తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు వేదికగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు యువతకు, పార్టీ శ్రేణులకు సరికొత్త దిశానిర్దేశం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తు తరాల జీవన ప్రమాణాలను మార్చడమే లక్ష్యంగా సరికొత్త అడుగులు వేస్తున్నట్లు ప్రకటించారు. ఈసారి సరికొత్తగా నిర్వహించిన వర్చువల్ మహానాడు విధానంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : మాజీ సీఎం అరెస్ట్ కు రంగం సిద్దం..?
డిజిటల్ మాధ్యమంలో జరుగుతున్నందున రోడ్లపై వాహనాల హోరు తగ్గిందేమో కానీ, పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లో జోరు మాత్రం అస్సలు తగ్గలేదని కొనియాడారు. కేవలం మీటింగ్ నిర్వహించే మోడల్ మాత్రమే మారిందని, మహానాడు విశిష్టత, పార్టీ అంతర్గత చర్చల విధానం ఏమాత్రం మారలేదని స్పష్టం చేశారు. ప్రతి అంశంపైనా లోతుగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుత సమాజంలో సరికొత్త తరాలుగా వస్తున్న టీనేజర్స్, జెన్ జీ, ఆల్ఫా జెన్ యువతకు ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతికతను అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.
Also Read : తాడేపల్లి నుంచి జగన్ ఫ్యూచర్ ప్లాన్.. సక్సెస్ అవుతుందా..!
“ప్రపంచంలో ఎక్కడో ఉన్న అధునాతన టెక్నాలజీని మన రాష్ట్రానికి తీసుకొచ్చాం. ఈ అధునాతన సాంకేతిక విప్లవం అంతా మన భవిష్యత్తు తరాల కోసమే” అని ఆయన పేర్కొన్నారు. యువత ఈ టెక్నాలజీని కేవలం కాలక్షేపానికి కాకుండా, తమ జీవితాల్లో ఉన్నత స్థానాలకు ఎదగడానికి ఒక ఆయుధంగా మలచుకోవాలని సూచించారు. యువతరం సాంకేతికతను పూర్తిగా అందిపుచ్చుకుని, సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచ వేదికలపై అద్భుతాలు సృష్టించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఐటీ, ఏఐ వంటి ఆధునిక వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దేశ విదేశాల్లో తెలుగు యువత ఐటీ రంగంలో రాణించడానికి నాడే పునాది పడిందని, ఆ పరంపరను ప్రస్తుత యువత మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు.

