ తీవ్ర అసంతృప్తి..!
లంచాల కోసం మద్యం మూలధరలు భారీగా పెంచి, అనుకూలంగా జీవోలు జారీ చేయాలంటూ జగన్ కోటరీ ఒత్తిడి తెచ్చిందని పేర్కొన్నారు. బేవరేజెస్ కార్పొరేషన్లో జరిగిన నిబంధనల ఉల్లంఘనలు, అక్రమాలపై తాను స్పందిస్తూ అనేక మెమోలు జారీ చేశానని, కానీ సీఎంవో లోని పెద్దలు వాటిని కావాలనే అడ్డుకున్నారని రజత్ భార్గవ వివరించారు. అక్రమాలకు అడ్డుపడుతున్నాననే కారణంతో, కక్షపూరితంగా తన పరిధిలో ఉండాల్సిన ఆర్డర్ ఫర్ సప్లై అధికారాలను సైతం నా వద్ద నుండి లాగేసుకున్నారని ఆయన మేజిస్ట్రేట్ ఎదుట ఇచ్చిన స్టేట్మెంట్లో పూసగుచ్చినట్లు వివరించారు. ప్రభుత్వ పెద్దల అండదండలతోనే బెవరేజెస్ కార్పొరేషన్లో ప్రైవేటు వ్యక్తుల జోక్యం పెరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆయన తెలిపిన వివరాలు ఇప్పుడు ఏపీ రాజకీయాన్ని షేక్ చేస్తున్నాయి.

