తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన ‘తెలంగాణ ఫస్ట్.. పార్టీ నెక్స్’ అనే వ్యాఖ్యలు తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. పార్టీ నినాదానికి భిన్నంగా ఆయన చేసిన ఈ ప్రకటన, రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలకు దారితీసింది. జాతీయ పార్టీలు తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తాయి. కానీ ఈటల వైఖరి ఆయన తనదైన ప్రత్యేక మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు సూచిస్తోంది. తెలంగాణ ప్రయోజనాలే పరమావధి అని ప్రకటించడం వెనుక ఆయన భవిష్యత్తు రాజకీయ వ్యూహాలు దాగి ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తనపై వస్తున్న అసంతృప్తి ఆరోపణలను అధిగమిస్తూ, రాష్ట్ర స్థాయిలో తన స్వతంత్రతను చాటుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారని స్పష్టమవుతోంది.
Also Read : కూటమి ప్రభుత్వంలో పవన్ మాటే ఫైనల్..?
ఈటల రాజకీయ ప్రయాణం ఇప్పుడు కీలక మలుపులో ఉన్నట్లు స్పష్టంగా కనబడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ కేంద్ర నాయకత్వం చేస్తున్న విమర్శలకు ఈటల రాజేందర్ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఆ పార్టీలో గందరగోళాన్ని సృష్టించింది. కల్వకుంట్ల కుటుంబం ఏటీఎంగా ప్రాజెక్టును మార్చుకుందని ప్రధాని మోదీ, అమిత్ షా వంటి అగ్రనేతలు ఆరోపిస్తుంటే, ఈటల మాత్రం దాన్ని పక్కన పెట్టకూడదని వాదించారు. ఉత్తర తెలంగాణ రైతులకు ప్రాజెక్టు కీలకం అని పేర్కొనడం బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని విస్మయానికి గురిచేసింది. సొంత పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఈటల చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలు పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లాయి.
Also Read : చంద్రబాబుకు ఉన్న నీటి సోయి… రేవంత్‌కు రావాలి!
ప్రత్యర్థి పార్టీపై సమరభేరి మోగిస్తున్న తరుణంలో సొంత నాయకుడే ఇలాంటి మాటలు మాట్లాడటం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇది కేవలం అనుకోకుండా జరిగిన వ్యాఖ్య కాదని, కావాలనే చేసిన ప్రకటన అని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వంటి సున్నితమైన అంశాల్లో కూడా ఈటల రాజేందర్ ఇదే తరహాలో సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. వ్యవస్థ మొత్తాన్ని నిందించకూడదని, కేవలం కొందరి తప్పులకే దీన్ని పరిమితం చేయాలని ఈటల అప్పట్లో కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో దాడి చేయాల్సిన సమయంలో, ఈటల వైఖరి మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటం బీజేపీ నేతలకు మింగుడుపడటం లేదు.
Also Read : హిందూ ఓటర్లను వదిలేద్దాం.. వైసీపీ తెలివిగా ఆడుతోందా..?
తెలంగాణ సెంటిమెంట్‌ను బలంగా వాడుకోవాలని ప్రయత్నిస్తున్న ఈటల, బీజేపీ జాతీయ విధానాలకు లోబడి కాకుండా ప్రాంతీయతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తన పాత పార్టీ అయిన బీఆర్ఎస్ పట్ల ఈటల అనుసరిస్తున్న ఈ ధోరణి, భవిష్యత్తులో రాజకీయ కూటములు ఎలా ఉండబోతున్నాయో అనే సందేహాలను పెంచుతోంది. ఈటల తన స్వతంత్ర ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఇటువంటి వైఖరిని అవలంబిస్తున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బీజేపీలో తన ప్రాధాన్యత క్రమంగా తగ్గుతోందనే ఆవేదన ఈటల రాజేందర్ మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీలో బీసీ ఫేస్ అని చెప్పుకున్నా, బండి సంజయ్ లాంటి నాయకుల చుట్టూనే రాజకీయాలు తిరుగుతుండటం ఈటలకు రుచించడం లేదని తెలుస్తోంది.
పార్టీ తగినంత గుర్తింపు ఇవ్వడం లేదని, తనను పూర్తిగా విశ్వసించడం లేదని ఈటల అంతర్మథనంలో ఉన్నారు. ఈ అసంతృప్తి వల్లే ఆయన సొంతంగా ప్రత్యేక గ్రూపు నడుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో రాణించాలన్న ఆశలు నెరవేరకపోవడంతో, ఆయన తిరిగి తెలంగాణపైనే తన దృష్టి సారిస్తున్నారు. పార్టీ నిర్ణయాలతో విభేదిస్తూ, తనదైన రాజకీయ ముద్ర వేయడానికి ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ నియమ నిబంధనలను పక్కనబెట్టి, తెలంగాణ నేతగా తనకంటూ ఒక ఇమేజ్ నిర్మించుకోవాలని ఆశిసున్నారని రాజకీయ విశేషకులు బావిస్తున్నారు.
కేంద్ర మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కకపోవచ్చన్న వార్తలు ఈటల రాజేందర్ వ్యూహాలను మార్చినట్లు కనబడుతోంది. తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం లభిస్తుందనే విషయంలో పార్టీలో జరుగుతున్న చర్చలు ఈటలను ఆలోచనలో పడేశాయి. సామాజిక సమీకరణాలు, అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో తన పేరును అధిష్టానం పరిశీలించడం లేదని గ్రహించినట్లు సమాచారం. అందుకే రాజకీయ భవిష్యత్తు కాపాడుకోవడానికి, పార్టీకి అతీతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. జాతీయ పార్టీలో ఉంటూనే ప్రాంతీయ నేతగా ఎదగడం ద్వారా తన ఉనికిని చాటుకోవాలని భావిస్తున్నారు. త్వరలోనే తన నిర్ణయాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని, రాజకీయ విశ్లేషకులు ఆయన ప్రతి అడుగును గమనిస్తున్నారు. బీజేపీకి దూరమవ్వాలని ఈటల ఆలోచిస్తున్నారా లేక బీఆర్ఎస్‌తో సన్నిహిత సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారా అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ప్రశ్నగా మారింది. పార్టీ నాయకత్వంతో విభేదాలు పెరుగుతుండటంతో, ఆయన తదుపరి అడుగుపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ క్రమశిక్షణ దాటి చేస్తున్న ఈ వ్యాఖ్యలు, అధిష్టానాన్ని ఇబ్బందికి గురిచేస్తున్నాయి.

