మాజీ సీఎం కేసీఆర్ ఫాం హౌస్ ఉన్న.. ఎర్రవల్లి గ్రామంలో భూముల సర్వే ప్రక్రియ అత్యంత కీలక దశకు చేరుకుంది. ఫాం హౌస్ కోసం అక్రమంగా భూములను ఆక్రమించారు అనే ఆరోపణల నేపధ్యంలో.. శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో.. రెవెన్యూ, సర్వే అధికారులు క్షేత్రస్థాయిలో వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే నేటి నుంచి సర్వే నెంబర్ 325 పరిధిలోని భూములను సమగ్రంగా రీ-సర్వే చేసేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు.
Also Read : SAAP ఆఫీస్ వద్ద ఉద్రిక్తత.. టీచర్లపై వైసీపీ దాడి..!
ఈ సర్వే ద్వారా భూముల అసలు విస్తీర్ణం ఎంత..? ఎవరి ఆధీనంలో ఎంత భూమి ఉందనే విషయాలపై స్పష్టత రానుంది. ఈ సర్వే నిర్వహణకు ముందు అధికారులు క్షేత్రస్థాయిలో చేపట్టిన చర్యలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సర్వే నెంబర్ 325 పరిధిలోని భూములకు సంబంధించి ఇప్పటికే సరిహద్దుల మార్కింగ్ ప్రక్రియను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ప్రభుత్వ అధికారిక మ్యాప్‌లు, పాత రికార్డుల ఆధారంగా ఈ మార్కింగ్ పూర్తి చేయడంతో నేటి నుంచి జరగబోయే తుది క్షేత్రస్థాయి సర్వే మరింత సులువుగా, పారదర్శకంగా సాగే అవకాశం కనిపిస్తోంది.
Also Read : తిరుమల లడ్డూ పై, జగన్ కి ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిందా?
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులను మొహరించారు. సర్వేను పారదర్శకంగా ముగించేందుకు అధికారులు ఎర్రవల్లి గ్రామంలోని సుమారు 100 మంది రైతులకు ఇప్పటికే అధికారికంగా నోటీసులు జారీ చేశారు. సర్వే జరుగుతున్న సమయంలో రైతులు తమ భూములకు సంబంధించిన ఒరిజినల్ పట్టాదార్ పాస్ పుస్తకాలు, లింక్ డాక్యుమెంట్లు మరియు ఇతర సరిహద్దు ఆధారాలతో క్షేత్రస్థాయికి రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ సర్వే పరిధి ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో, రానున్న రెండు మూడు రోజుల్లో మరో 100 మందికి పైగా రైతులకు కూడా నోటీసులు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

