బీహార్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే పేరు మార్మోగుతోంది.. అదే ప్రశాంత్ కిషోర్ మూడు దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి అజేయమైన కోటగా ఉన్న బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పీకే ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం, అక్కడ పొలిటికల్ మైండ్ గేమ్త్ కమల దళానికి పీకే చుక్కలు చూపిస్తున్నారు. ఉప ఎన్నికలో పీకే నామినేషన్ వేసిన కేవలం 24 గంటల వ్యవధిలోనే బీజేపీ అభ్యర్థి అభిషేక్ సిన్హా అర్ధాంతరంగా బరి నుంచి తప్పుకున్నారు. ఒకప్పుడు తెర వెనుక ఉండి దేశవ్యాప్తంగా ఎందరో నాయకులను గెలిపించిన ఈ కింగ్‌మేకర్, ఇప్పుడు తానే నేరుగా ప్రజా క్షేత్రంలోకి దిగి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. బంకీపూర్ ఉపఎన్నిక బరిలో ప్రశాంత్ కిషోర్ స్వయంగా నిలబడటంతో బీజేపీ తీవ్ర ఆత్మరక్షణలో పడింది.
Also Read : రాకాలో ఐకాన్ స్టార్ సరికొత్త రికార్డు..!
పీకే లాంటి చాణక్యుడి ముందు అభిషేక్ సిన్హా చాలా బలహీనమైన అభ్యర్థి అని బీజేపీ అంతర్గత సర్వేల్లో తేలడమే కాకుండా, సిన్హాకు సంబంధించిన కొన్ని వివాదాస్పద ఆర్థిక లావాదేవీల చిట్టా పీకే చేతికి చిక్కిందనే ప్రచారం పాట్నా రాజకీయాలను కుదిపేస్తోంది. ఆ ఆధారాలు ఎన్నికల ప్రచారంలో బయటపడితే పార్టీ పరువు గంగలో కలుస్తుందని భావించిన అధిష్టానమే, బంటితో బలవంతంగా నామినేషన్ ఉపసంహరింపజేసిందని భావిస్తున్నారు. ఈ పరిణామంతో, ప్రత్యర్థులను ఈడీ, సీబీఐలతో భయపెట్టే బీజేపీ.. ఇప్పుడు ఓటమి భయంతో తానే రంగు మార్చి పారిపోతోందంటూ పీకే వేసిన సెటైర్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
నష్ట నివారణ చర్యల్లో ఓ బీజేపీ యువజన విభాగంలో పనిచేసే నీరజ్ కుమార్ సిన్హాను కొత్త అభ్యర్థిగా అత్యవసరంగా బరిలోకి దించింది. ఐదుసార్లు వరుసగా గెలిచిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయిన ఈ స్థానం, కమలదళానికి అత్యంత ప్రతిష్టాత్మకం. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారిపై నితిన్ నవీన్ 51 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. అయితే, ఇప్పుడు పీకే స్వయంగా రంగంలో ఉండటం, ఆర్జేడీ తరఫున మళ్లీ రేఖా కుమారి పోటీలో నిలవడంతో ఈ ఉపఎన్నిక రసవత్తరమైన త్రిముఖ పోరుగా మారింది. జులై 30న జరగబోయే పోలింగ్, ఆగస్టు 3న వచ్చే ఫలితాలను ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ భవిష్యత్తుకు ఒక రెఫరెండంగా ప్రకటించారు.
Also Read : తెలంగాణా ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం..!
మొదటి విడతలోనే అభ్యర్థిని మార్చాల్సి వచ్చేలా చేసి బీజేపీ డిఫెన్స్‌లో పడిందనే భావన సెట్ చేయడంలో పీకే ఇప్పటికే సగం విజయం సాధించారు. మూడు దశాబ్దాలుగా జనసంఘ్, ఆర్ఎస్ఎస్ మూలాలున్న బంకీపూర్ ఓటర్లు పీకే డిజిటల్ గ్రౌండ్ మేనేజ్మెంట్ ప్రయోగాలకు జై కొడతారా, లేక సాధారణ బూత్ స్థాయి కార్యకర్తని నిలబెట్టిన బీజేపీకే ఓటేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

