ఏపీలో అధికారంలో ఉన్న జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీకి చెందిన అధికారిక ప్రతినిధులు, నేతలు ఎవరూ కూడా ప్రస్తుతం ఎలాంటి మీడియా చర్చల్లో పాల్గొనవద్దని అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కొత్త కమిటీలను అధికారికంగా ప్రకటించే వరకు ఏ ఒక్కరూ కూడా మీడియా ముందుకు వెళ్లకూడదని పార్టీ నాయకులకు స్పష్టం చేసింది. పార్టీ ప్రస్తుతం సంస్థాగత పునర్వ్యవస్థీకరణపై పూర్తిగా దృష్టి సారించింది. పాత కమిటీల స్థానంలో సరికొత్త వ్యూహాలతో, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వీలుగా కొత్త కమిటీల నియామక ప్రక్రియ వేగంగా జరుగుతోంది.
Also Read : విద్యార్థులపై పెల్లెట్ గన్ లు.. అసలు ఏంటీ తుపాకి కథ..?
ఈ లోపు పాత ప్రతినిధులు లేదా వేర్వేరు నేతలు మీడియా చర్చల్లో పాల్గొని భిన్నమైన వ్యాఖ్యలు చేస్తే, అది అనవసర గందరగోళానికి దారితీసే అవకాశం ఉందని అధిష్టానం భావించింది. మరో ప్రధాన కారణం ఏంటంటే, అధికారికంగా పార్టీ వాయిస్ ను బలంగా, ఎలాంటి తడబాటు లేకుండా వినిపించే సమర్థులైన కొత్త ప్రతినిధులను ఎంపిక చేసే పనిలో నాయకత్వం ఉంది. సబ్జెక్ట్ ఉన్న నేతలను, వివిధ అంశాలపై పూర్తి అవగాహన ఉన్న వారినే ఇకపై మీడియా ముందుకు పంపాలని జనసేన ప్లాన్ చేస్తోంది.
Also Read : కాపులను రెచ్చగొడుతున్న వైసీపీ.. వర్కవుట్ అవుతుందా..?
అందుకే కొత్త టీమ్ వచ్చే వరకు ఒక క్రమశిక్షణతో కూడిన వ్యూహాత్మక మౌనాన్ని పాటించాలని నిర్ణయించారు. ఈ తాత్కాలిక నిషేధంతో పార్టీ శ్రేణుల్లో మరియు మీడియా వర్గాల్లో సరికొత్త చర్చ మొదలైంది. కొత్త కమిటీల ప్రకటన రాగానే, అధిష్టానం ఒక నిర్దేశిత రోడ్ మ్యాప్ ను, అధికారిక లైన్ ను కొత్త ప్రతినిధులకు వివరించనుంది. ఆ తర్వాతే సరికొత్త జోష్ తో, స్పష్టమైన గళంతో జనసేన ప్రతినిధులు మీడియా డిబేట్లలోకి అడుగుపెట్టనున్నారు. అప్పటివరకు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి ఎవరైనా టీవీ చర్చల్లో పాల్గొంటే వారిపై కఠిన చర్యలు ఉంటాయనే సంకేతాలు కూడా అందుతున్నాయి.

