అవుట్డోర్ అడ్వర్టైజింగ్ రంగంలో వ్యాపారం చేయాలనుకున్న మహిళా పారిశ్రామికవేత్త శోభా రెడ్డి అనుభవించిన వేధింపుల ఉదంతం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. చట్టబద్ధమైన టెండర్ల కోసం అర్జీ పెట్టుకుంటే అధికార పార్టీ నాయకుల నుంచి ఇలాంటి దారుణమైన అనుభవాలు ఎదురు కావడంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే ఒక వ్యక్తి ఒక మహిళను అర్ధరాత్రి గెస్ట్ హౌస్‌కు రమ్మని పిలవడం ఇప్పుడు దుమారం రేపుతోంది. కేవలం పదిహేను నిమిషాలు తన కారులో ఆనంద పరచాలని నీచమైన కోరిక కోరడం మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అవుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read : సౌదీకి హౌతీల దెబ్బ.. వణుకుతున్న అమెరికా..!
ఈ విషయంలో శోభారెడ్డి ముందు సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డిని నేరుగా ట్యాగ్ చేస్తూ వివరంగా లేఖ విడుదల చేసిన తర్వాత.. ఆమెకు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆమె సెల్ఫీ వీడియో ద్వారా తనకు ఎదురైన చేదు అనుభవం గురించి పూస గుచ్చినట్లు వెల్లడించారు. కన్నీరు పెట్టుకున్నారు. దీంతో ఈ ఘటన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా మచ్చ తీసుకువచ్చేలా మారింది. ప్రజాస్వామ్యంలో అర్హత ఆధారంగా కాకుండా ఇలాంటి అనైతిక మార్గాల ద్వారా పనులు సాధించుకోవాలని ఒత్తిడి చేయడం దారుణం. వ్యాపార రంగంలో మహిళలకు రక్షణ కరవవుతోందనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనం అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
బాధితురాలు బహిరంగంగా తన ఆవేదన వెళ్లగక్కినా ప్రభుత్వ పెద్దలు ఇప్పటివరకు స్పందించకపోవడం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నంలో భాగంగా, సీఎంకు అత్యంత సన్నిహితుడిగా భావించిన ఒక వ్యక్తిని సంప్రదించినట్లు తెలిపారు. కానీ, తన సమస్య గురించి మాట్లాడేందుకు గెస్ట్ హౌస్‌కు రమ్మని నేరుగా కోరారని మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు ఒక్క అపాయింట్మెంట్ ఇస్తే మున్సిపల్ శాఖలో జరుగుతున్న అవినీతిపై ఆధారాలతో సహా ఇస్తానని శోభారెడ్డి తమ వీడియోలో వెల్లడించారు. తనని గెస్ట్ హౌజ్‌కి రమ్మని వేధించిన వ్యక్తి గురించి సీఎంకే నేరుగా చెబుతానని కూడా శోభా రెడ్డి తెలిపారు.
Also Read : ఇప్పటికీ వారికే పదవులు.. ఎందుకీ నిర్లక్ష్యం..?
తన వెనుక ఏ రాజకీయ పార్టీ లేదని.. కాంగ్రెస్ నేత వల్ల తాను ఇబ్బంది పడింది నిజమన్నారు. ఫయీం ఖురేషి , రోహిన్ రెడ్డిలను అన్నా అని పిలుస్తాను.. అడ్వర్టైజింగ్ కాంట్రాక్ట్ పై ఈ ఇద్దరి సాయం అడిగితే చేస్తామన్నారు కానీ చేయలేదన్నారు. అందుకే సీఎం సన్నిహితుడైన మరో నేత దగ్గరకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. సోషల్ మీడియాలో తన పై దుష్ప్రచారం చేయొద్దని వేడుకున్నారు. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని.. పేదరికం నుంచే వచ్చినట్లు వెల్లడించారు. “సీఎం సర్ ఒక్క అపాయింట్మెంట్ ఇవ్వండి ప్లీజ్..” అంటూ శోభారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు.

